ఇందిరమ్మ ఇళ్లు Vs వైఎస్సార్ జగనన్న కాలనీలు

వైఎస్సార్ హయాంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లు కట్టించి ఇచ్చారు. అయితే ఆ పథకాలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యాయా లేవా అంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్లు…

వైఎస్సార్ హయాంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లు కట్టించి ఇచ్చారు. అయితే ఆ పథకాలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యాయా లేవా అంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్లు చాలా వరకు చేతులు మారాయి, అసలు లబ్ధిదారులు ఎంతో కొంత తీసుకుని వెళ్లిపోయారు. 

వ్యాపార దృష్టితో ఆ ఇళ్లు కొన్నవారెవరూ అందులో ఉండటానికి ఇష్టపడలేదు.  దీంతో సగం ఇళ్లు  ఖాళీ, సగం ఇళ్లలో మాత్రమే బీదా బిక్కీ అద్దెకు ఉంటున్నారు. ఇక రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లన్నీ పేదల కాలనీలుగా మారిపోయాయి. అప్పట్లో మధ్యతరగతి వారు కూడా అపార్ట్ మెంట్లు తీసుకున్నా సౌకర్యాలు లేకపోవడంతో వాటిని వదిలేశారు. 

ఇప్పటికీ అక్కడ సౌకర్యాలు లేవు, ఎలాగోలే పేదలు నెట్టుకొస్తున్నారంతే. వైఎస్ఆర్ బతికున్నంత వరకు ఇందిరమ్మ ఇళ్ల గురించి కానీ, రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ల విషయంలో కానీ చాలా శ్రద్ధ చూపేవారు. మౌలిక వసతుల కల్పనకు కృషిచేశారు. కానీ ఆయన మరణం తర్వాత ఆ పరిస్థితి లేదు. దీంతో అవి పూర్తిగా నిరుపయోగంగా మారాయి.

జగన్ జమానాలో ఇలా..

ఇక జగన్ జమానాలో వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ప్రభుత్వమే చొరవ చూపిస్తూ అక్కడ పేదల ఇంటి నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తోంది. 

ప్రభుత్వమే కట్టించి ఇవ్వడం ఒక పద్ధతి, ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే ప్రజలు కట్టుకోవడమ మరో పద్ధతి, కేవలం మెటీరియల్ మాత్రమే ప్రభుత్వం వద్ద తీసుకుని ప్రజలే నిర్మించుకోవడం మరో పద్ధతి. ఈ మూడు పద్ధతుల్లో లబ్ధిదారులు దేనికి ఒప్పుకున్నా.. ఆర్థిక సాయం చేసి ఇంటి నిర్మాణానికి సహకరించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం జగన్.

ఇళ్లు నిర్మిస్తే సరిపోతుందా.. మురికివాడలని పేరుపడితే ఎలా..?

పేదలు కట్టుకునే చిన్న చిన్న ఇళ్లు మాత్రమే ఉంటాయి కాబట్టి.. వైఎస్సార్ జగనన్న కాలనీలకు పేదల బస్తీ అనే పేరు పడటం ఖాయం. అయితే అది పేరులోనే ఉండాలని, మౌలిక వసతుల్లో మాత్రం తీసుపోకూడదని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 

ఇప్పటికే ఆయా కాలనీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనం పెంచి పోషిస్తున్నారు. అంతర్గత రోడ్లు విశాలంగానే ఉన్నాయి, వాటిని ఎవరూ ఆక్రమించకుండా ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు.

ఇంటి నిర్మాణంలో డీవియేషన్లు ఉండకూడదని లబ్ధిదారులకు స్పష్టంగా చెప్పారు. ప్రతి 2వేల జనాభాకు ఓ అంగన్వాడీ ప్రతి 1500 ఇళ్లకు ఓ లైబ్రరీ అందుబాటులోకి తేబోతున్నారు. సచివాలయాలకు అనుబంధంగా ఉండే.. జనతా బజార్లను కూడా వీలయితే జగనన్న కాలనీలలో ఏర్పాటు చేయాలని సూచించారు జగన్. 

పారిశుధ్యం, పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలే కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ మురికి వాడలుగా మారకూడదని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, అందులో ఇళ్ల నిర్మాణం పూర్తవడానికి కూడా ప్రభుత్వమే సాయం అందిస్తూ, మౌలిక వసతులు కల్పించడాన్ని కూడా బాధ్యతగా తీసుకుంటోంది. 

గత ప్రభుత్వాలేవీ ఇలా ఆలోచించలేదు కాబట్టే.. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలంటే దాన్ని పేదల కాలనీగా, మురికివాడగా భావిస్తారు. కానీ జగన్ మాత్రం వాటిని ఆదర్శ కాలనీలుగా మార్చి చూపిస్తానంటున్నారు. అదే జరిగితే.. జగనన్న కాలనీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 

కుప్పంలో టీడీపీ 14 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది