తనను హన్సిక వదిలేసి వెళ్లిందని ఆ మధ్య శింబు వాపోయాడు. తామిద్దరం ప్రేమించుకున్న మాట వాస్తవమే అని, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నామని.. అయితే హన్సిక తనను వదిలేసి వెళ్లిపోయిందని అప్పట్లో శింబు మీడియా దగ్గర వ్యాఖ్యానించాడు. అయితే ఆ వ్యవహారంపై హన్సిక ఎలాంటి కామెంట్లూ చేయలేదు. మరి అప్పటికే నయనతారతో పీకల్లోతు ప్రేమ వరకూ మునిగి వెళ్లి వచ్చిన శింబు.
ఆ తర్వాత హన్సికతో కూడా వ్యవహారం నడిపానని స్పష్టం చేశాడు. కానీ తమ ప్రేమకథ సుఖాంతం కాలేదని చెప్పాడు. మరి ఈ ప్రేమకథ గురించి తాజాగా టీ. రాజేందర్ చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. తన తనయుడి ప్రేమకథ గురించి రాజేందర్ స్పందించాడు. శింబు మొదటి ప్రేమకథ గురించి ఈ తండ్రి స్పందించలేదు కానీ, హన్సికతో వ్యవహారంపై మాత్రం స్పందించాడు.
శింబుని హన్సిక వదిలిపెట్టి వెళ్లడానికి కారణం తమ కుటుంబం పెట్టిన కండీషన్లే అని రాజేందర్ వ్యాఖ్యానించాడు. తల్లిదండ్రులు అంటే శింబుకి చాలా ప్రేమాభిమానాలు అని, తమను నొప్పించకూడదని అనుకుంటాడని రాజేందర్ చెప్పాడు. హన్సికతో పెళ్లి అనుకున్నప్పుడు తమ గురించినే శింబు ఆలోచించాడన్నాడు. శింబు తల్లి ఉష.. పెళ్లికి ముందు నటించింది. పెళ్లితో ఆమె సినిమాలకు స్వస్తిపలికింది.
తనను పెళ్లి చేసుకుంటే.. హన్సిక కూడా సినిమాల్లో చేయడానికి వీలుండదని శింబు చెప్పాడట. తన తల్లిలాగే, వివాహానంతరం సినిమాలకు దూరం కావాలని కండీషన్ పెట్టాడట. అయితే వివాహం చేసుకుని సినిమాలకు దూరం కావడానికి హన్సిక సమ్మతించలేదట. సినిమాలకు దూరం అయితేనే పెళ్లి.. అని శింబు స్పష్టం చేయడంతో వారి ప్రేమకథ కంచికి చేరిందని రాజేందర్ వివరించాడు.
అయినా చేతినిండా అవకాశాలు ఉన్న హీరోయిన్లు పెళ్లితో సినిమాలకు దూరం కావడానికి ఇష్టపడటం లేదీ మధ్య. సమంత కూడా పెళ్లి తర్వాత నటిస్తానని అంటోంది. ఇక పెళ్లైన వాళ్లు కూడా మళ్లీ వస్తామని అంటున్నారు. మరి ఇలాంటి వాతావరణంలో హన్సికకు శింబు కండీషన్లు పెట్టడంతో.. హన్సిక అతడిని పూర్తిగా దూరం పెట్టేసిందనమాట.