Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: వివేకం

సినిమా రివ్యూ: వివేకం

రివ్యూ: వివేకం
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: సత్యజ్యోతి ఫిలింస్‌
తారాగణం: అజిత్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌, వివేక్‌ ఒబెరాయ్‌, అక్షర హాసన్‌, భరత్‌ రెడ్డి, శరత్‌ సక్సేనా తదితరులు
కూర్పు: రూబెన్‌
సంగీతం: అనిరుధ్‌
ఛాయాగ్రహణం: వెట్రి
నిర్మాతలు: సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌
కథ, కథనం, దర్శకత్వం: శివ
విడుదల తేదీ: ఆగస్ట్‌ 24, 2017

'శౌర్యం', 'శంఖం', 'దరువు' చిత్రాలని డైరెక్ట్‌ చేసిన శివ తమిళంలో 'సిరుతై', 'వీరం', 'వేదలాం' చిత్రాలు తీసాడు. అతని సినిమాల జాబితా చూస్తేనే శివకి మాస్‌ మసాలా రంగరించడం ఇష్టమని అర్థమవుతుంది. ఆ ఇమేజ్‌ని ఒకే సినిమాతో చెరిపేసి స్టయిలిష్‌ యాక్షన్‌ సినిమాల స్పెషలిస్ట్‌ అనిపించుకోవడం కోసం 'వివేకం' చేసాడా అనే అనుమానం కలిగేలా ఈ చిత్రాన్ని సగటు హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లా మలిచేందుకు గట్టిగా కృషి చేసాడు. 'మిషన్‌ ఇంపాజిబుల్‌', 'బోర్న్‌ ఐడెంటిటీ' తరహా రేసీ యాక్షన్‌ సినిమాని అజిత్‌ కుమార్‌తో అటెంప్ట్‌ చేసాడు. ప్రయత్నించడంలో తప్పు లేదు కానీ అలాంటి సినిమా చేయాలని అనుకున్నపుడు అందుకు తగ్గ పకడ్బందీ కథ, కథనాలు అవసరమని గ్రహించలేకపోయాడు.

హోలోగ్రామ్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, స్టయిలిష్‌ ఫ్రేమింగ్స్‌, ఫాస్ట్‌ కట్స్‌ వుంటే ఆ తరహా చిత్రం చూసిన అనుభూతికి ప్రేక్షకులు లోనవుతారని అనుకున్నాడే తప్ప, నరాలు తెగే ఉత్కంఠతో ఆ థ్రిల్లింగ్‌ రైడ్‌ని ఎంజాయ్‌ చేయడానికి తగ్గ ప్లాట్‌, స్క్రీన్‌ప్లే వుండాలనేది విస్మరించాడు. దీంతో వివేకం కాస్తా అసలు తక్కువ, హడావిడి ఎక్కువ చందంగా తయారైంది. సినిమా మొదలైంది లగాయతు కెమెరామెన్‌ హ్యాండ్‌ హెల్డ్‌ కెమెరాతో పరుగులు తీస్తూనే వుంటాడు.

దాంతో యాక్షన్‌ పార్ట్‌ మరింత గందరగోళంగా మారింది. సినిమా నిండా యాక్షన్‌ వున్నా కానీ ఎక్కడా స్టంట్స్‌ రిజిష్టర్‌ కావు. రెయిడ్‌ సినిమా మాదిరిగా వేగవంతమైన యాక్షన్‌తో థ్రిల్‌ చేయాలనేది శివ ఉద్దేశం అయి వుండవచ్చు. అయితే రిజిష్టర్‌ అవని స్టంట్స్‌ ఎన్ని చేసినా దాని వల్ల ఉపయోగం ఏమీ వుండదు. ఫైట్లు జరుగుతున్నంత సేపు ఎవరు ఎవరిని కొడుతున్నారో, అసలు అజిత్‌ ఎ్కడున్నాడో అని వెతుక్కోవాల్సి వస్తుంది.

