సౌత్‌ స్టార్‌ హీరోల రాజకీయం.. కామెడీ అయిపోతోంది!

వీళ్లంతా పెద్ద పెద్ద యాక్షన్‌ హీరోలు.. ఫ్యాన్స్‌, ఇమేజ్‌, పేర్ల మీదే ఇజాలు కలిగిన వాళ్లు. మరి సినిమాలతో సమకూరిన దీన్నంతా ఎందుకు క్యాష్‌ చేసుకోకూడదు.. అనే లెక్క వీళ్లను రాజకీయాల వైపు లాగుతోంది.…

వీళ్లంతా పెద్ద పెద్ద యాక్షన్‌ హీరోలు.. ఫ్యాన్స్‌, ఇమేజ్‌, పేర్ల మీదే ఇజాలు కలిగిన వాళ్లు. మరి సినిమాలతో సమకూరిన దీన్నంతా ఎందుకు క్యాష్‌ చేసుకోకూడదు.. అనే లెక్క వీళ్లను రాజకీయాల వైపు లాగుతోంది. గత రెండు దశాబ్దాల్లో రాజకీయాల్లోకి వచ్చి సత్తాచాటిన వారు ఎవరూలేరు. అయినప్పటికీ.. ఇప్పుడు స్టార్‌ హీరోలు కొండకు ఒక వెంట్రుక వేస్తున్నారు. వస్తే కొండ పోతే.. వెంట్రుక అన్నట్టుగా ఉంటుంది వీళ్ల లెక్క.

ఒకరు కాదు ఇద్దరు కాదు.. సౌత్‌లో ఇప్పుడు అరడజను మందికిపైగా హీరోలు రాజకీయ ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. విషయం ఏమిటంటే.. వీళ్లు పూర్తిగా సినిమాలు వదిలేసి జనాల్లోకి వచ్చే ధైర్యం చేయడంలేదు. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే.. మరోవైపు రాజకీయం కూడా చేద్దామన్నట్టుగా ఉంది వీళ్ల తీరు.

వాళ్లపై వాళ్లకే నమ్మకం లేదు..!

ఇన్నేళ్ల సినీ ప్రయాణంతో అభిమానగణాన్ని, ఇమేజ్‌ను సంపాదించుకున్నాం.. దాన్ని రాజకీయంతో క్యాష్‌ చేసుకుందాం అని అనుకుంటున్నారు. మరి అందుకు అనుగుణంగా ధైర్యంగా ముందుకు రావడంలేదు వీళ్లెవ్వరూ. కొందరు తర్జనభర్జనలు పడుతుంటే.. మరికొందరు మాత్రం సగం ముందుకు సగం వెనక్కు అంటున్నారు.  ఒక అడుగు ముందుకు రెండు అడుగుల వెనక్కు అన్నట్టుగా ఉంది వీళ్ల కథ. దీనికి ప్రథమ ఉదాహరణ పవన్‌ కల్యాణ్‌. ఇది వరకూ రెండు సార్వత్రిక ఎన్నికల ముందు రెండు పార్టీలతో పవన్‌ ఫ్యాన్స్‌ ముందుకు వచ్చాడు.

ఫస్ట్‌ ఇన్‌స్టాల్‌ మెంట్‌లో ప్రజారాజ్యం, సెకెండ్‌ ఇన్‌స్టాల్‌ మెంట్లో జనసేనతో పవన్‌ జనం ముందుకు వచ్చాడు. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. పవన్‌ కేవలం ఎన్నికల ముందు మాత్రమే రాజకీయంలో కనిపిస్తాడు. ఆ తర్వాత మళ్లీ మామూలే. 2009 ఎన్నికల ముందు ప్రచారం చేసి వెళ్లి ఆ తర్వాత 2014లో కొత్త పార్టీతో వచ్చాడు. ఇక 2014లో ప్రచారం చేసి వెళ్లి.. ఇంకా పూర్తిస్థాయిలో జనం ముందుకురాలేదు. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి అంటున్నాడు కానీ.. వచ్చే ఏడాది అక్టోబర్‌కు గానీ పవన్‌ చేతిలో ఉన్న సినిమాలను పక్కనపెట్టి రాజకీయాల వైపు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

