ఈ మాట కొందరికి చిత్రంగా ధ్వనించవచ్చు. ఆలూ లేదు చూలూ లేదు అప్పుడే ప్రమాణ స్వీకారానికి ముహుర్తం కూడానా అని గేలి చేయవచ్చు? కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి రేవంత్ రెడ్డి మాత్రం.. చాలా ధీమాగా తమ ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తాన్ని కూడా ప్రకటించేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పుట్టినరోజు అయిన డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుందని ఆయన వెల్లడించారు.
ఒకవైపు తామే 70 సీట్లకు పైగా గెలుస్తామని అంటున్న భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఫలితాలు వెల్లడయ్యే 3వ తేదీనే తమ కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుందని అంటుండగా.. రేవంత్ మాత్రం.. సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు అందించిన పుట్టినరోజు కానుకగా తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందని అనడం విశేషం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగిన త్యాగాలను కూడా రేవంత్ రెడ్డి.. ఫలితాలు వెలువడే రోజుకు చాలా చక్కగా ముడిపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వారిలో శ్రీకాంతాచారి త్యాగం చాలా విలువైనది. ఆయన నవంబరు 29వ తేదీన రాష్ట్రసాధనకోసం వంటిపై పెట్రోలుపోసుకుని నిప్పంటించుకోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబరు 3వ తేదీన ప్రాణం విడిచారు. ఆ సందర్భాలను రేవంత్ రెడ్డి ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. బలిదానం చేసిన శ్రీకాంతాచారి ఆత్మ శాంతించేలాగా.. డిసెంబరు 3వ తేదీన ఫలితాలు వస్తుండడం గొప్పవిషయం అని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రాన్ని ఇచ్చిన, ప్రజల కోరికను నెరవేర్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టినరోజున ప్రభుత్వం ఏర్పడుతుందని అంటున్నారు. ప్రీపోల్ సర్వేలు మరియు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ కే అనుకూలంగా ఉన్నాయి. బలిదానాలు చేసిన వారి కుటుంబాలకు గులాబీ సర్కారు మొండిచేయి చూపించిందనే విమర్శ చాలాకాలంగా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ కుటుంబాలను ఆదుకునే దిశగా కూడా పలు పథకాలను మేనిఫెస్టోలో ప్రకటించింది.
అలాంటి నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి చాలా చక్కగా.. శ్రీకాంతాచారి బలిదానానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడే రోజుకు ముడిపెట్టడం విశేషం.