ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాల మీద అభిమానంతో ఉండడంలో కొత్తేమీలేదు. కేంద్రమంత్రిగా రెండు రాష్ట్రాల్లోనూ చాలా విస్తృతంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన వెంకయ్యనాయుడు.. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా అదే అలవాటు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన అక్కినేని అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమంలోనూ తానే ముఖ్య అతిథిగా మెరిసారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు చెప్పిన మాటలు చాలా విలువైనవి. అక్షర సత్యాలు. అయితే అదే సమావేశంలో.. తన సహజ అభిప్రాయాలు వెలిబుచ్చినప్పుడు ఒక రకంగానూ, పురస్కార గ్రహీత గురించి చెప్పేప్పుడు మరో రకంగానూ పరస్పర విరుద్ధంగా వెంకయ్యనాయుడు మాట్లాడడం విశేషం. వెంకయ్యనాయుడు చెప్పిన ఒక వాదన నిజమే.. అయితే ఆ వాదన ప్రకారం.. రాజమౌళికి, అక్కినేని అవార్డు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
వివరాల్లోకి వెళితే…
‘‘సినిమా వినోదం కోసమే కాదు.. చైతన్యం తేవడానికీ తీయాలి. ప్రతి సినిమాలోనూ ఓ సందేశం ఉండాలి’’ అని వెంకయ్యనాయుడు అన్నారు. ఇది ఆయన సహజ ప్రసంగం. అంతరంగంలోని భావం. అయితే రాజమౌళి గురించి చెప్పాల్సి వచ్చేసరికి ‘‘ప్రపంచ పటంలో భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగరేసిన ప్రతిభాశీలి రాజమౌళి.. ఆయన ఏఎన్నార్ పురస్కారానికి అర్హుడు’’ అంటూ ఇంకా కొనసాగించారు.
అయితే.. వెంకయ్యనాయుడు తొలివాదనకు, రాజమౌళి ప్రశంసలకు మధ్య చాలాతేడా ఉంది. రాజమౌళి నిస్సందేహంగా అద్భుతమైన దర్శకుడు. కమర్షియల్ సినిమా కోణంలోంచి మాత్రమే.. ఆయన ప్రపంచం అబ్బురపడేలా తెలుగు సినిమా ఖ్యాతిని తెలియజెప్పారు. అందులో సందేహంలేదు. కానీ ‘బాహుబలి’నే తీసుకుంటే.. వెంకయ్య తొలి సందేశాన్ని ప్రతిబింబించేలా అందులో ఏం సందేశం ఉంది? ఆ చిత్రం ప్రజలకు ఏం చైతన్యం కలిగించేలా ఉంది? బాహుబలి సంగతి వదిలేద్దాం. రాజమౌళి తీసిన ఏ చిత్రం.. ప్రజల్లో ఎలాంటి చైతన్యం కలిగించడానికి ప్రేరకంగా ఉండగలదు. అన్నీ ఫక్తు కమర్షియల్ పార్మాట్ లోని సినిమాలే.
వినోదంలో ప్రేక్షకలోకాన్ని మరింత సంభ్రమానికి గురిచేసి.. విజయాలు నమోదు చేయడమే ఆయన టెక్నిక్. అందులో మాత్రం ఆయన అసమాన ప్రతిభా సంపన్నుడు అనడంలో ఎవరికీ సందేహం లేదు. అయితే అక్కినేని అవార్డుకు తగిన సందేశాత్మక చిత్రాలే సందేహమే. అందుకే సినిమా గురించి- రాజమౌళి గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పిన మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.