Advertisement


Home > Movies - Reviews
సినిమా రివ్యూ: జయ జానకి నాయక

రివ్యూ: జయ జానకి నాయక
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: ద్వారక క్రియేషన్స్‌
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, తరుణ్‌ అరోరా, శరత్‌ కుమార్‌, నందు, ప్రగ్యా జైస్వాల్‌, వాణి విశ్వనాధ్‌, సితార, క్యాథరీన్‌ తదితరులు
సంభాషణలు: ఎం. రత్నం
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
ఛాయాగ్రహణం: రిషి పంజాబి
నిర్మాత: మిర్యాల రవీందర్‌ రెడ్డి
కథ, కథనం, దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల తేదీ: ఆగస్ట్‌ 11, 2017

బోయపాటి సినిమాలు ఒక రెండు, మూడు చూసినవారికి అవి ఎలాగుంటాయనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన జోన్‌లో, తనకి నచ్చిన జోనర్‌లో సినిమాలు తీసే బోయపాటి శ్రీను ప్రతి సినిమాతోను మాస్‌నే టార్గెట్‌ చేస్తుంటాడు. అతని సినిమాల్లో పాత్రలు, ప్రవర్తనలు, పరిస్థితులు, పర్యవసానాలు అన్నీ ఓవర్‌ ది టాప్‌ అనిపిస్తాయి. ఎమోషన్స్‌ కూడా లార్జర్‌ దేన్‌ లైఫ్‌ అనిపించేలా ప్రెజెంట్‌ చేసే బోయపాటి శ్రీను తన పద్ధతిని అండర్‌ ప్లే చేయడు.

డిఫరెంట్‌ స్టయిల్‌ కోసం, స్టయిలిష్‌ టేకింగ్‌ కోసం, కొత్త ఆడియన్స్‌ కోసం అతను పెట్టే ప్రత్యేకమైన ఎఫర్ట్స్‌ కనిపించవు. తన సినిమాలు నచ్చే ప్రేక్షకుల కోసమే వారికి నచ్చే రీతినే వాటిని తెరకెక్కిస్తుంటాడు. హీరో ఎవరైనా సరే, అతనికి ఇమేజ్‌ వున్నా లేకపోయినా సరే, బోయపాటి మార్కు హీరోయిజం వుండి తీరాల్సిందే.

కొన్నిసార్లు అతని సినిమాల్లోని సీన్లు సెన్స్‌లెన్స్‌గా అనిపించవచ్చు, కొన్ని సందర్భాల్లో సిల్లీగా అనిపించి నవ్వించవచ్చు. అయితే ఎక్కడ గ్రాఫ్‌ లేపాలో, ఎక్కడ ఎమోషన్‌ పండించాలో బోయపాటికి లెక్క బాగా తెలుసు. కమర్షియల్‌ కిటుకులు తెలియకుండానే, అతని సినిమాల్లో ఏమీ లేకుండానే అవన్నీ బాక్సాఫీస్‌ వద్ద మోత మోగించేయడం లేదు. జయ జానకి నాయక చిత్రంలోను పలు సందర్భాల్లో అన్‌ఇంటెన్షనల్‌ కామెడీ వుంటుంది.

ఉదాహరణకి ప్రగ్యా జైస్వాల్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ చాలా సిల్లీగా తోస్తుంది. ఆ బీచ్‌ పార్టీ ఏంటి, ఈ గోలేంటి అనుకునే లోపే ఒక భారీ యాక్షన్‌ సీన్‌తో ఆ ముందు సీన్‌ దాదాపు గుర్తుండకుండా పోతుంది. సినిమా మొదలైన చాలా సేపటి వరకు అతిగా, అనాసక్తిగా సాగిపోతున్నది కాస్తా జగపతిబాబు క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌తో స్వరూపమే మారిపోతుంది. జగపతిబాబు 'పరువు'కి ఎంతగా ప్రాణమిస్తాడో ఎస్టాబ్లిష్‌ చేసేసిన తర్వాత అతనితో హీరో కాన్‌ఫ్రంటేషన్‌ కోసం ఎదురు చూసేలా బోయపాటి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తాడు. విలన్స్‌ని హీరో చంపేయాలన్నంత కసి పుట్టించడం, అంత ఎమోషన్‌ రగిలించిన తర్వాత అద్దిరిపోయే సీన్‌లో ఆ పని కానివ్వడం బోయపాటికి పెన్నుతో పెట్టిన విద్య.

కథగా చూస్తే చాలా సాధారణంగా అనిపిస్తుంది. ప్రేమించిన అమ్మాయి సమస్యలో వుందని తెలిసి ఆమెకి బాసటగా నిలిచి, తన రక్షణ కోసం ఎంతకైనా తెగించేసే నాయకుడు. అసలు ఆ అమ్మాయికి వచ్చిన సమస్యేంటి, దాని వల్ల కథానాయకుడికి ఎంత మంది ప్రత్యర్ధులుంటారు, వారెంతటి సమర్ధులు వగైరా అంశాలతో కథనం నడుస్తుంది. హ్యాపీగా డాన్స్‌ చేస్తోన్న క్యారెక్టర్‌ గుండెల్లో తూటా దిగబడడం కోసం మనం ఎదురు చూసినంత సమయం పట్టదు... గన్‌ పేలడానికి, తూటా దిగడానికి. అంత ఊహితముగా సాగిపోయే కథనంలో ఎమోషనల్‌ పీక్స్‌ టచ్‌ చేయడం బోయపాటి స్పెషాలిటీ.

హంసలదీవి ఎపిసోడ్‌లో జరిగే విధ్వంసం టూమచ్‌గా వున్నా కానీ అది అవసరం అనిపించేట్టుగా దానికి ముందు సీన్లు ప్రిపేర్‌ చేస్తాయి. తనకేమీ జరగకుండా తాను అండగా వుంటానని మాట ఇచ్చిన కథానాయకుడు తన ప్రేయసి కోసం ఎంత వరకు వెళ్లిపోగలడు అనేది దర్శకుడు ఆ సీన్లో కళ్లకి కట్టినట్టు చూపిస్తాడు. తెగిపడిన తలకాయని చూసి మల్టీప్లెక్సుల్లో విజిల్స్‌ పడితే ఇక మాస్‌ థియేటర్లలో పరిస్థితి ఊహించుకోవచ్చు.

విలన్‌ పాత్రలని యుక్తాయుక్త విచక్షణ లేని కర్కశులుగా, మూర్ఖులుగా తీర్చిదిద్ది వారి మీద ఒక నిశ్చితాభిప్రాయం కలిగించడానికి ప్రత్యేకమైన సన్నివేశాలు పెట్టుకుని మరీ హీరోతో వారి ముఖాముఖి కోసం ఎదురు చూసేట్టు చేస్తాడు బోయపాటి. నిజానికి బెల్లంకొండ శ్రీనివాస్‌ వయసుకి, అతని అనుభవానికి మించిన పాత్ర ఇది. బోయపాటి మార్కు ఆవేశాన్ని పండించే పరిపక్వత అతనిలో లేదు. అంత భారీ డైలాగులని పవర్‌ఫుల్‌గా డెలివర్‌ చేసే నేర్పు ఇంకా అలవడలేదు.

అంత మందిని మట్టుబెట్టడానికి తగ్గ శరీర ధారుడ్యం మినహా ఈ పాత్రకి న్యాయం చేసే ఇమేజ్‌ ఇంకా శ్రీనివాస్‌కి లేదు. అయినప్పటికీ తన హీరోని బట్టి ఎమోషన్స్‌ని అండర్‌ ప్లే చేయకుండా, యాక్షన్‌ని టోన్‌ డౌన్‌ చేయకుండా బోయపాటి శ్రీను తన కథానాయకుడు ఎలా రియాక్ట్‌ అవుతాడన్నదే నిర్మొహమాటంగా చూపించేసాడు. అదే జయ జానకి నాయకకి ప్లస్‌ అయింది. బోయపాటి సినిమా నుంచి సగటు సినీ ప్రేక్షకుడు ఏమి ఆశిస్తాడో దానిని మాత్రం దిట్టంగా దట్టించి వదిలాడు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరోసారి ఎమోషనల్‌ క్యారెక్టర్‌లో కనిపించింది. ఆమె చేసిన ఇటీవలి చిత్రాలు చూస్తే పర్‌ఫార్మెన్స్‌ పరంగా కొత్తగా ఏమీ అనిపించదు. జగపతిబాబు క్యారెక్టర్‌కి ఇచ్చిన ఇంట్రడక్షన్‌ అదిరింది. శరత్‌ కుమార్‌, తరుణ్‌ అరోరాకి మంచి క్యారెక్టర్స్‌ దక్కాయి. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచిన బాణీలు సోసోగానే వున్నా నేపథ్య సంగీతం ఎమోషన్స్‌ని బాగా ఎలివేట్‌ చేసింది. రిషి పంజాబీ కెమెరా వర్క్‌ ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా చూపించింది.

బోయపాటి తరహా మాస్‌ మసాలా ఇష్టపడే వారికి కావాల్సినంత ఘాటు ఇందులో వుంది. అతని చిత్రాల్లో కనిపించే 'అతి' ఇష్టపడని వారిని ఇబ్బంది పెట్టే స్టఫ్‌ చాలానే వుంది. టార్గెట్‌ ఆడియన్స్‌ని సంతృప్తి పరచడంలో బోయపాటి సక్సెస్‌ అయినట్టే. భద్ర మాదిరి ప్రేమకథా చిత్రమని చెబుతూ వచ్చినా కానీ ఇది అలా కంటే సరైనోడుకి మరో వెర్షన్‌లా అనిపిస్తుందంతే.

బాటమ్‌ లైన్‌: జయ 'బోయపాటి' నాయక!

- గణేష్‌ రావూరి