ట్యూబ్ లైట్ సినిమా ఫ్లాప్ అయింది. బయ్యర్లకు నష్టాలు మిగిలింది. దీంతో రంగంలోకి దిగిన హీరో సల్మాన్ ఖాన్, ఆ నష్టాన్ని తను భరిస్తానని, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటానని ప్రకటించాడు. చెప్పినట్టుగానే కొంత మొత్తాన్ని వెనక్కి తిరిగిచ్చేశాడు. మరి షారూక్ కూడా అలానే చేస్తాడా?
తాజాగా షారూక్ నటించిన 'జబ్ హ్యారీ మెట్ సెజల్' సినిమా విడుదలైంది. ఇది కూడా ఫ్లాప్ అయింది. బయ్యర్లకు భారీ నష్టాల్ని మిగిలింది. ఇందులో హీరోగా నటించడమే కాదు, స్వయంగా నిర్మాతగా కూడా వ్యవహరించాడు షారూక్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారూక్ భార్య గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాను భారీ మొత్తానికి అమ్మేశారు. కానీ ఇప్పుడది నష్టాల్లో నడుస్తోంది.
60 శాతానికి పైగా లొకేషన్లలో బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేదు ఈ మూవీ. దీంతో చాలామంది బయ్యర్లు కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. మరి సల్మాన్ ఖాన్ లా షారూక్ కూడా నష్టాల్ని భరిస్తాడా అనేది చూడాలి. ఇప్పటివరకు ఈ హీరో ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా తన సినిమా హిట్ అయిందని చెబుతున్నాడు.
మరోవైపు నష్టాన్ని భరించినప్పటికీ సల్మాన్ ఖాన్ పై విమర్శలు ఆగలేదు. ఎందుకంటే ట్యూబ్ లైట్ సినిమాకు 75కోట్లకు పైగా నష్టం వస్తే సల్మాన్ 32కోట్ల 50లక్షలు మాత్రమే వాపస్ ఇచ్చాడు. షారూక్ ఖాన్ ఇలా సగమైనా ఇస్తాడా అనేది డౌట్.
కొసమెరుపు ఏంటంటే.. ఫ్లాప్ అయిన సల్మాన్, షారూక్ సినిమాలు రెండింటినీ ఎన్ హెచ్ స్టుడియోస్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీనే కొనుగోలు చేసింది.