రెగ్యులర్ బెయిల్ తర్వాత మొట్ట మొదటిసారిగా చంద్రబాబునాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి తిరుమల వెళ్లారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానంతరం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ కాలం తర్వాత బాబు ప్రజాక్షేత్రంలోకి రావడం, ఆయన్ను చూడడం టీడీపీ శ్రేణుల్ని సంతోషాన్ని ఇచ్చింది. బాబు ఏం మాట్లాడ్తారో వినాలనే ఆసక్తి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిలో వుంది.
ఈ నేపథ్యంలో తిరుమలలో ఆయన మాట్లాడుతూ కొండపై రాజకీయాలు మాట్లాడనని స్పష్టం చేశారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరేదీ వినపడకూడదని ఆయన చెప్పుకొచ్చారు. దర్శ పరిరక్షణ క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకుని మాట్లాడుతున్నానన్నారు. వెంకటేశ్వరస్వామి పాదపద్మాల చెంత తాను పుట్టినట్టు బాబు తెలిపారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రజాసేవకు అంకితమయ్యానని బాబు తెలిపారు.
2003లో బ్రహ్మోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున దేవునికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా 24 మందుపాతర్లను పేల్చగా, వెంకటేశ్వరస్వామి ప్రాణభిక్ష పెట్టారని తన నమ్మకం, విశ్వాసం అని ఆయన అన్నారు. అందుకే ఇటీవల తనకు కష్టం వచ్చినప్పుడు మొదట కలియుగ దైవాన్ని మొట్టమొదట సందర్శించుకుంటానని మొక్కుకున్నట్టు ఆయన తెలిపారు.
మొక్కు ప్రకారం కలియుగ దైవం దర్శనం తర్వాతే ఇతర కార్యక్రమాలు మొదలు పెడతానన్నారు. ధర్మాన్ని కాపాడాలని మాత్రమే తాను కోరుకున్నట్టు బాబు తెలిపారు. ఎందుకంటే కలియుగంలో ధర్మాన్ని కాపాడ్డం కోసం వెంకటేశ్వరస్వామి అవతారంలో వచ్చాడన్నారు. భారతదేశంలో పాటు తెలుగు జాతి అగ్రస్థానంలో వుండాలని దేవుని కోరుకున్నట్టు ఆయన చెప్పారు. ప్రజల సంకల్పాన్ని నెరవేర్చేందుకు శక్తిని, సామర్థ్యాన్ని, యుక్తిని, ఆరోగ్యాన్ని తనకు ఇవ్వాలని దేవుని కోరుకున్నట్టు బాబు తెలిపారు.
ప్రజల్లోకి ఎప్పటి నుంచి అనే ప్రశ్నకు, ఆ తర్వాత మాట్లాడ్తానన్నారు. దేనికైనా దేవుని ఆశీస్సులు వుండాలని, అవి పొందేందుకు తిరుమలకు వచ్చినట్టు చంద్రబాబు చెప్పడం విశేషం.