ఎన్టీఆర్ పై ఎందుకింత నెగిటివ్?

పాపం, ఎన్టీఆర్ ను చూస్తే జాలేస్తుంది. భగవంతుడు మంచి రూపం ఇచ్చాడు. నటన ఇచ్చాడు. కానీ టాలీవుడ్ లో అజాత శతృవు అయ్యే అదృష్టం మాత్రం ఇవ్వలేదు. సినిమా విడుదలైతే చాలు నెగిటివిటీ స్టార్ట్…

పాపం, ఎన్టీఆర్ ను చూస్తే జాలేస్తుంది. భగవంతుడు మంచి రూపం ఇచ్చాడు. నటన ఇచ్చాడు. కానీ టాలీవుడ్ లో అజాత శతృవు అయ్యే అదృష్టం మాత్రం ఇవ్వలేదు. సినిమా విడుదలైతే చాలు నెగిటివిటీ స్టార్ట్ అయిపోతోంది.

అది ఎందుకు జరుగుతోందో ఎవరికీ తెలియదు. వేరే హీరో అభిమానులా? లేదా ఎన్టీఆర్ తమ పార్టీ నేతకు గిట్టని వాడని అనుకునే జనాలా? లేదా ఎన్టీఆర్ తమకు అవకాశం ఇవ్వలేదనే నిర్మాతలు, డైరక్టర్లా? ఇలా ఎవరి రీజన్లు వారికి వుంటున్నాయేమో కానీ, మొత్తానికి ఎన్టీఆర్ మీద వున్నంత నెగిటివ్ టాలీవుడ్ జనాల్లో మరెవరి మీదా లేదేమో? 

ఇలా అంటే ప్రతి ఒక్కరు ఒంటికాలిపై లేచి ఖండించేయచ్చు. ఛ.. అంతా ఉత్తుత్తి ఊహాగానం అని. కానీ ఎవరికి వాళ్లకే తెలుసు ఇదెంత వాస్తవమో? తెరచాటు మాటలు ఒకటి, తెర ముందు మాటలు మరొకటి. 

నిన్నటికి నిన్న జై లవకుశ షో పడిన దగ్గర నుంచి ప్రారంభమైంది ఇండస్ట్రీలో ప్రచార పర్వం. 'పెద్ద ఏమీ లేదటగా?.. ఫ్యాన్స్ కు కూడా పెద్దగా నచ్చలేదటగా.. ఏముంది సినిమాలో. ఎన్టీఆర్ ఎప్పుడూ బాగానే చేస్తాడు.. ఎన్టీఆర్ డ్యాన్స్ లు ఎప్పుడూ వుండేవే.. ఏముంది కొత్తగా..' ఇవీ పాయింట్లు.

సరే అది అయిపోయింది. సాయంత్రానికి, మర్నాడు, ఉదయానికి అంటే శుక్రవారం నాటికి మళ్లీ మొదలు. ' నిన్న ఈవెనింగ్ కు డౌన్ అయ్యిందట కదా? సీడెడ్ లో కొన్ని థియేటర్లు ఖాళీ అంట, ఆన్ లైన్ చూసారా, ఎక్కడ పడితే అక్కడ ఖాళీ..' ఇలా మొదలైంది మళ్లీ. మరోపక్క నాన్ బాహుబలి రికార్డులు అంటే, 'అబ్బే అసలు అమ్మింది ఎవరికి? ఎన్టీఆర్ జనాలకే గా? వాళ్లు కరెక్ట్ ఫిగర్లు ఇస్తారా?' నమ్మడానికి లేదంటూ కామెంట్లు. 

అందరి సినిమాల మీదా ఇలాగే అంటే అది వేరే సంగతి, ఇండస్ట్రీలో ఇంతే, ఇండస్ట్రీలో ఇంతే అని అర్థం చేసుకోవచ్చు, కానీ అన్ని సినిమాలకు ఇంతలా జరగడం లేదు, అదే ఎన్టీఆర్ సినిమాల దగ్గరకు వచ్చే సరికి ఆగడం లేదు. దీనికి ఒకటే పరిష్కారం. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ల మాదిరిగా తిరుగులేని హిట్ లు ఇవ్వడమే. అప్పడు ఇక ఎలాంటి నోళ్లయినా మూత పడాల్సిందే.