వైసీపీకి మ‌హిళా విభాగం ఉందా?

ఏపీ అధికార పార్టీకి మ‌హిళా విభాగం ఉందా? ఉంటే వైసీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు ఎవ‌రు? త‌దిత‌ర ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో మ‌హిళా విభాగం కీల‌క పాత్ర…

ఏపీ అధికార పార్టీకి మ‌హిళా విభాగం ఉందా? ఉంటే వైసీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు ఎవ‌రు? త‌దిత‌ర ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో మ‌హిళా విభాగం కీల‌క పాత్ర పోషిస్తోంది. వంగ‌ల‌పూడి అనిత నేతృత్వంలో తెలుగు మ‌హిళా విభాగం ప్ర‌తిరోజూ అధికార ప‌క్షంపై విమ‌ర్శ‌ల దాడి చేస్తుంటారు. 

మ‌రోవైపు అధికారంలో ఉన్న వైసీపీలో మాత్రం మ‌హిళా విభాగం ఒక‌టి ఉంద‌నే విష‌య‌మే తెలియ‌డం లేదు. ప్ర‌త్య‌ర్థి పార్టీలో తెలుగు మ‌హిళలు యాక్టీవ్‌గా ఉంటూ, ప్ర‌భుత్వంపై గ‌ట్టిగా పోరాటం చేస్తున్న ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీలో అస‌లు ఆ ఊసే లేని దుస్థితి. అందుకే వైసీపీ మ‌హిళా విభాగంపై చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాత్రం ప్ర‌తి అంశంలోనూ మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేయాల‌ని చెబుతున్నారు.తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో  బుధవారం మంత్రులు, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో సీఎం జగన్‌ సమావేశ మయ్యారు. జ‌గ‌న్ మాట్లాడుతూ బూత్ కమిటీల్లో 50 శాతం మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించాల‌న్నారు. వీరిలో కనీసం 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూడాల‌ని ఆదేశించారు. జ‌గ‌న్ ఆలోచ‌న బాగుంది.

మ‌రి వైసీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు ఎవ‌రు? ఎప్పుడైనా ఆ పేరుతో ఎవ‌రైనా ప్రెస్‌మీట్ పెట్ట‌డ‌మే, ప్ర‌త్య‌ర్థుల‌కు దీటుగా స‌మాధానం ఇవ్వ‌డాన్ని ఎవ‌రైనా చూశారా? అప్పుడెప్పుడో వైసీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలిగా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేరు వినిపించేది. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌హిళా విభాగం అధ్య‌క్షురాల‌నే మాటే వైసీపీ మ‌రిచి పోయిన‌ట్టుంది. 

బ‌హుశా ఏపీ మ‌హిళా క‌మిష‌నే వైసీపీ మ‌హిళా విభాగంగా అధికార పార్టీ భావిస్తున్న‌ట్టుంద‌నే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. మ‌రో రెండేళ్ల‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని మ‌హిళా విభాగానికి కొత్త ర‌క్తం ఎక్కించాల్సిన అవ‌స‌రాన్ని వైసీపీ గుర్తించాల్సి వుంది.