కేసీఆర్ ఓడిపోతే పరువు ఢమాల్!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమిని చవిచూడబోతున్నారా? అత్యుత్సాహానికి పోయి.. తన సొంత నియోజకవర్గం గజ్వేల్ తో పాటు, తాను పుట్టిన స్వగ్రామం అనే సెంటిమెంటు ప్లే చేస్తూ కామారెడ్డిలో…

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమిని చవిచూడబోతున్నారా? అత్యుత్సాహానికి పోయి.. తన సొంత నియోజకవర్గం గజ్వేల్ తో పాటు, తాను పుట్టిన స్వగ్రామం అనే సెంటిమెంటు ప్లే చేస్తూ కామారెడ్డిలో కూడా పోటీచేసినందుకు ఆయన తల బొప్పి కట్టనుందా? ముఖ్యమంత్రిగా పదేళ్లపాటు పనిచేసి.. ఎమ్మెల్యేగా ఓడిపోవడం అంటే.. ఒక్క కేసీఆర్ కు మాత్రమే కాదు.. యావత్తు భారత రాష్ట్ర సమితికి పరువు మొత్తం గంగలో కలిసినట్టే అవుతుంది. 

ఆయన ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీచేయగా.. కామారెడ్డిలో సంకేతాలు ఏమాత్రం అనుకూలంగా లేవు అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

తమ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా కష్టపడి పనిచేసి.. కేసీఆర్ ని దొర్కబట్టుకుని ఓడిస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కామారెడ్డి నియోజకవర్గం నుంచి రేవంత్ స్వయంగా పోటీచేయడం విశేషం. తన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు, కేసీఆర్ ఓటమిని నిర్దేశించడానికి కామారెడ్డిలో కూడా ఆయన పోటీచేశారు. అదే సమయంలో.. కొన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ నివేదికలు మాత్రం.. కామారెడ్డిలో బిజెపి గెలుస్తుందని అంటున్నాయి. 

బిజెపి అభ్యర్థి వెంకటరమణా రెడ్డి కొన్ని సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో కష్టపడిపనిచేస్తూ.. ఆస్తులు అమ్ముకుని కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని.. ప్రజల్లో నిత్యం అనుబంధం కలిగి ఉన్నారని.. కేసీఆర్ , రేవంత్ ఇద్దరూ కూడా బయటి ప్రాంతాల నుంచి వచ్చి పోటీచేస్తున్న వారు కావడంతో స్థానికత అంశం కూడా బిజెపికి కలిసివస్తుందని వారి విజయం తథ్యమని అంచనా వేస్తున్నారు.

రేవంత్ చెబుతున్నది నిజమైనా, కొన్ని సర్వేలు చెబుతున్నది నిజమైనా.. ఏది ఏమైనా సరే.. కేసీఆర్ ఓడడం మాత్రం గ్యారంటీ. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు.. రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగడం వెనుక ఆంతర్యం, మర్మం స్పష్టంగా బయటకు రాలేదు. 

ఆయన ఏదో సాకులు చెప్పారు గానీ.. అవి నిజం కాదని, ఎన్నికల తర్వాత.. కామారెడ్డి నుంచి తన కుమార్తె కవితను పోటీచేయించి.. కేబినెట్లోకి తీసుకోవడానికి ఇది సేఫ్ గేమ్ అనుకున్నారని పుకార్లు గుప్పుమన్నాయి. ఈలోగా కేసీఆర్ గజ్వేల్ సభలో మాట్లాడుతూ.. తాను గజ్వేల్ ఎమ్మెల్యేగానే ఉంటానని, వీడిపోయేది లేదని, కామారెడ్డి లో ఉత్తినే పోటీచేస్తున్నానని ప్రకటించారు. ఈ మాటలు కామారెడ్డి ప్రజలకు ఆగ్రహం తెప్పించి ఉంటాయనడంలో సందేహం లేదు. 

తమ నియోజకవర్గాన్ని ఆ నాయకులు వాడుకుని వదిలేసే పరిస్థితి రాకుండా, మళ్లీ ఉప ఎన్నిక  రాకుండా వారు స్పష్టమైన తీర్పునే ఇవ్వదలచుకున్నట్టుగా కనిపిస్తోంది. బిజెపి గెలిస్తే అదే నిరూపణ అవుతుంది.  మొత్తానికి కేసీఆర్ ఓడితే.. అది భారాస మీద చాలా పెద్ద ప్రభావమే చూపిస్తుందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.