మధ్యప్రదేశ్ ప్రజలు మరోసారి మిశ్రమ తీర్పునే ఇవ్వబోతున్నారా? అంటే ఔనంటున్నాయి వివిధ వార్తా సంస్థల ఎగ్జిట్ పోల్స్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు అతి స్వల్ప మెజారిటీతో అధికారాన్ని ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. అయితే బీజేపీ ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. కాంగ్రెస్ నుంచి రెబల్స్ ను తన వైపుకు తిప్పుకుని తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కమలం పార్టీ.
అప్పటికే ప్రజల చేత తిరస్కరణ పొందిన శివరాజ్ సింగ్ చౌహాన్ అలా ప్రజాభీష్టానికి విరుద్ధంగా మరోసారి సీఎం అయ్యారు. మూడున్నరేళ్ల పాటు కొనసాగారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ కు ఏ పార్టీకీ బంపర్ మెజారిటీ దక్కే అవకాశం లేదని అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.
కొన్ని సర్వేలు అయితే కాంగ్రెస్ కు కనీస మెజారిటీ కన్నా కాస్త ఎక్కువ సీట్లు రావొచ్చంటున్నాయి. మరి కొన్ని అధ్యయనాలు బీజేపీకి అదే స్థాయిలో స్వల్ప మెజారిటీ దక్కే అవకాశం ఉందంటున్నాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 117 నుంచి 139 సీట్ల వరకూ దక్కవచ్చని పీపుల్స్ పల్స్ సర్వే అంటోంది. ఇదే జరిగితే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడినట్టే!
న్యూస్ 18 సర్వే కాంగ్రెస్ పార్టీకి 113 సీట్లు, బీజేపీకి 112 సీట్లు అంటోంది. సీఎన్ఎన్ సర్వే బీజేపీకి 116, కాంగ్రెస్ కు 111 సీట్లు అంటోంది. రిపబ్లిక్ సర్వే మాత్రం బీజేపీకి గరిష్టంగా 130, కనిష్టంగా 118 సీట్లు అంటోంది. పోల్ స్టార్ట్ సర్వే బీజేపీకి 110 నుంచి 116 సీట్లు, కాంగ్రెస్ కు 111 నుంచి 121 సీట్లు దక్కే అవకాశం ఉందంది.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సంపాదించుకుంటే, బీజేపీపై కచ్చితంగా రీవేంజ్ తీర్చుకున్నట్టే. జ్యోతిరాదిత్య సింధియా వంటి నేత పార్టీని వీడాకా.. కాంగ్రెస్ పార్టీ ఇంత పోరాటాన్ని ఇవ్వడం గొప్ప సంగతే. అధికారాన్ని సంపాదించుకుంటే.. అది మరింత సంచలనం అవుతుంది.