రోబో 2 తెలుగు వెర్షన్ డీల్ పూర్తయింది. 75 కోట్ల రూపాయిలకు తెలుగు ఫస్ట్ కాపీ ఇవ్వడానికి తమిళ నిర్మాతలతో తెలుగు బయ్యర్లు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.
తెలుగులో బాహుబలి తరువాత ఇంత భారీ రేట్లు ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఇదే అనుకోవాలి. బాహుబలి 2 ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి 120 కోట్ల దాకా విక్రయించారు.
ఆ తరువాత మళ్లీ ఏ సినిమా ఆ రేంజ్ లో లేదు. ఇటు స్పైడర్, అటు లవకుశ కానీ, రాబోయే పవన్ సినిమా కానీ 70 నుంచి 75 మేరకే బిజినెస్ చేస్తాయని అంచనా.
ఆ సంగతి ఎలా వున్నా, ఇంత రేటుకు ఏసియన్ సునీల్ రోబో 2 కొనుకోలు చేయడం అన్నది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఎందుకంటే ఏసియన్ సునీల్ సాధారణంగా రిస్క్ తీసుకోరు.
నైజాంకు బాహుబలి 45 కోట్ల వరకు వెళ్లి, యాభై అడగగానే, కమిషన్ మీద పంపిణీ చేసారు తప్ప కొనుగొలు చేయలేదన్ని ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లకు తెలిసిన విషయమే. అలాంటిది 75 కోట్లకు పోటీపడి ఈ సినిమా కొనడం అంటే కాస్త ఆశ్చర్యంగా వుంది. బహుశా ఇంకా బయటకు రాని టెర్మ్స్ ఏవో వుండే వుంటాయని టాక్ వినిపిస్తోంది.
75 కోట్ల మేరకు ఫస్ట్ కాపీ అంటే కనీసం ఏరియాల వారీ 85 కోట్లకు పైగానే బిజినెస్ చేయాల్సి వుంటుంది. కానీ శంకర్ కు కానీ, రజనీ కానీ ఇటీవల కాలంలో పెద్ద హిట్ లు లేవు. కాంబినేషన్ బజ్ వుంటే వుండొచ్చు. అది వేరే సంగతి. ఇక రోబో 2లో ఎమీజాక్సన్ వుంది. ఆమె నటించిన సినిమాలు దాదాపు అన్నీ డిజాస్టర్లు, పదుల కోట్లలో నిర్మాతలను, బయ్యర్లను ముంచేసినవే.
కేవలం ఏసియన్ సునీల్ నే కాకుండా, బెల్లంకొండ సురేష్-మిరియాల రవీందర్ రెడ్డి కూడా 75 కోట్ల మేరకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఏసియన్ సునీల్ అంటే అతనితో పాటు దగ్గుబాటి సురేష్, అలంకార్ ప్రసాద్ లాంటి పెద్దలు కూడా అండగా వుంటారు సినిమాకు. అందుకే వాళ్లకు సినిమా అందించినట్లు తెలుస్తోంది.