చాలా కాలంగా సరైన హిట్ కోసం అనే కన్నా, సరైన సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు హీరో అల్లరి నరేష్. ఇటు యంగ్ హీరోల్లా ప్రయోగాలో, రొమాంటిక్ సినిమాలో చేసే ఏజ్ కాదు. పోనీ పెద్ద హీరోల్లా మాస్ మసాలాలు ఒంటికి పడవు. పైగా తనకంటూ ఓ జోనర్ ఫిక్సయిపోయింది. అందులోనే కొట్టుమిట్టాడాలి.
ఎన్ని చేసినా, ఏం చేసినా? అందుకే సరైన రైటర్ దొరకడం లేదు, సరైన కథ పడడం లేదు. దాంతో మళయాల సినిమా రైట్స్ తెచ్చుకుని, మేడ మీద అబ్బాయిగా సెప్టెంబర్ 8న రాబోతున్నాడు. ఈ సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది.
పెద్ద ఇంప్రెసివ్ గా లేదు కానీ, ఈ సినిమాలో కాస్త అల్లరి నరేష్ సినిమా ఛాయలు కచ్చితంగా వుంటాయనే భరోసా ఇస్తోంది. జబర్తస్త్ ఏక్టర్ హైపర్ ఆదితో కలిసి కాస్త బాగానే నవ్వించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.
సినిమా సబ్జెక్ట్, సస్పెన్స్ సరిగ్గా ఎలివేట్ చేసే ప్రయత్నం చేయలేదు. అది కావాలని చేసారా? లేక ట్రయిలర్ కట్ అలా వుందా? అన్నది అనుమానం. టాలెంట్, టాయిలట్ ఆగమన్నా ఆగవు, దగ్గుబాటి రానాను దగ్గరుండి నెట్టకూడదు లాంటి ఫన్ డైలాగులు ట్రయిలర్ లో వినిపించాయి.
నిజానికి ఈ సినిమా మళయాలంలో పెద్ద హిట్. సెల్ఫీ సెంట్రింగ్ గా కథ నడుస్తుంది. మరి ఆ తరహాలో టెంపో పెంచేలా ట్రయిలర్ కట్, అల్లరోడు డిఫరెంట్ గా ట్రయ్ చేస్తున్నాడు అన్నఫీల్ ను తెచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదో? దానివల్ల మళ్లీ మరో అల్లరోడి సినిమా ట్రయిలర్ అన్న ముద్ర పడిపోయే ప్రమాదం వుంది కదా?