తెలుగు దర్శకుల హాట్ క్రియేటివిటీపై హీరోయిన్ల కామెంట్లు ఆగడం లేదు. ఇటీవలే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీరును ఒకింత నిరసిస్తూ మాట్లాడింది తాప్సీ. ఆయన దర్శకత్వంలో తను హీరోయిన్ గా రూపొందిన ఝుమ్మందినాదం సినిమాలో తన బొడ్డు మీద కొబ్బరికాయ వేయడాన్ని ఆమె తప్పుపట్టింది. ఆ దర్శకుడి క్రియేటివిటీ మాటేమిటో కానీ పచ్చి కొబ్బరికాయతో అలా కొట్టడంతో తనకు నొప్పి వచ్చిందని ఆమె చెప్పింది.
అదో పెద్ద వివాదం కావడంతో తర్వాత తన వ్యాఖ్యలను సవరించుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇలియానా కూడా తెలుగు దర్శకుల రొమాంటిక్ క్రియేటివిటీ విషయంలో స్పందించింది. ఈమె దర్శకుడు వైవీఎస్ చౌదరి గురించి పరోక్షంగా ప్రస్తావించింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ‘దేవదాసు’ సినిమాతో ఈమె తెరకు పరిచయం అయ్యింది.
ఆ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే తన తొలి చిత్ర అనుభవాలు ఒకింత చేదువే అని ఇలియానా చెబుతోంది. తన తొలి సినిమా లో పాట చిత్రీకరణ సందర్భంగా ఒక శంఖాన్ని కడుపుపై వేయించారని ఇలియానా చెప్పింది. అది తనను ఇబ్బంది పెట్టిందని వివరించింది. ఈ విషయం గురించి తను దర్శకుడినే అడిగాను అని.. ఎందుకిలా చేస్తున్నారని అడిగానని ఇలియానా వివరించింది.
అదంతా క్రియేటివిటీ అని, అందంగా చూపించడం అని ఆ దర్శకుడు తనకు వివరించాడని ఇలియానా చెప్పింది. హీరోయిన్ల విషయంలో ఈ ‘ఆబ్జెక్టివిటీ’ అనేది తెలుగు చిత్ర పరిశ్రమలో ఉందని.. అయితే అది తెలుగుకు మాత్రమే పరిమితం కాదని, హిందీ చిత్రపరిశ్రమలో కూడా ఉందని ఇలియానా చెప్పుకొచ్చింది.