ఉన్నట్టుండి కాంగ్రెస్‌పై చాలా మందికి ప్రేమ పుట్టుకొచ్చింది. ఈ వాతావరణం ముఖ్యంగా తెలంగాణలో చూస్తున్నాం. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, ఏపీలో వద్దా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్లుగా అధికారంలో వుండడంతో వ్యతిరేకత, దాని ప్రత్యామ్నాయంగా చాలా మందికి కాంగ్రెస్ కనిపించింది. అయితే ఎన్నికలు మాత్రమే తెలంగాణలో ముగిశాయి. ఫలితాల కోసం మరో రెండు రోజులు ఎదురు చూడాలి.
ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఎగ్జాట్ పోల్స్ ఏంటనేది తెలియాల్సి వుంది. బీఆర్ఎస్ నేతలు తప్ప, మిగిలిన వారంతా తెలంగాణలో అధికారం కాంగ్రెస్‌దే అని ఫిక్సయ్యారు. ఎవరి అభిప్రాయాలు వారి సొంతం. కాదనడానికి లేదు. అయితే కాంగ్రెస్‌పై అభిమానం కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమా? ఏపీలో ఎందుకు కాకూడదనే చర్చకు తెరలేచింది.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విడదీసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఆకాంక్ష అక్కడి ప్రజల్లో ఉండడం, దాన్ని గౌరవించామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టిందనే ఆగ్రహం కాంగ్రెస్‌పై ఇప్పటికీ వుంది. అందుకే 2014లో కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని ఆ పార్టీ నేతలే అనేక సార్లు చెప్పారు.
తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా ఆ రాష్ట్ర ప్రజానీకం కూడా కాంగ్రెస్‌ను ఆదరించలేదు. పదేళ్ల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్‌పై తెలంగాణ సమాజం కరుణ చూపిందని అంటున్నారు. అది ఆచరణకు వచ్చే సరికి ఏం జరుగుతుందో చూడాలి. తెలంగాణ ఎన్నికల్లో సీమాంధ్రులు ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు సానుకూలత ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.
ఇదే రకమైన సానుకూలత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పై ప్రదర్శిస్తారా? అనే చర్చకు తెరలేచింది. ఏపీ విభజన పాపంలో అన్ని పార్టీల పాత్ర వుంది. అయితే అధికారం చెలాయించిన కాంగ్రెస్‌పై రాష్ట్రాన్ని విభజించారనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే కోపతాపాలు శాశ్వతంగా ఉంటాయని చెప్పలేం. ముఖ్యంగా రాజకీయాల్లో ఒకే రకంగా ఉండవు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు వీస్తున్న సానుకూల పవనాలు ఆంధ్రాలో కూడా వీస్తాయా? అనే చర్చ జరుగుతోంది. కానీ ఆంధ్రాలో కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేకపోవడం పెద్దలోటు. రేవంత్‌రెడ్డి లాగా ఏపీలో కూడా కాంగ్రెస్‌కు దీటైన నాయకుడు వుంటే మాత్రం ఊపిరిపోసుకునే అవకాశం వుందని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు.