ముప్పు ముంగిట్లో పెద్ద సినిమాలు

సినిమాలు ఎన్ని వచ్చినా బాగుంటే చూస్తారు. థియేటర్ల సమస్య లేదు. అందువల్ల సినిమా బాగుండడమే కీలకం లాంటి మాటలు తరచు ఇండస్ట్రీలో వినిపిస్తుంటాయి. కానీ కాలం మారిపోయింది. డిజిటిలైజేషన్ పుణ్యమా అని రహస్యం అనేది…

సినిమాలు ఎన్ని వచ్చినా బాగుంటే చూస్తారు. థియేటర్ల సమస్య లేదు. అందువల్ల సినిమా బాగుండడమే కీలకం లాంటి మాటలు తరచు ఇండస్ట్రీలో వినిపిస్తుంటాయి. కానీ కాలం మారిపోయింది. డిజిటిలైజేషన్ పుణ్యమా అని రహస్యం అనేది ఎంతకాలమో దాగడం లేదు. సినిమా థియేటర్లో పడితే మనది కాదు అన్నట్లు తయారైంది పరిస్థితి. పైరసీ అనేది ఒక రూపంలో చుట్టు ముట్టడం లేదు. కేవలం వ్యాపారం కోసం జరిగే పైరసీ కన్నా సోషల్ నెట్ వర్క్ లీకేజ్ లు ప్రమాదంగా మారిపోయాయి.

గతంలో సినిమాలో ఓ మంచి పాట వుంటే జనాలు పదే పదే ఆ పాట కోసం సినిమాకు వెళ్లే పరిస్థితి వుండేది. ఇప్పుడు లేదు. ఆరేసుకోబోయి పాట కోసం అడవిరాముడు పదుల సంఖ్యలో చూసిన వారు ఎందరో? కానీ ఇప్పుడు థియేటర్లో పడుతుంటేనే, పట్టుకుని సెల్ ఫోన్ లో పెట్టేసుకుంటున్నారు. బాలయ్య ‘మామా ఏక్ పెగ్ లా’ పాట విడియో ఎన్ని వాట్సప్ గ్రూపుల్లో తిరుగుతోందో తెలిసిందే. ఎంత ఫ్యాన్స్ అయినా పాట కోసం సినిమాకు వెళ్లే సీన్ లేదు. అలాగే మంచి సీన్లు, ఇంకేమనా.

సినిమా పరిపూర్ణంగా అద్భుతం అనిపించుకుంటే తప్ప లాంగ్ రన్ అన్నది కలగానే వుండిపోతోంది. ఇటీవలి కాలంలో అలా లాంగ్ రన్ వచ్చిన సినిమా బాహుబలి, ఖైదీ నెంబర్ 151 తరువాత ఫిదా మాత్రమే అనుకోవాలి. నేనే రాజు నేనే మంత్రి, అర్జున్ రెడ్డి హిట్ లు అయినా కూడా లాంగ్ రన్ కు నోచుకోలేదు. లాభాలు ఆర్జించాయి. అది వేరే సంగతి. ఇలాంటి నేపథ్యంలో వందల కోట్ల వ్యాపారం అయిన పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటి? ఎంత ఓపెనింగ్స్ కుమ్మేసినా, ఫస్ట్ వీక్ లో ముఫై, నలభై కోట్లు లాగేసినా, ఇంకా రాబట్టాల్సిన కోట్ల పరిస్థితి ఏమిటి?

ఇప్పటి దాకా వంద కోట్ల రేంజ్ లో వసూళ్లు వచ్చిన సినిమాలు వున్నాయి కానీ, బాహుబలిని మినహాయిస్తే, వంద కోట్ల రేంజ్ లో మార్కెట్ చేసిన సినిమాలు లేవు. 60 నుంచి 70కోట్లకు అమ్మి వంద కోట్లు వస్తే అది వేరే సంగతి. కానీ ఇప్పుడు ఈవారం విడుదలవుతున్న జైలవకుశ తెలుగు రాష్ట్రాల్లోనే 80కోట్ల మేరకు విక్రయాలు జరుపుకుంది. స్పైడర్ కూడా దాదాపు 70 నుంచి 75కోట్ల మేరకు తెలుగు రాష్ట్రాల్లో అమ్మకాలు జరుపుకుంది. ఈ రెండు సినిమాలు బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసంలో కనీసం 80నుంచి 90కోట్ల వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో సాధించాలి.

ఇలా ఇంత మొత్తం సాధించడం అన్నది ఒక్క వారంలో జరిగే ఫీట్ కాదు. సూపర్ హిట్ టాక్ వస్తే కనీసం రెండు నుంచి మూడు వారాలు పడుతుంది. అది కూడా సోలో అయితే. అలాంటిది పోటాపోటీగా ఒక్క వారం గ్యాప్ తో రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. ఒక విధంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితి అనే చెప్పాలి. ముందు వచ్చిన సినిమా టాక్ బాగుంటే వెనుక వచ్చిన సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది. టాక్ బాగాలేకుంటే, వెనకవచ్చిన సినిమా వల్ల ముందు వచ్చిన సినిమా దెబ్బతింటుంది. అదే విధంగా వెనుక వచ్చిన సినిమా పరిస్థితి కూడా వుంటుంది.

ఈ ఏడాది జనవరిలో, ఆగస్టులో రెండు సార్లు సినిమాలు భారీగా ఢీకొన్నాయి. ఆగస్టులో రెండు సినిమాలు భారీగా నష్టపోయాయి. మళ్లీ సెప్టెంబర్ లో ఇలాగే ఢీకొంటున్నాయి. పరిస్థితి బాగుంటే ఇండస్ట్రీకి మంచిందే. లేదూ అంటే రెండు సినిమాలు కలిపి దాదాపు 150కోట్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఒడ్డిన పరిస్థితి. నిజానికి కనీసం రెండు వారాలు గ్యాప్ వుండేలా వచ్చి వుంటే వేరేగా వుండేది. కానీ అలా జరగలేదు. గ్యాప్ సినిమాల మీద భయంతో కాదు. మారిన పరిస్థితుల రీత్యా అవసరం పడుతోంది. ఇంతంత రేట్లు అన్నపుడు ఆ మాత్రం గ్యాప్ తప్పని సరి.

అన్ని విషయాల్లో కూర్చుని మాట్లాడుకునే నిర్మాతలు, హీరోలు ఇక్కడ మాత్రం ఎందుకో బిగుసుకుపోతున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్, ప్రెస్టీజ్ సమస్యలు అడ్డం పడుతున్నాయి. దాంతో నిర్మాతలు కూర్చుని మాట్లాడుకోవాలనుకున్నా కుదరని పరిస్థితి వుంటోంది. హీరోలే సినిమాల బడ్జెట్ పెరగడానికి కారణం అవుతున్నారు. హీరోల మధ్య పోటీనే డేట్ల సర్దుబాటుకు అడ్డం పడుతోంది. కానీ నష్టం వస్తే మాత్రం బయ్యర్లు, నిర్మాతలు కుదేలవుతున్నారు.

హీరోలు ముందుగానే పది హేను నుంచి ముఫై కోట్లు తీసుకుని, తమ ఆస్తులు హ్యాపీగా పెంచుకుంటున్నారు. ఈ పెరుగుడు ఎప్పుడు విరుగుడు అవుతుందో? ఇండస్ట్రీ మళ్లీ ఎప్పుడు నిలబడి నీళ్లు తాగుతూ హాయిగా వుంటుందో ?