ఇద్దరు వివాహితుల మధ్యన లేదా ఒక సంబంధంలో ఎవరైనా ఒకరు వివాహితులు అయితే వాటిని వివాహేతర సంబంధాలుగానే పరిగణిస్తారు. మరి ఇలాంటి వైవాహికేతర సంబంధాలు ఎందుకు ఏర్పడతాయి అంటే.. సులువుగా వినిపించే అభిప్రాయం సెక్స్! శృంగారం కోసమే ఇలాంటి బంధాలు ఏర్పడతాయనేది కామన్ గా ఉన్న అభిప్రాయం.
ఇది నిజమే కావొచ్చు! మరి ఇది నిజమే అయితే.. ఆల్రెడీ వివాహంలో ఉన్న వారికి శృంగారం సులువుగానే లభించేది కదా, అలాంటప్పుడు మళ్లీ పక్క చూపులు ఎందుకు? అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే వైవాహిక జీవితంలో శృంగారంలో సంతృప్తి లేకపోవడం అనే విశ్లేషణ ఇక్కడ తేలికగానే వినిపిస్తుంది కూడా! కానీ.. రిలేషన్ షిప్ కౌన్సెలర్లు చెప్పే మాటేంటంటే.. అన్ని వివాహేతర సంబంధాలు కూడా కేవలం సెక్స్ కోసమే ఏర్పడవు అని!
కేవలం శృంగారం కోసమే వివాహేతర సంబంధాల వైపు చూసే వారు ఉండొచ్చు, అదే సమయంలో కొందరు వైవాహిక జీవితంలో లభించని ఎమోషనల్ రిలేషన్ షిప్ కోసం కూడా అలా పక్క చూపులు చూసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. దాంపత్యంలో చాలా సహజమైన తీరు ఏమిటంటే.. ఒకరి అభిప్రాయానికి మరొకరు పెద్ద విలువ ఇచ్చుకోకపోవడం.
ఒకరి అభిరుచిని మరొకరు ఖాతరు చేయకపోవడం! అవతలి వాళ్ల అభిరుచిని తేలిక చేయడం కూడా దాంపత్యంలో జరిగే పనే! భార్యభర్తల ఆసక్తులు పరస్పరం నచ్చాలనే నియమం ఏమీ లేకపోగా.. పరస్పరం విరుద్ధమైన తీరును బలపరుచుకోవడం కూడా జరుగడం సహజమే! ఇక్కడే ఎమోషనల్ గ్యాప్ వస్తుందనేది రిలేషన్షిప్ కౌన్సెలర్లు చేసే విశ్లేషణ.
అరేంజ్డ్ మ్యారేజ్ లో కావొచ్చు, లేదా లవ్ మ్యారేజ్ లో కావొచ్చు.. దీర్ఘకాలం పాటు ఇద్దరూ ఒకే పేజ్ లో ఉండటం కష్టం. భార్యకు సినిమా నచ్చితే భర్తకు క్రికెట్ నచ్చొచ్చు! ఇద్దరికీ నచ్చే అంశం కామనే అయినా.. అప్పుడు మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు. కాబట్టి ఇద్దరే ఒకే దాని గురించి మాట్లాడుకోవడం లేదా, ఇద్దరూ ఒకే అంశం ద్వారా మానసికమైన దగ్గరి తనాన్ని ఫీల్ కావడం అంత తేలిక కాదు! కేవలం క్రికెట్, సినిమా వంటి అంశాలే కాదు.. ఒకరికి ఇంట్లో ఉండటం ఇష్టం, మరొకరికి బయట తిరగడం ఇష్టం!
ఇలా మొదలుపెడితే.. అనునిత్యం చాలా అంశాల్లో పరస్పరం విరుద్ధమైన అభిరుచులు, ఆసక్తులు ఉంటాయి. అలాంటప్పుడు ఒకరి ఆసక్తికి మరొకరు గౌరవం ఇచ్చుకోవడం లేదా, ఒకరి కోసం ఒకరు దానికే కట్టుబడి ఉండటం.. నిజమైన ఎమోషనల్ బాండేజ్. అది కుదరనప్పుడు అచ్చంగా తన అభిరుచినే కలిగి ఉన్న మరో వ్యక్తితో బాండేజ్ ఏర్పడే పరిస్థితి వస్తే దాన్నే ఎమోషనల్ ఎఫైర్ అంటున్నారు కౌన్సెలర్లు.
మరి ఈ ఎమోషనల్ ఎఫైర్ అనేది.. ఇరుగుపొరుగుల మధ్యనో, ఆఫీసులోనే ఉండవచ్చు. ఇద్దరికీ ఇష్టమైన వాటి గురించి చర్చించుకోవడం, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, సుదీర్ఘ విశ్లేషణలు చేసుకోగలగడం.. ఇదంతా వారి మధ్యన ఏర్పడిన ఎమోషనల్ ఎఫైర్ కు సంకేతం. మరి ఈ ఎమోషనల్ ఎఫైర్ ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందనేది వేరే కథ. ఫ్రెండ్స్ తరహాలో అలానే మిగలవచ్చు, అంతకు మించి కూడా ఇలాంటి పరిస్థితులు దారి తీయవచ్చు.
ప్రధానంగా దాంపత్యంలో కమ్యూనికేషన్ డిస్ కనెక్ట్, ఎమోషనల్ నీడ్ ను దాంపత్యంలో మీట్ కాలేకపోవడం, ఒకరినొకరు అభినందించుకునే పరిస్థితి లేకపోవడం, కొత్తదనాన్ని ఇష్టపడటం వంటివి ఈ ఎమోషనల్ ఎఫైర్స్ కు దారి తీస్తాయనేది రిలేషన్షీప్ కౌన్సెలర్ల మాట!