తేజ వాళ్లకి థాంక్స్ చెప్పాలి

సరిగ్గా రెండేళ్ల క్రితం హోరా హోరీ అనే చిన్న సినిమా వచ్చింది. డిజాస్టర్ అంటే డిజాస్టర్. అంతకు ముందు వెయ్యి అబద్దాలు, నీకూ నాకు మధ్య డాష్ డాష్, కేక సినిమాలు వచ్చాయి. అన్నీ…

సరిగ్గా రెండేళ్ల క్రితం హోరా హోరీ అనే చిన్న సినిమా వచ్చింది. డిజాస్టర్ అంటే డిజాస్టర్. అంతకు ముందు వెయ్యి అబద్దాలు, నీకూ నాకు మధ్య డాష్ డాష్, కేక సినిమాలు వచ్చాయి. అన్నీ కూడా పరమ డిజాస్టర్లు. ఆ మాటకు వస్తే అంతకు ముందు కూడా ఎన్ని ఫ్లాపులో.  ఇవన్నీ డైరక్టర్ తేజ సినిమాలే. అలాంటి నేపథ్యంలో అహం అనే కథ తయారు చేస్తే, అది కూడా రాజశేఖర్ అనే హీరోతో స్టార్ట్ చేసి ఆగిపోతే, ఆ డైరక్టర్ దగ్గరకు ఏ నిర్మాత వెళ్లడానికి సాహసిస్తాడు. 

అలాంటిది భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి అనే ఇద్దరు కొత్త నిర్మాతలు వెళ్లి తాము ఆ సినిమా చేస్తామన్నారు. అది కూడా అప్పటికి బాహుబలి క్రేజ్ రాలేదు. సోలోగా హిట్ లేదు. అలాంటి హీరో రానాతో. సరే ప్రాజెక్టు స్టార్ట్ అయింది. డబ్బులకు వెనకాడ లేదు. కొద్దిగా తీయగానే రష్ చూసేసరికి రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబుకు ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఆయన కూడా సినిమాలో పార్టనర్ గా మారారు. అందరూ కలిసి సినిమాకు కావాల్సిన వన్నీ సమకూర్చారు. కాజల్ వచ్చింది. కేథరిన్ వచ్చింది. సినిమాకు టోటల్ గా అందం వచ్చింది.

ఇప్పుడు ఇన్ని జరిగాక, నేనే రాజు-నేనే మంత్రికి సూపర్ బజ్ వచ్చింది. దీంతో దర్శకుడు తేజకు పూర్వ వైభవం తెచ్చి పెట్టాయి. ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నారు. సినిమా గురించి ఇన్ని మాటలు చెబుతున్నారు. కానీ ఒక్కటి మాత్రం చెప్పడం లేదు. తనకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చిన నిర్మాతలకు థాంక్స్. ఇది మా మాట కాదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. మరి తేజకు కూడా వినిపించే వుంటే, రేపు సినిమా హిట్ అనిపించుకున్నాక అయినా చెబుతారేమో?