ప్రతి ఐదేళ్లకూ ఒక పార్టీని అధికారం నుంచి దించడం, మరో పార్టీకి పట్టగట్టడం రాజస్తాన్ సంప్రదాయం! జాతీయ రాజకీయాలు, కేంద్రంలో ఎవరున్నారు అనే లెక్కలేవీ లేకుండా.. ప్రతి ఐదేళ్లకూ ఒక సారికి అటున్న వారిని ఇటు, ఇటున్న వారిని అటు చేస్తూ ఉంటారు రాజస్తానీ ఓటర్లు. అయితే ఈ సారి మాత్రం అందుకు విరుద్ధంగా రాజస్తానీ ప్రజల తీర్పు ఉండబోతోందని అంటున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు.
మూడో తేదీన ఫలితాలు వెల్లడి కాబోతున్న నేపథ్యంలో.. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వెల్లడైన రాజస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం.. కాంగ్రెస్ కు మరో అవకాశం దక్కవచ్చు! అది కూడా కాంగ్రెస్ కు మంచి మెజారిటీతో వరసగారెండో సారి రాజస్తాన్ లో అధికారం దక్కే అవకాశం ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంటున్నాయి.
అందులో ఇండియాటుడే ముందుంది. ఈ మీడియా సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ కు 119 నుంచి 141 సీట్లు దక్కే అవకాశం ఉంది. ఇదే జరిగితే సంచలనమే అవుతుంది. ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చేసే రాజస్తానీలకు గెహ్లాట్ ప్రభుత్వంపై మక్కువ తీరనట్టే అవుతుంది.
న్యూస్ నేషన్ సర్వే కాంగ్రెస్ కు 99 నుంచి 103 సీట్లు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. వంద మార్కు దాటిందంటే మినిమం మెజారిటీని అందుకున్నట్టే! ఒక రాజస్తాన్ సంప్రదాయం ప్రకారం మార్పు జరిగి బీజేపీకి ఛాన్సు అనే సర్వేలు కూడా కొన్ని ఉన్నాయి.
టైమ్స్ నౌ సర్వే ప్రకారం.. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ దక్కే అవకాశం ఉంది. రిపబ్లిక్ టీవీ కూడా బీజేపీకే అధికారం అంటూ పేర్కొంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ అధికారం దక్కించుకుంటుందని ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ తో పాటు.. కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పినవీ ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యన ఒకటీ రెండు సీట్లు తేడా ఉండవచ్చని చెప్పిన సర్వేలు కూడా కొన్ని వెల్లడయ్యాయి. మొత్తానికి రాజస్తాన్ ఫలితం ఆసక్తిని రేపబోతోంది.