తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ప్రధానం కాంగ్రెస్ దే పై చేయి అని అంటున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ చిత్తయిపోతుందని కూడా ఎగ్జిట్ పోల్స్ ఏవీ చెప్పడం లేదు! కాంగ్రెస్ కు విజయం ఖాయం అంటున్న ఎగ్జిట్ పోల్స్ కూడా బీఆర్ఎస్ కు మినిమం 40 సీట్లు అని అంటున్నాయి! మరి కొన్ని సర్వేలు కాస్త ముందుకు వెళ్లి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దాదాపు సమాన సీట్లను సాధించుకున్నా పెద్ద ఆశ్చర్యం లేదంటున్నాయి. ఈ రెండు పార్టీల్లో ఏదీ మినిమం మెజారిటీ మార్కు 60 సీట్లను అందుకోకపోయినా ఆశ్చర్యం లేదంటున్నాయి.
మరి అలాంటి పరిస్థితే వస్తే.. ఏడు సీట్లతో ఎంఐఎం కింగ్ మేకర్ అయినా పెద్ద ఆశ్చర్యం లేదు! ప్రస్తుత పరిస్థితిని బట్టి.. ఎంఐఎం బీఆర్ఎస్ వైపే నిలబడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఐదారు సీట్లు తగ్గిన పక్షంలో ఎంఐఎం అటు మొగ్గే అవకాశం ఉంది!
అదే అవకాశం బీజేపీకి కూడా ఉంది! బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు ప్రకటించి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వెళ్లవచ్చేమో! గతంలో బీఆర్ఎస్ ను బీజేపీ చాలా విమర్శించింది. ఎంఐఎం-బీఆర్ఎస్ ఒకటే అని నిందించింది. అయితే.. ఎన్నికల సమయంలో కొందరు బీజేపీ నేతలు కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ నయం అనే ప్రకటనలు చేసి ఆశ్చర్యపరిచారు. మమ్మల్ని గెలిపించకపోయినా ఫర్వాలేదు కాంగ్రెస్ గెలవకూడదు అనే తరహాలో కమలం పార్టీ నేతలు మాట్లాడారు. బీఆర్ఎస్ కు అవకాశం దక్కినా ఫర్వాలేదనే అని పరోక్షంగా వారు చెప్పినట్టుగా అయ్యింది.
మరి ఇదే లెక్కన.. బీఆర్ఎస్ కు ఫలితాల తర్వాత బీజేపీ దోస్తుగా మారవచ్చునేమో! బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ విమర్శించింది. మరి హంగ్ తరహా పరిస్థితి వస్తే.. బీఆర్ఎస్-బీజేపీ చేతులు కలిపితే అదే నిజం అవుతుంది. అయితే.. ఎంఐఎం, బీజేపీలు బీఆర్ఎస్ కు ఒక రకంగా సమదూరంలో ఉన్నట్టే! బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల్లో దేంతో అయినా జత కలవగలదు!
అయితే హంగ్ పరిస్థితి వస్తే తెలంగాణ రాజకీయం పరమకంగాళీగా మారొచ్చు. రాజకీయ అస్థిరత ఇలాంటి బుల్లి రాష్ట్రానికి అసలే మాత్రం పనికికాదు కూడా! ఆ తరహా పరిస్థితి రాకుండా, ఏదో ఒక పార్టీకి మినిమం మెజారిటీ వస్తేనే అది తెలంగాణకు శ్రేయస్కరం!