ఫాస్ట్‌ కట్స్‌తో సినిమా చాలా వేగంగా కదులుతోన్న భావన కలిగించడానికి అదే పనిగా ఎడిటింగ్‌లో వివిధ షాట్స్‌ మిక్స్‌ చేసి చూపిస్తూ పోయారు. క్యారెక్టర్స్‌ ఏవీ కుదురుగా కొన్ని క్షణాలు కూడా నిలబడవు. అటు ఇటు కదులుతూ వుంటే సినిమాటోగ్రాఫర్‌ వాళ్లని వెంబడిస్తుంటాడు. దానికి తోడు గ్లేరింగ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌, అర్ధం లేని హోలోగ్రామ్స్‌తో నిండిన స్క్రీన్‌తో కళ్లు విపరీతంగా స్ట్రెయిన్‌ అయిపోతాయి. ఈ హాలీవుడ్‌ హంగామా మధ్యలో నమ్మకద్రోహం, భార్యాభర్తల మధ్య అనురాగం లాంటి ఇండియన్‌ ఎలిమెంట్స్‌ జోడించి ఎమోషనల్‌ కనక్ట్‌ ఏర్పరిచే ప్రయత్నమూ చేసారు.

ఎంత సమస్య వచ్చినా హీరో ఏదో ఒకటి చేసేసి తప్పించేసుకుంటాడని, చివరకు తూట్లు పొడిచి పారేసినా బతికి వచ్చేస్తాడని తెలిసినపుడు ఇక అతనికి ఏమైనా అవుతుందనే ఉత్కంఠ ఎందుకు వుంటుంది? సూపర్‌ హీరోలా కథానాయకుడిని చూపించడంతో పాటు అతనికి దైవం కూడా తోడు వుంటుందంటూ దర్శకుడు తనకి తోచిన విధంగా తీసుకుంటూ పోయాడు. తన చుట్టూ జరిగే దానినే కాకుండా, తన వెనక, భూగోళం అవతల ఎక్కడేమి జరిగినా కానీ అజిత్‌ అక్కడ ప్రత్యక్షమైపోతూ వుంటాడు.

యాక్షన్‌ సీన్స్‌ థ్రిల్‌ ఇవ్వకపోగా, వీడియో గేమ్‌ చూస్తోన్న భావన కలిగిస్తాయి. కథా పరంగా చాలా చిన్న లైన్‌. అంతర్జాతీయంగా న్యూక్లియర్‌ వెపన్స్‌ లాంఛ్‌ చేసే కోడ్స్‌ నటాషా (అక్షర) దగ్గర వుంటాయి. ఆమె ఎవరన్నది అజయ్‌ కుమార్‌ (అజిత్‌), అతని టీమ్‌ కనిపెట్టాలి. ఆమె దగ్గర్నుంచి అవి తీసుకున్న తర్వాత అజయ్‌ని అతని స్నేహితుడు ఆర్యన్‌ (వివేక్‌ ఒబెరాయ్‌), మిగతా స్నేహితులు కలిసి కాల్చి పారేస్తారు. తనపై తీవ్రవాది అనే ముద్ర వేసిన స్నేహితులపై పగ తీర్చుకోవడానికి, ఆ లాంఛ్‌ కోడ్స్‌ దుర్మార్గుల చేతిలో పడకుండా అడ్డుకోవడానికి అజయ్‌ తిరిగి వస్తాడు.

ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం నటాషా ఎవరన్నది కనుక్కోవడం, సెకండాఫ్‌ అంతా ఆర్యన్‌పై అజయ్‌ రివెంజ్‌ తీర్చుకోవడంతోనే సరిపోతుంది. ఈ మధ్యలో అజయ్‌, అతని భార్య హాసిని (కాజల్‌) రిలేషన్‌, ఆమెని అజయ్‌ ఎలా కాపాడుకుంటాడు వగైరా విషయాలతో సెంటిమెంట్‌ యాంగిల్‌ వుంటుంది. యాక్షన్‌ పార్ట్‌ ఏమో ఏం జరుగుతుందో అర్థం కాని గందరగోళంతో కళ్లు బయర్లు కమ్మేట్టు చేస్తే, భార్యాభర్తల సీన్లేమో టెక్నికల్‌ టీమ్‌ అంతా ఆయాసంతో సేద తీరుతున్నట్టుగా ముందుకి కదల్లేమంటూ మొరాయిస్తాయి.

