ఇక మీడియా అలకలు తీరిపోతాయా?

ఎప్పుడైతే ఎల్ ఎల్ పి అంటూ కొంతమంది ప్రొడ్యూసర్లు ఛాంబర్ కాకుండా వేరే కుంపటి పెట్టారో అప్పటి నుంచి స్టార్ట్ అయితే తెలుగు సినిమా రంగంలో సమస్య. ఎల్ ఎల్ పి జనాలు బాగానే…

ఎప్పుడైతే ఎల్ ఎల్ పి అంటూ కొంతమంది ప్రొడ్యూసర్లు ఛాంబర్ కాకుండా వేరే కుంపటి పెట్టారో అప్పటి నుంచి స్టార్ట్ అయితే తెలుగు సినిమా రంగంలో సమస్య. ఎల్ ఎల్ పి జనాలు బాగానే వున్నారు. కానీ అందులో చేరి, దాని ద్వారా ప్రకటనలు అవీ ఇచ్చే సినిమాలకు చచ్చే చావు వచ్చింది. ఎందుకంటే ఎల్ ఎల్ పి అనేది రెండు చానెళ్లకు నాలుగైదు డైలీలకు మాత్రమే ప్రకటనలు ఇస్తుంది. మిగిలిన వారికి ఇవ్వదు. దాంతో ఇక అప్పటి నుంచి ప్రకటనలు లభించని మీడియా సంస్థలు ఆ సినిమాలను ఉతికి ఆరేయడం ప్రారంభించాయి.

ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈ తరహా పద్దతికి తెరతీసింది. సినిమా వాళ్ల బతుకుల్ని ఉతికి ఆరేయడం ప్రారంభించింది. సినిమాలను తొలి రోజే తూర్పారపట్టడం మొదలైంది. దీంతో ఎల్ ఎల్ పి కి ప్రాణ ప్రతిష్ట చేసిన దిల్ రాజు లాంటి నిర్మాతే చేతులెత్తేసి తన సినిమాకు ఆంధ్రజ్యోతికి కూడా ప్రకటనలు ఇచ్చే స్థాయికి వచ్చారు. సో, మిగిలిన మరి కొన్ని మీడియా సంస్థలు కూడా ఇదే బాట పట్టాయి. మరీ అంతలా కాకున్నా, సినిమా విడుదలైన గంటల్లోనే నెగిటివ్ సమీక్షలు, దారుణ మైన రేటింగ్ లు ప్రకటించడం, వాటిని వ్యాప్తి చేయడం ప్రారంభించాయి. 

ఆఖరికి సినిమాలకు ఇదో సమస్యగా మారిపోయింది. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారింది. చాలామంది ఎందుకొచ్చిన గొడవ వాళ్లకు ప్రకటనలు ఇచ్చేస్తే పోలా అని ఇచ్చేస్తున్నారు. దీంతో ఇక రాను రాను ఎల్ ఎల్ పి వుండి ఉపయోగం కనిపించడం లేదు. ఆ రేటు కాంట్రాక్టు, నెగోషియేషన్లు, అన్నీ చాంబర్ ద్వారా మాట్లాడుకుని, మళ్లీ చాంబర్ ద్వారానే ప్రకటనలు ఇప్పించేస్తే బెటరేమో అన్న ఆలోచనలు పురుడుపోసుకున్నాయి.

ఎల్ ఎల్ పి లో లేని ఒక చానెల్ ఇటీవల్ చాంబర్ తో అగ్రిమెంట్ కు వచ్చినట్లు వినికిడి. అంటే ఆ చానెల్ కు, చాంబర్ ద్వారా ఆ రేట్ కు ప్రకటనలు ఇచ్చుకోవచ్చు. సో ఇక ఈ చానెల్ నుంచి సినిమా తెరమీద పడిన గంటల్లోనే నెగిటివ్ పబ్లిసిటీ స్టార్ట్ చేసే పని ఇకపై వుండకపోవచ్చు.

ఇదిలా వుంటే ఇలా మీడియా సంస్థలు అన్నింటికీ నిర్మాతలు ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రకటనలు ఇచ్చుకుంటున్నపుడు ఇక ఎల్ ఎల్ పి తో అవసరం ఏముంటుంది? అన్న డిస్కషన్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాకపోయినా, మరి కొన్నాళ్లలో ఎల్ ఎల్ పి ని మెల్లగా కిల్ చేసేసి, పక్కన పెట్టేస్తారని టాక్ వినిపిస్తోంది. అప్పుడు ఇక మళ్లీ గతంలో మాదిరిగా చాంబర్ తోనే మీడియా సంస్థలు అగ్రిమెంట్ చేసుకుని, నిర్మాతలు చాంబర్ ద్వారానే ప్రకటనలు ఇచ్చుకుంటారన్నమాట.