ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి ఊపిరాడకుండా చేస్తున్నారు. అంతేకాదు, చంద్రబాబు, ఈనాడు అధిపతి రామోజీరావును ఆయన విడిచిపెట్టడం లేదు. తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్ ఆసక్తికరంగా వుంది.
“ఎవరిని వెన్నుపోటు పొడిచి చంపేశారో అదే ఎన్టీఆర్ సినిమాలు రోజూ ‘ఈటీవీ’లో వేస్తూ వెన్నుపోటుదారుడిని నిలబెట్టటానికి మరో వెన్నుపోటుదారుడి ప్రయత్నం. బాగుంది! చంపటానికైనా, పేరు వాడుకోవటానికైనా మేమే హక్కుదారులం అన్నట్లుంది వీళ్ళ వ్యవహారం”
చంద్రబాబు, రామోజీరావు వైఖర్లను విజయసాయిరెడ్డి తప్పు పట్టారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, తిరిగి ఆయన పేరు వాడుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విజయసాయిరెడ్డి వెటకరించారు. బాబుకు రామోజీరావు తన మీడియాను అడ్డు పెట్టుకుని లబ్ధి కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారనే భావనను బయట పెట్టారు. ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటు పొడిస్తే, ఆయనకు మద్దతు ఇచ్చినా ఎల్లో పత్రికాధిపతిని మరో వెన్నుపోటుదారుడిగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు.
ఈటీవీలో రోజూ ఎన్టీఆర్ సినిమాలు వేయడం వెనుక రాజకీయ ఉద్దేశం వుందని విజయసాయి అభిప్రాయం. బాబును రాజకీయంగా నిలబెట్టడానికి వెన్నుపోటుదారుడైన రామోజీ ప్రయత్నం బాగుందంటూ ఆయన వ్యంగ్యాస్త్రం విసరడం గమనార్హం. చంపటానికైనా, ఎన్టీఆర్ పేరు వాడుకోడానికైనా హక్కుదారులం తామే అని వెన్నుపోటుదారుల ధోరణి వుందని విజయసాయిరెడ్డి దెప్పి పొడవడం బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.