అజిత్‌ ఈ చిత్రం కోసం ఫిట్‌గా తయారయ్యాడు. అతని మేకోవర్‌ ఫాన్స్‌ని మెప్పిస్తుంది. ఫాన్‌ మూమెంట్స్‌ క్రియేట్‌ చేయడంలో సిద్ధహస్తుడైన శివ ఆ పని బాగానే చేసాడు. అజిత్‌ ఫాన్స్‌ అయితే ఆ స్లో మోషన్‌ షాట్లు, స్టయిలిష్‌ ఎలివేషన్లు, అన్నిటికీ మించి ఆ లాస్ట్‌లో 'సల్మాన్‌ ఖాన్‌' మోమంట్‌కి ఖుషీ అయిపోతారు. కాజల్‌కి లిమిటెడ్‌ స్కోప్‌ వున్నా తన పరిధుల్లో బాగానే చేసింది. వివేక్‌ ఒబెరాయ్‌ స్టయిలిష్‌ విలన్‌గా బాగున్నాడు.

అక్షర హాసన్‌ది అతిథి పాత్ర టైపే. ముందే చెప్పినట్టు టెక్నికల్‌ టీమ్‌కి చేతినిండా పని పెట్టారు. ఇన్‌ఫాక్ట్‌ సినిమాటోగ్రాఫర్‌కి అయితే చేతులతో పాటు కాళ్లకి కూడా పని కల్పించారు. అనిరుధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కొన్ని సందర్భాల్లో ఆకట్టుకున్నా కానీ కొన్నిసార్లు విజువల్‌ కన్‌ఫ్యూజన్‌కి సౌండ్‌ పొల్యూషన్‌ జతచేసినట్టు గందరగోళంలో భాగమైపోయింది.

స్టయిలిష్‌ యాక్షన్‌ మూవీ తీస్తూ వెళ్లిన శివకి క్లయిమాక్స్‌లో ఎందుకో మాస్‌ డైరెక్టర్‌నని గుర్తు వచ్చినట్టుంది. మోర్స్‌ కోడ్‌ (ఈ పాయింట్‌ భలే కామెడీ, చూసి నవ్వుకోవాల్సిందే) ద్వారా తాను ఎక్కడున్నదీ అజిత్‌కి కాజల్‌ చెబితే, అతను విలన్‌ దగ్గరకి వచ్చేస్తాడు. ఇక కాజల్‌ విజయ గర్వంతో ఎక్స్‌ప్రెషన్లు ఇస్తూ వుంటే... 'విక్రమార్కుడు'లో అనుష్క మాదిరిగా 'జింతాత్త...' అని దరువేస్తుందా అనే ఫీలింగ్‌ కలుగుతుంది (విక్రమార్కుడు తమిళంలో శివే తీసాడు).

అయితే అంతకుమించిన ఉన్మాదమే తెరపై జరుగుతుంది. కాజల్‌ ఒక పాటందుకుంటే చూస్తున్నది యాక్షన్‌ సినిమానా, జబర్దస్త్‌ ప్రోగ్రామా అంటూ గిల్లి చూసుకోవాల్సి వస్తుంది. ఒకే వాక్యంలో వివేకం గురించి చెప్పాలంటే... తెరపై హీరో, విలన్‌ చదరంగం ఆడుతున్నట్టు భ్రమ పడతారు... కానీ నిజానికి శివ ప్రేక్షకులతో చెడుగుడు ఆడుకున్నాడు.

బాటమ్‌ లైన్‌: అయోమయం!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?