హరీష్ జైరాజ్ సంగీతం అందించాడంటే పాటలు హిట్ అవ్వాల్సిందే. సాంగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఎంత వద్దనుకున్నా మినిమం గ్యారెంటీ మ్యూజిక్ ఇస్తాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ అలా హిట్ ఆల్బమ్స్ అనిపించుకున్న తెలుగు సినిమాలేవీ థియేటర్ల వద్ద ఆడలేదు. ఇక్కడే వస్తోంది అసలు సమస్య.
వెంకటేష్ తో చేసిన ఘర్షణ సినిమా మినహా.. హరీష్ కంపోజ్ చేసిన ఏ ఒక్క తెలుగు సినిమా హిట్ అయిన దాఖలాల్లేవ్. వాసు, సైనికుడు, మున్నా, ఆరెంజ్.. ఇలా హరీష్ నేరుగా పనిచేసిన ప్రతి తెలుగు సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఆరెంజ్ దెబ్బకైతే హరీష్ ను మరోసారి తెలుగులోకి తీసుకునే సాహసం ఏ హీరో చేయలేకపోయాడు.
మళ్లీ ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నాడు హరీష్ జైరాజ్. అదే స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో మహేష్ చేస్తున్న ఈ సినిమాకు హరీష్ జైరాజ్ బాణీలు అందించాడు. ఈ సినిమాతో ఎలాగైనా తెలుగులో సక్సెస్ ఫుల్ కంపోజర్ గా నిలవాలని అనుకుంటున్నాడు.
స్పైడర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఓ సాంగ్ బాగానే క్లిక్ అయింది. త్వరలోనే మరిన్ని పాటలు కూడా రాబోతున్నాయి. కచ్చితంగా పాటలు బాగుంటాయి. అందులో ఎవరికీ ఎలాంటి డౌట్స్ లేవు. ఎటొచ్చి హరీష్ ఐరెన్ లెగ్ ఎఫెక్ట్ పైనే అందరికీ బోలెడన్ని అనుమానాలు.