చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డిలో ఓ పాత్రలో కనిపిస్తానని స్వయంగా సునీల్ ప్రకటించాడు. అంతకుమించి ఈ సినిమా గురించి తనను డీటెయిల్స్ అడగొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు. హీరోగా కొనసాగుతూనే కామెడీ పాత్రలు కూడా చేస్తానని ప్రకటించిన కొన్ని రోజులకే సైరాలో సునీల్ కు వేషం దక్కడం విశేషం.
నిజానికి ఖైదీనంబర్ 150లోనే చిరంజీవితో పాటు కనిపించాలని అనుకున్నానని, కానీ చిరంజీవితో నటించాల్సిన టైమ్ కు తను హీరోగా చేస్తున్న సినిమా క్లైమాక్స్ షూటింగ్ రావడంతో… కాల్షీట్ల సమస్య వల్ల నటించలేకపోయానని అంటున్నాడు సునీల్.
స్వతంత్ర ఉద్యమ కాలం నాటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రకు సంబంధించిన ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలు కూడా ఉంటాయని ఎవరూ ఊహించలేదు. సునీల్ ఎంట్రీతో సైరా సినిమాలో అది కూడా ఉందనే విషయం స్పష్టమైంది.
సైరా సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. 200కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం సెట్స్ నిర్మాణం జరుగుతోంది. దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది.