భాస్కర్ వెనక్కి.. తేజకే వెంకీ ఛాన్స్!

విక్టరీ వెంకటేష్ కు గ్యాప్ వచ్చేసింది. ఆచితూచి సినిమాలు ఎంచుకునే ప్రయత్నంలో వెంకటేష్ ఉన్నారు. అయితే తాజాగా రామానాయుడు స్టుడియోస్ ప్రాంతంనుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. దర్శకుడు తేజతో వెంకటేష్ తర్వాతి ప్రాజెక్ట్ ఉంటుందని,…

విక్టరీ వెంకటేష్ కు గ్యాప్ వచ్చేసింది. ఆచితూచి సినిమాలు ఎంచుకునే ప్రయత్నంలో వెంకటేష్ ఉన్నారు. అయితే తాజాగా రామానాయుడు స్టుడియోస్ ప్రాంతంనుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. దర్శకుడు తేజతో వెంకటేష్ తర్వాతి ప్రాజెక్ట్ ఉంటుందని, సురేష్ ప్రొడక్షన్స్ పతాకం మీదనే ఇది రూపొందుతుందని తెలుస్తోంది. తేజ కమ్ బ్యాక్ చిత్రంగా ‘నేనే రాజు నేనే మంత్రి’ రూపంలో రానాతో సినిమా చేసే అవకాశం ఇచ్చిన సురేష్ బాబు నిర్మాణంలోనే.. వెంకటేష్- తేజ కాంబినేషన్ లో కూడా చిత్రం రూపొందబోతున్నట్లు సమాచారం. 

వెంకటేష్ తర్వాతి ప్రాజెక్టు గురించి చాలా కాలంగా రకరకాల కాంబినేషన్లు నడుస్తున్నాయి. లింగా నిర్మాత రాక్ లైన్ వెంకటేష్- బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందించేలా ఒక కథను వెంకటేష్ కు వినిపించారు. దీనికి సంబంధించిన స్క్రిప్టు వర్కు కూడా షురూ అయింది. అయితే.. ఇందులో ఒక యువ హీరో క్యారెక్టర్ కూడా ఉంటుందని.. దానికి ఎవరూ సెట్ కాలేదని సమాచారం. విజయ్ దేవరకొండను ఆ పాత్రకు తీసుకోవడానికి నిర్మాత చాలా ప్రయత్నించినప్పటికీ.. ఓకే కాలేదు. 

తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా వెనక్కు వెళుతుందని.. సురేష్ బాబు నిర్మాణంలోనే వెంకటేష్ తర్వాతి సినిమా ఉంటుందని, దానికి తేజ దర్శకత్వం వహిస్తారని వినిపిస్తోంది. నేనే రాజు నేనే మంత్రి అత్యద్భుతం కాకపోయినప్పటికీ.. దర్శకుడిగా తేజ ను మళ్లీ ట్రాక్ మీదకు తీసుకువచ్చింది. ఇప్పుడు అగ్రహీరోతో చేసే ఛాన్స్ వస్తే.. దాన్ని తేజ ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.