పవన్ కు పట్టని ఎన్నికలు

జనసేన పార్టీ ఎన్నికల కోసం పుట్టలేదు. కేవలం ప్రశ్నించడానికి పుట్టింది అని అంటే ఎవరైనా అనొచ్చు. కానీ అది కూడా లేదన్న సంగతి తెలిసిందే. కేవలం చంద్రబాబుకు అండగా నిలవడానికే జనసేన పుట్టింది అని…

జనసేన పార్టీ ఎన్నికల కోసం పుట్టలేదు. కేవలం ప్రశ్నించడానికి పుట్టింది అని అంటే ఎవరైనా అనొచ్చు. కానీ అది కూడా లేదన్న సంగతి తెలిసిందే. కేవలం చంద్రబాబుకు అండగా నిలవడానికే జనసేన పుట్టింది అని అంటే మాత్రం నమ్మే జనాలు కాస్త ఎక్కువ సంఖ్యలోనే వున్నారు.

పార్టీ పెట్టిన కొత్తలో తెలంగాణ ఉపఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన వుంది అని పవన్ చెప్పారు. కానీ ఆ దిశగా ఆలోచనే చేయలేదు. ఆ తరువాత హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన వుందని అన్నారు. కానీ వాటినీ వదిలేసారు.

ఇక లేటెస్ట్ విషయానికి వస్తే, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు షురూ అయ్యాయి. వైకాపా-తేదేపా కాస్త గట్టిగానే ఢీకొంటున్నాయి. ఈ ఎన్నికను రెండు పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. భాజపా కూడా తేదేపాతో పొత్తు పెట్టుకుని, ఎనిమిది డివిజన్ లు తీసుకుంది. కానీ పవన్ పార్టీ జనసేన మాత్రం ఈ ఎన్నికలను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదన్నది పవన్ కే తెలియాలి.

నిజానికి పవన్ పార్టీ పునాదులైన కాఫు కులస్థులు ఇక్కడ పెద్ద సంఖ్యలో వున్నారు. అందువల్ల పోటీ చేసి, తన పార్టీ సత్తా నిరూపించవచ్చు. కొన్ని నెలలకు ముందు పవన్ కాకినాడలో హోదా మీటింగ్ ప్రత్యేకంగా జరిపారు కూడా. కానీ ఇప్పడు కాకినాడ ఎన్నిక గురించి మాత్రం వీసమెత్తు మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ మరి జనసేన అభిమానులు ఎవరికి ఓటు వేయాలో? వద్దో కూడా చెబుతారో? చెప్పరో? లేదా లోపాయికారీగా సందేశాలు అందిస్తారో? ఏదైనా ఈస్ట్ గోదావరిలోని ఎన్నికల్లోనే పవన్ పార్టీ పోటీ చేయకపోతే, ఇంకెక్కడ చేస్తుందో మరి?