Advertisement

Advertisement


Home > Politics - Opinion

అర్ధం లేని ఎగ్జిట్ పోల్ గందరగోళం

అర్ధం లేని ఎగ్జిట్ పోల్ గందరగోళం

ఎగ్జిట్ పోల్...ఇది ఎలక్షన్ తంతు పూర్తయ్యాక పోలింగ్ సరళిని బట్టి, నమోదైన ఓటింగ్ శాతాన్ని బట్టి, కొన్ని వర్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి ఒక అంచనా వేసి "ఫలితాలు ఇలా ఉండొచ్చు" అని చెప్పెప్రక్రియ. 

ఈ ప్రక్రియకి కనీసం ఒక రోజు సమయం కావాలి. అంతే తప్ప పెళ్లవ్వగానే పిల్లాడు పుట్టినట్టు...ఆరింటికి పోలింగ్ పూర్తవగానే బైటికొచ్చేదానిని ఎగ్జిట్ పోల్ అనరు. అదికూడా ఒకటి అరా కాదు...ఏకంగా లెక్కలేనన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రచారంలోకి వచ్చేసాయి. నిజానికి అవన్నీ ప్రీపోల్ సర్వేలే అని చెప్పాలి. 

సర్వే చేసే క్రమం, తీసుకున్న సాంపిల్ సైజ్, అందులో మళ్లీ అన్ని వర్గాల ఓటర్స్ ని సంప్రదించగలగడం..మొదలైన ఎన్నో అంశాల మీద ప్రీపోల్ సర్వేలు ఉంటాయి. ఎవరు ఏ స్థాయిలో కష్టించి విషయ సేకరణ చేసారో వారికే తెలియాలి. ఎంత కష్టపడ్డా, ఎన్ని సర్వేలు చేసినా అసలు ఫలితానికి దగ్గరగా ఉండాలన్న రూలేమీ లేదు. అందుకే ఎన్ని సర్వేలొచ్చినా అసలు ఫలితం వచ్చేదాకా ఉత్కంఠ కామన్..! 

ఇక తాజాగా గ్జిట్ పోల్ పేరుతో వచ్చిన సర్వేలో ఒక నవ్వొచ్చే విషయం. ఒక సంస్థ వారు కాంగ్రెస్ కి 67-78 మధ్యలో సీట్లొస్తాయని చెప్పారు. ఏకంగా అంత గ్యాపా? ఇంకానయం..1-119 మధ్యలో వస్తాయని చెప్పలేదు! ఎక్కడైనా ప్లస్ ఆర్ మైనస్ 5 వరకు సమంజసం కానీ మరీ ఇంత తేడా పెట్టి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 

ఈ బాపతులో సుమారు పది పదిహేను సర్వేలు కాంగ్రెసుకే పట్టం కడితే, మరో వైపు సుమారు పదిపదిహేను సర్వేలు బీఆరెస్ ఘంటాపథంగా నెగ్గుతుందన్నట్టు లెక్కలేసారు. 

ఇది చూస్తే ఎలా ఉందంటే..ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో ఇరు పార్టీలకు చెందిన వాళ్లూ సిద్ధాంతుల్ని పిలుచుకొచ్చి పంచాంగం చదవమంటారు..ఆ సిద్ధాంతులు ఏ శిబిరంలో మాట ఆ శిబిరంలో చెప్తారు. అధికార పార్టీవారి సిద్ధాంతి రాబోయే ఎన్నికల్లో తమదే విజయమంటాడు. ప్రతిపక్ష పార్టీ వారి దగ్గర పంచాంగపఠనం చెసిన సిద్ధాంతి రాబోయే కాలం రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పు సంభవిస్తుందని చెప్పి చప్పట్లు కొట్టించుకుంటాడు. అలా ఇద్దరు సిద్ధాంతులూ ఎక్కడి సంభావన అక్కడ తీసుకుంటారు. ఇక్కడ పంచాంగాన్ని తప్పు పట్టలేం. ఈ సిద్ధాంతులకి అనిపించిన కంక్లూజన్సే సమస్య. 

ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ లోనూ అంతే. ఎవరికి ఏది అనిపిస్తే దానిని ప్రచారం చేసేస్తున్నారు. లేకపోతే ఇన్నేసి ఎగ్జిట్ పోల్స్ ఇన్ని రకాలుగా ఎందుకుంటాయి? 

ఇక్కడ కొన్ని యూట్యూబ్ చానల్స్ కూడా ఈ రెండ్రోజుల వ్యూవ్స్ కోసం రకరకాల సర్వేలని ప్రచారం చేస్తున్నాయి. వీటిల్లో ఏదో ఒక దాన్ని గుడ్డిగా నమ్మి బెట్టింగులు కాసున్న జూదమహారాజులు కూడా ఉన్నారు. 

రేపు ఈ సర్వేల్లో ఏవో కొన్ని లాటరీ తగిలినట్టు అసలు ఫలితాలకి దగ్గరగా రావడమో, మ్యాచ్ అవడమో జరగొచ్చు. దాంతో తమ ఎగ్జిట్ పోల్ నిజమైందని పిన్ చేసుకుని ఇక రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి కూడా నిఖార్సైన ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ ఫలితాలిస్తామని నమ్మబలకడానికి చాన్సొస్తుంది. ఒక్క దీనికి తప్ప ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల వల్ల ఉపయోగమేమే లేదు. 

ఫలితాలు ఇంకో రెండ్రోజుల్లో వెల్లడవుతాయి కదా అనుకున్నా అప్పటి వరకు తీరిగ్గా కూర్చోలేక చేసే పనే ఈ ఎగ్జిట్ పోల్స్ ని చూడడం, విశ్లేషించుకోవడం. 

డిసెంబర్ 3 న వెల్లడయ్యే ఫలితాల అనంతరం ఇక రకరకాల విశ్లేషణలు పుట్టుకొస్తాయి. ఫాలానా పార్టీ గెలిస్తే ఒకలాగ, ఓడితే ఒకలాగ యూట్యూబ్ విశ్లేషణలకి మేధావులు తయారవుతారు. 

ఇక కొన్ని మీడియా సంస్థల్లోని వారైతే "కెమెరామెన్ గంగతో రాంబాబు" లో బ్రహ్మానందం టైపులో రెండు మూడు రకాల సినారియోలకి తగిన స్క్రిప్ట్ వగైరాలు రాసుకుంటూ ఉండొచ్చు కూడా. తప్పులేదు. ఎవరి తాపత్రయం వారిది, ఎవరి వ్యాపారం వారిది. 

హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?