Advertisement


Home > Movies - Reviews
సినిమా రివ్యూ: లై

రివ్యూ: లై
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.
తారాగణం: నితిన్‌, అర్జున్‌, మేఘా ఆకాష్‌, నాజర్‌, రవికిషన్‌, శ్రీరామ్‌, మధునందన్‌ తదితరులు
కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్‌
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: యువరాజ్‌
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనిల్‌ సుంకర
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: హను రాఘవపూడి
విడుదల తేదీ: ఆగస్ట్‌ 11, 2017

'లై' అంటే అసత్యమైనా దానికో కొత్త డెఫినిషన్‌ ఇచ్చాడు దర్శకుడు హను రాఘవపూడి. ఎల్‌-లవ్‌, ఐ-ఇంటిల్లిజెన్స్‌, ఈ-ఎనిమిటీ అంటూ తన కథని ఈ మూడు విషయాల చుట్టూ అల్లుకున్నాడు. ఐడియా బాగుంది. కానీ తెర మీదకి వచ్చేసరికి ఆ లవ్‌ మీనింగ్‌లెస్‌గా, ఆ ఇంటిల్లిజెన్స్‌ ఆర్టిఫిషియల్‌గా, ఆ ఎనిమిటీ ఎమోషన్‌ లేకుండా షేప్‌ తీసుకోవడంతో, కొత్తదనం అందించాలనే హను ఇంటెన్షన్స్‌ దెబ్బతిన్నాయి. రొటీన్‌కి భిన్నంగా ఆలోచించడానికి ఇష్టపడే హను రాఘవపూడి 'లై'తో కూడా ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి చేసిన ప్రయత్నమైతే కనిపిస్తుంటుంది కానీ సినిమాగా రూపు దిద్దుకున్న అతని ఆలోచనలు అంత ఎక్సయిట్‌ చేయలేకపోవడం ప్రతికూలమైంది.

బేవార్స్‌గా తిరిగే హీరో, పైసా పైసా లెక్క పెట్టుకునే హీరోయిన్‌, తన అసలు ముఖం ప్రపంచానికి కనిపించనివ్వకుండా అరాచకాలు సాగించే విలన్‌... పాత్రలన్నీ ఇంట్రెస్టింగ్‌గానే పరిచయమవుతాయి. అయితే ఈ మూడు పాత్రలూ ఒకే చోటికి చేరుకోవడం కోసం దర్శకుడు సినిమాటిక్‌ లిబర్టీ వాడుకుని కన్వీనియంట్‌గా వాళ్లనో ప్లేస్‌కి చేర్చాడు. ఇక ఈ పాత్రలతో కథ నడిపించడానికో 'సూట్‌' హైదరాబాద్‌ నుంచి యుఎస్‌ వెళుతుంది. దానిని ట్రాక్‌ చేస్తే విలన్‌ ఆచూకీ తెలుసుకోవచ్చని ఇంటిల్లిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఒక మిషన్‌ నడుపుతుంది... పేరు షోలే. ఈ మిషన్‌లోకి హీరో ఎలా ఎంటర్‌ అవుతాడు, అసలు ఆ సూటులో ఏముందని విలన్‌ దానికోసం పరితపిస్తున్నాడు అనేది 'లై' కథ.

ముందే చెప్పినట్టు కాన్సెప్ట్‌ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది, సెటప్‌ ఎంటర్‌టైనింగ్‌గా కుదిరింది. అయితే కథ ముందుకి నడిచే కొద్దీ కథనం పలచబడి ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ఫస్ట్‌ హాఫ్‌ వరకు సరదా సరదాగా సాగిపోయిన సినిమాకి ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా బాగా కుదిరింది. ఇంద్రుడు-నారదుడు భూలోకం షిఫ్ట్‌ అయి మరీ నడిపించే హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది. అసలు ఒకర్నొకరు ఎందుకు ప్రేమించుకుంటారనేది సిల్లీగా అనిపిస్తుంది. లైలో ఎల్‌ ఫర్‌ లవ్‌ వీక్‌ అయిపోగా, ఇక ఐ ఫర్‌ ఇంటిల్లిజెన్స్‌ విషయానికి వస్తే విలన్‌ తన ఆచూకీని దాచి పెట్టడానికి వివిధ వేషాల్లో తిరుగుతూ తెలివిగా నడుచుకుంటూ వుంటాడు. ముసుగులో తిరగడం మినహా అతని తెలివితేటలు అంతగా కనిపించవు. తన దగ్గర విలన్‌కి కావాల్సిన సూట్‌ వుంది కనుక హీరోకి తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడదు. 

ఈ ముసుగుల వ్యవహారం మొదట్లో ఆసక్తికరంగా అనిపించినా అదే పనిగా అది తప్ప ఇంకోటి జరగకపోయే సరికి విసుగొచ్చేస్తుంది. హీరో-విలన్‌ మధ్య జరిగే క్యాట్‌ అండ్‌ మౌస్‌ గేమ్‌ ఆకట్టుకునేలా జరుగుతోన్న ప్రతిసారీ టైటిల్‌లోని ఎల్‌ ఫర్‌ లవ్‌కి ఇంపార్టెన్స్‌ ఇవ్వడం కోసం బ్రేక్‌ తీసుకుని సాంగ్‌కో, ఫైట్‌కో వెళ్లడంతో మూడ్‌ డిస్టర్బ్‌ అవుతుంది. ఆ ప్రేమ అర్థవంతంగా అనిపించినట్టయితే హీరో తన పనులు మానేసి రెండు రోజులు వెకేషన్‌ తీసుకోవడానికి వెళితే ఓకే కానీ, ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేని లవ్‌ స్టోరీని కేవలం పాటలు, ఫైట్ల కోసం వాడుకోవడం వల్ల ఆసక్తికరంగా అనిపిస్తోన్న దగ్గర సైతం అనవసరమైన స్పీడ్‌ బ్రేకర్లు ఎదురయ్యాయి.

ఇక ఈ ఫర్‌ ఎనిమిటీకి వస్తే హీరో-విలన్‌ మధ్య సూట్‌ వ్యవహారం ఒక్కటే పెడితే డెప్త్‌ వుండదనో ఏమో చిన్నపాటి రివెంజ్‌ ప్లాన్‌ చేసారు. ఎమోషన్‌ ఏమాత్రం రేకెత్తించని ఈ పాయింట్‌ వల్ల కొత్తగా కథకి ఒరిగిందేమీ లేకపోగా, కొత్తగా అనిపించాల్సిన కథకి పాత చింతకాయ వాసనలు దట్టించినట్టయింది. లై అనే పదానికి ఒక అక్రానిమ్‌ తయారు చేసి దానికి జస్టిఫికేషన్‌ కోసం ఇదంతా చేసినట్టయింది కానీ నిజానికి హీరో, విలన్‌ మధ్య శత్రుత్వానికి ప్రత్యేకమైన పర్సనల్‌ కారణాలు అక్కర్లేదనిపిస్తుంది.

కొన్ని సన్నివేశాల్లో హను తెలివితేటలు ఆకట్టుకుంటాయి. నితిన్‌ ఐడెంటిటీ రివీల్‌ చేసే సీన్‌, తనకి కావాల్సిన సూట్‌ కోసం మారు వేషంలో హీరోతో పాటే వచ్చి విలన్‌ వుండడం, 'అశ్వద్ధామ హతః' సీన్‌లో విలన్‌ని హీరో అబద్ధంతో బురిడీ కొట్టించడం, ఆ సూట్‌లో దాగివున్న రహస్యం వగైరా అంశాలు ఆట్టుకునేలా వుండడంతో లై పూర్తిగా ఇంట్రెస్ట్‌ కోల్పోనివ్వకుండా ఎంగేజ్‌ చేస్తుంటుంది. అయితే హీరోకి వున్న సింగిల్‌ పాయింట్‌ అజెండా, విలన్‌కి వున్న సింగిల్‌ పాయింట్‌ అజెండా వల్ల ఒక పాయింట్‌ దాటాక మేటర్‌ కొరవడింది. మధ్యలో రిలీఫ్‌ ఇవ్వాల్సిన లవ్‌స్టోరీ కాస్తా అర్థం లేకుండా అయిపోవడంతో అసలు కథకి అది అవరోధంగా మారింది.

సరికొత్త అవతారంలో నితిన్‌ చాలా కొత్తగా కనిపించాడు. అతని బాడీలాంగ్వేజ్‌లో పవన్‌కళ్యాణ్‌ ఛాయలు కనిపించాయి. అర్జున్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. మేఘా ఆకాష్‌ బాగా యావరేజ్‌గా వుంది. శ్రీరామ్‌, నాజర్‌, రవికిషన్‌ సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌కి న్యాయం చేసారు. మణిశర్మ నేపథ్య సంగీతం బొంభాట్‌గా వుంది. కెమెరా పనితనం, నిర్మాణ విలువలు మెప్పిస్తాయి. దర్శకుడు హను ఎఫర్ట్స్‌ని తక్కువ చేయలేం కానీ, స్క్రీన్‌ప్లే మరింత కాన్సన్‌ట్రేట్‌ చేయాల్సింది. ఆకర్షణీయమైన సెటప్‌ వుండీ ఒక సగటు సినిమాని మాత్రమే అందించగలిగాడు.

ఇంటర్నేషనల్‌ మాఫియా డాన్‌ని వేటాడుతూ ఒక మిషన్‌ సాగడం, విలన్‌ తన జిత్తులతో పోలీసులకి దొరక్కుండా పోవడం లాంటి అంశాలతో హాలీవుడ్‌లో చాలా యాక్షన్‌ థ్రిల్లర్స్‌ రూపొందుతుంటాయి. ఆ సెటప్‌లో మన ప్రేక్షకులకి సరికొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడానికి జరిగిన ప్రయత్నం మెచ్చుకోతగినదే కానీ కొత్తదనం అందించేప్పుడే చాలా పకడ్బందీగా వ్యవహరించాలి.

రొటీన్‌ సినిమాలు ఎలాగో ఫార్ములా ప్రకారం వెళ్లిపోతుంటాయి కానీ రొటీన్‌కి భిన్నంగా వెళ్లే సినిమాల్లో పర్‌ఫెక్షన్‌ తప్పనిసరి. అసలే లిమిటెడ్‌ అప్పీల్‌ వున్నవి కావడంతో టార్గెట్‌ ఆడియన్స్‌ని అయినా పూర్తి శాతం శాటిస్‌ఫై చేసేలా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ చాలా వుండాలి. 'లై'లో అలాంటివి లేకపోలేదని కాదు కానీ వుండాల్సినన్ని లేకపోవడంతో టార్గెట్‌ ఆడియన్స్‌ నుంచి కూడా పాస్‌ మార్కులే వస్తాయి తప్ప శభాష్‌, హేట్సాఫ్‌లు వినిపించవు.

బాటమ్‌ లైన్‌: అబద్ధం... అతికినట్టు లేదు!

- గణేష్‌ రావూరి