సీఎంగా కంటే వైసీపీ అధినేతగా వైఎస్ జగన్ బెస్ట్ అనిపించుకుంటారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బుధవారం మంత్రులు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వీళ్లందరితో వైసీపీ అధినేతగా జగన్ సమావేశం అయ్యారని చెప్పొచ్చు. ఈ సందర్భంగా మరోసారి అధికారంలోకి రావడానికి ఆయన దిశానిర్దేశం చేశారు.
ప్రజల్లో తిరగకుండా, కేవలం అధికారాన్ని ఆస్వాదిస్తూ గడుపుతున్న ప్రజాప్రతినిధుల భారాన్ని మోయలేనని జగన్ స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే పార్టీనే సుప్రీం అని తేల్చి చెప్పారు. వ్యక్తిగత విభేదాలు పార్టీపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడడానికి వీల్లేదని హెచ్చరించారు. కొందరి వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థం కోసం తాను బలి కావడానికి సిద్ధంగా లేనని ఆయన చెప్పకనే చెప్పారు.
సమావేశంలో మనసులో మాటను బయట పెట్టారు. పార్టీ అధ్యక్షునిగా, సీఎంగా తనపై ప్రజల్లో 65% గ్రాఫ్ ఉందని, చాలా మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 40-45 శాతం లోపే ఉందని జగన్ నిజాయతీగా వారి ముందు పెట్టారు. దీన్ని సరిదిద్దుకోవాలని హితబోధ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ పనితీరు, వారిపై జనాభిప్రాయం ఎలా వుందో సర్వే రిపోర్ట్ సిద్ధంగా ఉందని జగన్ చెప్పడం ద్వారా… తాను అమాయకంగా లేనని స్పష్టం చేసినట్టైంది.
ముఖ్యమంత్రిగా తలమునకలైన జగన్, పార్టీని పట్టించుకోలేదనే విమర్శ ఉంది. అయితే నిన్నటి సమావేశంలో జగన్ మాటలు విన్న తర్వాత, ఆ అభిప్రాయాన్ని ఎవరైనా మార్చుకోవాల్సిందే. సర్వే ఆధారంగా టికెట్లు దక్కుతాయని, ఓడిపోయే వారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో కొంతమంది గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని కాదని కాటసాని రాంభూపాల్‌రెడ్డికి పాణ్యం టికెట్ కేటాయించిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
వైఎస్ కుటుంబానికి గౌరు చరిత దంపతులు అత్యంత దగ్గరి వాళ్లు. గెలుపే ఏకైక ఎజెండాతో పని చేసే జగన్‌కు స్నేహాలు, అను బంధాలు అంత ప్రాధాన్య అంశాలు కాదని చెప్పేందుకు గౌరు చరితకు టికెట్ నిరాకరణే నిదర్శనం. రానున్న ఎన్నికల్లో కూడా సుమారు 40 శాతం ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించే పరిస్థితి ఉందనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ముఖ్యమంత్రిగా పాలనలో తలమునకలైన ముఖ్యమంత్రి జగన్, తమను గమనించలేదని అనుకుంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రం నిన్నటి సమావేశం షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
జగన్ మెలకువలోనే ఉన్నారనేందుకు ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయ గ్రాఫే నిదర్శనం. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు జగన్ ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకోడానికైనా వెనుకాడరు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే జగన్‌లో వైసీపీ అధినేత అప్రమత్తమయ్యాడు. ఇప్పటి నుంచే వడపోతకు శ్రీకారం చుట్టారు. గెలుపు గుర్రాల వెతుకులాటలో పడ్డారు.
నిత్యం జనాల్లో ఉండాలని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. వచ్చే నెల నుంచి తాను కూడా ప్రజల్లోనే వుంటానని స్పష్టం చేశారు. పాలకుడిగా కంటే పార్టీ అధినేతగానే ఆయన చురుగ్గా ఆలోచిస్తున్నట్టు… తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.