ఇక రజనీకాంత్‌ సంగతి సరేసరి.. వస్తున్నాను అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. అయితే రజనీకి ఇంకా కాన్ఫిడెన్స్‌ లేదు. సూపర్‌ స్టార్‌ ఇంకా తటపటాయిస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే రజనీకాంత్‌ చేతిలో రెండు సినిమాలున్నాయి. అవి పూర్తిచేసి రాజకీయాల్లోకి వచ్చేస్తాడనేది ఒక ఊహాగానం. మరి రజనీ అంతధైర్యం చేస్తాడా? ఇంకా ఒకింత సందేహంగానే ఉంది. ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చేసి.. మరో ఎంజీఆర్‌ను అయిపోగలను అనే ఆత్మవిశ్వాసమే ఉంటే రజనీకాంత్‌ ఇంత ఆలోచించే వాడు కాదు, ఆయన భయాలు ఆయనకు ఉన్నాయని తమిళనాట నుంచి వినిపిస్తున్న మాట.

ఇక రాజకీయాల్లోకి వస్తా.. వచ్చేశా.. అంటున్న మరో హీరో కమల్‌. మిగతా వారితో పోలిస్తే కమల్‌ ది పూర్తి డిఫరెంట్‌ రాజకీయంగా కనిపిస్తోంది. కమల్‌ పక్కా కమ్యూనిస్టులా మాట్లాడుతున్నాడు. కాషాయ జెండా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాడు. మరి కమల్‌ మాత్రమేనా, పవన్‌ కల్యాణ్‌ ది కూడా కమ్యూనిజమే అనే వాళ్లు ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో మోడీకి జై కొట్టేయడంతోనే పవన్‌ కల్యాణ్‌లోని కమ్యూనిస్టు మాయం అయ్యాడు.

ఇంకా చేగువేరా, ఫైడర్‌ క్యాస్ట్రో అని పవన్‌ అంటే.. అదేదో ప్రహసనమే తప్ప మరోటికాదు. కమల్‌ రాజకీయ ప్రయాణం విషయానికి వస్తే.. ఈ హీరో కూడా కెరీర్‌ను వదిలేసుకుని వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. కమల్‌లో మంచి నటుడు ఉన్నాడు, దర్శకుడు ఉన్నాడు.. మంచి సినిమాలు తీస్తే బాగుంటుంది అని దక్షిణాది సినీ ప్రేక్షకులు ఆశిస్తున్నారు. కమల్‌ కూడా సినిమాలను పూర్తిగా పక్కనపెట్టే అవకాశాలు ఏమీలేవు. సొంతంగా పార్టీని ఏర్పాటు చేసినా, లేదా సీపీఎంలో చేరినా.. సినిమాల్లో కొనసాగే అవకాశాలున్నాయి.

అలాగే ముఖ్యమంత్రిని అయపోవాలనో, కింగ్‌మేకర్‌ను అయిపోవాలనో కమల్‌ కలలు కనడం లేదనే విషయం కూడా స్పష్టం అవుతోంది. అలాగే తమిళనాట కమల్‌ ప్రభావం కూడా నామమాత్రమే. కనీసం విజయ్‌ కాంత్‌ స్థాయిలో కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే.. కమల్‌ మాస్‌ హీరో కాదు. మాస్‌ హీరోల రాజకీయానికి, క్లాస్‌ హీరోల సినిమాల కలెక్షన్లకు తేడా ఉన్నట్టుగానే వారి రాజకీయం పట్ల కూడా భిన్నమైన స్పందనలుంటాయి. అయితే కమ్యూనిజం సిద్ధాంతాల మేరకు కమల్‌ ఎమ్మెల్యేగానో, ఎంపీగానో పోటీ చేస్తే.. ఆయన వరకూ ఎక్కడ పోటీ చేసినా గెలవడం ఖాయం.

