హీరోలంతా వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఎక్కడో తేడా వస్తోంది. గ్యాప్ అనివార్యం అవుతోంది. ఎన్టీఆర్ కు రెండు సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో, మరోటి కొరటాల శివ డైరక్షన్ లో. జైలవకుశ తరువాత ఎన్టీఆర్ రెండు నెలలు గ్యాప్ తీసుకుంటున్నారు.
యూరప్ వెళ్లి డీ టాక్సినేషన్, ఆపైన మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రయినింగ్ చేసుకుని వస్తారు. అంటే నవంబర్ ఆఖరుకు. అయినా అప్పటికి త్రివిక్రమ్ రెడీ కారు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం చేస్తున్న పవన్ సినిమా జనవరి ఫస్ట్ వీక్ లో విడుదల అవుతుంది. ఆ తరువాత త్రివిక్రమ్ కాస్తయినా గ్యాప్ తీసుకుని, ఎన్టీఆర్ సినిమాకు రెడీ అవుతారు. అంటే అక్టోబర్ నుంచి జనవరి దాకా ఎన్టీఆర్ ఖాళీ.
అదే విధంగా త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తరువాత కూడా గ్యాప్ తప్పడం లేదట. కొరటాల శివ ప్రస్తుతం చేస్తున్న మహేష్ బాబు సినిమాను జనవరికి ఫినిష్ చేసి, రామ్ చరణ్ సినిమా మీదకు వెళ్లాలి. రామ్ చరణ్ తన సుకుమార్ సినిమా పూర్తి చేసి, అప్పుడు ఈ ప్రాజెక్టుకు రెడీ కావాలి. ఇద్దరు కలిసి సినిమా స్టార్ట్ చేసి, పూర్తి చేసే సరికి 2018 ఆఖరు వచ్చేస్తుందని తెలుస్తోంది. అప్పుడు మళ్లీ ఎన్టీఆర్ వెయింటింగ్ నే.
అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్-కొరటాల శివ సినిమాల మధ్యలో మంచి ప్రాజెక్టు కనుక దొరకితే ఇరికించి, ఫినిష్ చేయాలన్న ఆలోచనలో ఎన్టీఆర్ వున్నట్లు తెలుస్తోంది. లేదూ అంటే గ్యాప్ తప్పదు. గతంలో మాదిరిగా కొన్నాళ్లు ఖాళీగా వుండాలి.