రోడ్లు బాగాలేకపోతే ఫొటోలు తీసి ట్విట్టర్ లో పెడతారు. మ్యాన్ హోల్ ఓపెన్ చేసి పెడితే ఇనస్టాలో రీల్స్ చేస్తారు. ట్యాక్సులు పెరిగితే సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తారు. చివరికి సినిమా టికెట్ రేటు పెరిగినా గగ్గోలు పెడతారు. కానీ పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు మాత్రం వేయరు. ఇదీ హైదరాబాదీల పరిస్థితి. మధ్యాహ్నం ఒంటిగంట సరికి హైదరాబాద్ లో పోలింగ్ కేవలం 21 శాతం. అంటే కనీసం పావు వాటా హైదరాబాదీ ఓటర్లు కూడా ఓటు వేయలేదన్నమాట.
ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, హైదరాబాద్ కు అస్సలు మంచిది కాదు. కేవలం 20-30శాతం పోలింగ్ తో నెగ్గిన ఎమ్మెల్యేకు పూర్తి ప్రజామద్దతు ఉందని ఎలా నమ్ముతాం. ఏం చేసినా చేయకపోయినా ఆ పాతిక శాతం పోలింగే కదా జరిగేది అనే అభిప్రాయాన్ని నేతలకు కల్పిస్తోంది హైదరాబాదీ ఓటర్లు కాదా. ఓటు వేయడం ఇష్టంలేకపోతే ఇంట్లో కూర్చోకూడదు, వెళ్లి నోటాకైనా ఓటేయాలి. అప్పుడే కదా ప్రజాభిప్రాయం తెలిసేది.
పోలింగ్ డే అంటే వీళ్ల దృష్టిలో హాలిడే. ఎంచక్కా ఓటీటీలో సినిమాలు పెట్టుకుంటారు. అయిపోయిన క్రికెట్ మ్యాచుల రీప్లేలు చూసుకుంటారు. అవసరమైతే ఆఫీస్ లో అదనంగా మరో రోజు శెలవు పెట్టి కుటుంబంతో హాలిడేకి వెళ్తారు. మందుబాబులైతే ముందుగానే 2 ఫుల్ బాటిల్స్ రెడీ చేసి పెట్టుకుంటారు.
ఇంత పక్కా ప్లానింగ్ లో ఉన్న హైదరాబాదీలు, ఓ అరగంట కేటాయించి, పోలింగ్ స్టేషన్ కు వెళ్లడానికి మాత్రం ఆసక్తి చూపించరు. ఆ అరగంట కేటాయిస్తే, తమ జీవితంలో కీలకమైన క్షణాలు పోయినట్టు ఫీలవుతున్నారు. ఎవరికి ఓటేస్తే ఏముందిలే అనే నిర్లిప్తతను చూపిస్తున్నారు. తమకు కూతవేటు దూరంలోనే పోలింగ్ కేంద్రాలున్నాయనే విషయాన్ని మరిచిపోతున్నారు.
ఇలా ఓటింగ్ కు దూరంగా ఉన్న ప్రతి హైదరాబాదీకి, త్వరలోనే కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు. ఇలాంటి వాళ్లంతా సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెట్టడం మానుకోవాలి, ప్రభుత్వాన్ని విమర్శించడం పూర్తిగా కట్టిపెట్టాలి. ఎందుకంటే, వీళ్లు ఓటు వేయలేదు కాబట్టి, ప్రశ్నంచే హక్కు లేదు.
కొన్ని దేశాల్లో పాటిస్తున్నట్టు ఇండియాలో కూడా ఓటు హక్కుకు కొన్ని కండిషన్లు పెట్టాలి. ఓటు వేయకపోతే రేషన్ కట్ చేయాలి. ఉద్యోగులు ఓటు వేయకపోతే ఒక నెల శాలరీ ఆపాలి, కనీసం సగం శాలరీ కట్ చేయాలి. లేదా ఓటు వేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు కాబట్టి, అదనంగా మరో రోజు పని చేయించాలి. ఓటు వేయని వాడి ఇంటికి స్టిక్కర్ అతికించాలి. అవసరమైతే అతడి ఇంటికి నీటి సరఫరా కట్ చేయాలి. వేలికి సిరాగుర్తు ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్లను గుర్తించడం కూడా పెద్ద కష్టమేం కాదు.
ఇలా కాస్త కఠినంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చేసింది. లేదంటే సగం రోజు గడిచినా 21 శాతం పోలింగ్ ఏంటి? ఇప్పటివరకు ఓటేయని హైదరాబాదీలు సిగ్గుపడాలి.. ఇంత చదువు చదువుకొని ఏం ఉపయోగం..? ఇదేనా మీ తెలివి? దేశానికి కనీసం ఈమాత్రం కంట్రిబ్యూషన్ కూడా ఇవ్వలేరా?