ఇక ఉపేంద్ర.. ఈయన కూడా రాజకీయాల్లోకి వస్తానని ఆ మధ్య ప్రకటించాడు. మళ్లీ మాయం అయ్యాడు. శాండల్‌ వుడ్‌లో విభిన్నమైన సినిమాలు చేసి.. దక్షిణాది మొత్తం గుర్తింపును సంపాదించుకున్నాడు ఉప్పీ. ఆ తర్వాత రూటు మార్చి మాస్‌ ఎంటర్‌ టైనర్లు చేసి కన్నడనాట స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. మరి ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చి సత్తాచాటాలని ఉప్పీ భావిస్తున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రకటన కూడా చేసేశాడు. ఉపేంద్ర కమలం పార్టీ పట్ల సానుకూలంగా ఉండవచ్చు అనే ఊహాగానాలున్నాయి.

ఇప్పటికే కన్నడనాట రాజకీయాల్లోకి వచ్చిన సినిమా వాళ్లున్నారు. రెబెల్‌ స్టార్‌ అంబరీష్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నాడు. మరి ఉప్పీ సొంత పార్టీతో వస్తాడా? లేక బీజేపీలో చేరతాడా? అనే విషయాలపై స్పష్టతలేదు. ఆ హీరో కూడా రాజకీయాల్లోకి వస్తానని అన్నాడు కానీ.. ఏ రూట్లో సాగడం అనే అంశంపై ఏం మాట్లాడలేదు. ఎలాగూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరెంతో దూరంలేదు కాబట్టి.. ఉప్పీ త్వరలోనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే ఉప్పీ ప్రభావం ఎంతవరకూ ఉంటుందని కన్నడనాట ఆరాతీస్తే.. అబ్బే నామమాత్రమే.. అనేమాట వినిపిస్తోంది.

చిరు దారెటు..?

ఇక రాజకీయాల్లోకి ఎంటర్‌ అయ్యే దశలోని సినిమా హీరోలు కొందరైతే క్రాస్‌ రోడ్స్‌లో ఉన్న వారి కథ మరోటి. వీళ్లు ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చేశారు. ప్రజాతీర్పు తీసుకున్నారు, తిరస్కరణ పొందారు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. ఇలాంటి వారిలో మెగాస్టార్‌ చిరంజీవి, తమిళ హీరో విజయ్‌ కాంత్‌లు ముఖ్యులు. ముందుగా విజయ్‌ కాంత్‌ పరిస్థితి ఏమిటంటే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు.

కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేకపోయాడు. సినిమాల్లోకి తిరిగి వద్దామంటే వయసు, ఆరోగ్యం సహకరించడంలేదు. భార్య అతి జోక్యం విజయ్‌కాంత్‌ పార్టీని నామరూపాల్లేకుండా చేసింది. ప్రత్యామ్నాయంగా ఎదుగుతాడనే దశ నుంచి అడ్రస్‌ లేకుండా చేసుకునే దశకు వచ్చాడు ఈ నల్ల ఎంజీఆర్‌. ఇక చిరు రాజకీయ ప్రస్థానాన్ని వివరించనక్కర్లేదు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేసి, తను సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. త్వరలోనే ఆ సభ్యత్వ కాలం ముగియనుంది. మరి ఇప్పుడు మెగాస్టార్‌ ఏం చేయబోతున్నాడు? అనేది ఆసక్తిదాయకమైన అంశం.

ఆయనను తమ పార్టీల్లో చేర్చుకోవడానికి అటు బీజేపీ వాళ్లు, ఇటు తెలుగుదేశం, మరోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌లు ప్రయత్నాలు చేస్తున్నాయనే మాట వినిపిస్తోంది. ఆయన సినిమాలు చేసుకోవచ్చు.. రాజ్యసభ సభ్యత్వ కాలాన్ని ఎక్స్‌టెండ్‌ చేస్తాం, మా పార్టీల తరపున ప్రచారం చేసిపెడితే చాలు.. అనేది ఈ పార్టీలు పెడుతున్న కండీషన్‌. అయినా ఒకసారి ఎంపీ హోదాను చూసిన చిరంజీవి దాన్ని వదులుకుంటాడా? అనేది సందేహం. కాంగ్రెస్‌ తరఫున అయితే ఛాన్స్‌లేదు, ఇప్పుడు మళ్లీ పార్టీ మారితే.. మరీ అవకాశవాది అనే.. విమర్శలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇదీ చిరంజీవి పరిస్థితి. మరి ఏ నిర్ణయం తీసుకుంటాడో!