తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీలో భారీగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వస్తాయి? అధికారం ఎవరిది? అనే విషయాలపై ఎక్కువగా పందేలు సాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ ఎక్కువ మంది బెట్టింగ్స్ వేస్తుండడం గమనార్హం. అలాగే బీఆర్ఎస్ 50 నుంచి 53 సీట్లకు పరిమితం అవుతుందని ఎక్కువ మంది బెట్టింగ్స్ పెడుతున్నారు.
బీజేపీ సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని పందేలు కాస్తున్నారు. అలాగే కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో మెజార్టీ, గెలుపోటములపై కూడా పందేలు కాస్తున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారని కూడా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. గజ్వేల్‌లో కేసీఆర్‌కు 20 వేలకు మించి మెజార్టీ రాదని పెద్ద ఎత్తున బెట్టింగ్స్ కాస్తున్నారు.
కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో మెజార్టీపై బెట్టింగ్స్ పెట్టడం గమనార్హం. తెలంగాణలో ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్‌కు దక్కుతాయని భారీగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. ఖైరతాబాద్‌లో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గెలుపుపై కూడా బెట్టింగ్స్ కాస్తున్నారు. మరీ ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 8 సీట్లలో కనీసం డిపాజిట్లు కూడా రావని పెద్ద ఎత్తున బెట్టింగ్స్ కాస్తున్నారు. అయితే జనసేన వైపు నుంచి పందేలు పెట్టడానికి భయపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇవన్నీ ఇలా వుండగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారనే అంశంపై కూడా బెట్టింగ్స్ పెడుతుండడం విశేషం. ఎక్కువ మంది రేవంత్‌రెడ్డిపై మొగ్గు చూపుతున్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలపై కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలున్నాయనే చర్చకు తెరలేచింది. మొత్తానికి బీఆర్ఎస్ అధికారంలోకి రాదని ఎక్కువ మంది పందెంరాయుళ్లు బెట్టింగ్స్ పెడుతున్నారు. ఈ ఎన్నికలు ఎవరి కొంపలు కూలుస్తాయో మరి!