తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే పట్టం అంటున్నాయి! ప్రముఖ వార్తా సంస్థల ఎగ్జిట్ పోల్స్ లెక్కల్లో కాంగ్రెస్ కే మెజారిటీ సీట్లు దక్కే అవకాశం ఉంది.
ఫలితాల విడుదలకు మూడు రోజుల సమయమే ఉన్నప్పటికీ.. ఈ ఎగ్జిట్ పోల్స్ ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి. మూడో తేదీన కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో.. పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ వివరాలు కాంగ్రెస్ కు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.
అధికార బీఆర్ఎస్ అధికారం కోల్పోయి, కాంగ్రెస్ కు అధికారాన్ని అప్పగించే అవకాశం ఉందని.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. సీఎన్ఎన్-న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ హంగ్ తరహా పరిస్థితులు ఏర్పడతాయని కాంగ్రెస్ ది పై చేయి అని అంటోంది.
ఆరా, జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి 60 సీట్ల వరకూ దక్కే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆరా కాంగ్రెస్ కు 58 నుంచి 67 సీట్లు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. జన్ కీ బాత్ కాంగ్రెస్ కు 48 నుంచి 64 సీట్లు అని పేర్కొంది.
పీపుల్ పల్స్, చాణక్య సర్వేలు కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 62 నుంచి 72 సీట్లు, చాణక్య సర్వే ప్రకారం 67 నుంచి 78 సీట్లు దక్కే అవకాశం ఉంది.
ఇక బీఆర్ఎస్ కు మినిమం మెజారిటీ అని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆత్మసాక్షి సర్వే ప్రకారం బీఆర్ఎస్ కు 58 నుంచి 63 సీట్లు అట! ఇక బీజేపీకి గరిష్టంగా 10 సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో చెప్పడం గమనార్హం. బీజేపీకి 4 నుంచి పది లోపు సీట్లు దక్కే అవకాశం ఉందని అన్ని సర్వేలూ దాదాపు ఒకే అంచనాను వేశాయి.