పుట్టిన ఇన్నాళ్లకు పురుషుడు యజ్ఙం చేసాడు అని సామెత. జనసేన పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాలకు తెలంగాణలో నేరుగా కాకపోయినా, భాజపా పొత్తుతో ఎన్నికల రంగంలోకి దిగింది. గతంలో తెలంగాణలో రంగంలోకి దిగవద్దని కోరిన భారతీయ జనతా పార్టీనే వ్యూహాత్మకంగా జనసేనను కాస్త బలవంతంగానే రంగంలోకి దింపిది.
ఎనిమిది సీట్లలో జనసేన పోటీకి దిగినా, ఆరు స్థానాల్లో భాజపా జనాలే జనసేనలోకి మారి, పోటీలో నిలబడ్డారు. అంటే తెలంగాణలో జనసేన ఎంత డొల్ల అన్నది అక్కడే అర్థం అయిపోయింది.
కేసిఆర్ అండ్ కో ను నేరుగా, ఘాటుగా విమర్శకుండానే అయినా తెలంగాణలో తమ పార్టీ పోటీ చేస్తున్న ఎనిమిది చోట్ల కాస్త గట్టిగానే ప్రచారం సాగించారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చామనిపించారు. కూకట్ పల్లిలో వున్న కమ్మ, కాపు సామాజిక వర్గాలు జనసేన వైపు నిల్చున్నాయని వార్తలు వినవచ్చాయి.
మొత్తానికి ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చాయి. దాదాపు అన్ని సర్వేలు ఒక్క మాదిరిగానే వున్నాయి. ఒకటి రెండు తప్ప. కానీ ఏ ఒక్క సర్వేలోనూ జనసేన అనేది సోది లోకి కూడా లేదు. జనసేన అనేది సోషల్ మీడియాలో వున్న ఫ్యాన్స్ క్రియేట్ చేసిన గాలిబుడగ అని దాదాపు తేలిపోయింది. మిగిలిన కులాల మధ్య కాపులు వుంటే జనసేనకు ఒరిగేది ఏదీ లేదని అర్థం అవుతోంది. ఆంధ్రలోని ఈస్ట్, వెస్ట్ ల్లో సంఖ్యాపరంగా కాపుల డామినేషన్ కొద్దిగా వున్న చోట మినహా మిగిలిన చోట జనసేన సోలోగా ఏమీ సాధించలేదని క్లారిటీ వస్తోంది.
కానీ తెలుగుదేశం పల్లకీ మోయడానికి, ఆ పార్టీని అందలం ఎక్కించడానికి జనసేన ఉపయోగపడవచ్చు. కానీ తనకు తాను నిలదొక్కుకోవడానికి మాత్రం ఆ పార్టీ బలం సరిపోదని తెలంగాణ ఎన్నికలు మరింత క్లారిటీ ఇస్తున్నాయి.