పిచ్చోడా… అర్థం చేసుకో!

తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అధికారం ఎవ‌రిద‌నే విష‌య‌మై స్ప‌ష్టంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. కర్నాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, తెలంగాణ‌లో ఆ పార్టీ గ్రాఫ్ క్ర‌మంగా పెరుగుతూ వెళ్లింది.…

తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అధికారం ఎవ‌రిద‌నే విష‌య‌మై స్ప‌ష్టంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. కర్నాట‌క‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, తెలంగాణ‌లో ఆ పార్టీ గ్రాఫ్ క్ర‌మంగా పెరుగుతూ వెళ్లింది. అయితే ముక్కోణ‌పు పోటీలో కాంగ్రెస్‌, బీజేపీలు ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల్చుకుంటాయ‌ని, త‌ద్వారా త‌మ‌కు మ‌రోసారి అధికారం ఖాయ‌మ‌ని బీఆర్ఎస్ నేత‌లు ధీమాగా ఉండేవారు.

అయితే రోజులు గడిచే కొద్దీ ప‌రిస్థితులు మారుతూ వ‌చ్చాయి. బీజేపీ బ‌ల‌హీన‌ప‌డుతూ, కాంగ్రెస్ పుంజుకోసాగింది. దీంతో కాంగ్రెస్‌తోనే త‌మ‌కు ముప్పు వుంద‌ని సీఎం కేసీఆర్‌, బీఆర్ఎస్ నేత‌లు ప‌సిగ‌ట్టారు. కాంగ్రెస్‌ను బద్నాం చేయ‌డానికి ఇందిరాగాంధీ పాల‌న‌ను కేసీఆర్ తెర‌పైకి తెచ్చారు. కాంగ్రెస్ వ‌స్తే నియంతృత్వ పాల‌న‌, ప‌దేప‌దే ముఖ్య‌మంత్రుల మార్పిడి వుంటుంద‌ని కేసీఆర్ విమ‌ర్శించారు.

అన్నింటికి మించి కాంగ్రెస్ వ‌స్తే వ్య‌వ‌సాయానికి కేవ‌లం మూడు గంటల క‌రెంట్ మాత్ర‌మే వుంటుంద‌ని కేసీఆర్ భ‌య‌పెట్టేందుకు య‌త్నించారు. కాంగ్రెస్ వ‌స్తే అస‌లు క‌రెంట్ వుండ‌ద‌ని కూడా కేసీఆర్ విమ‌ర్శించారు. కాంగ్రెస్ కావాలా? క‌రెంట్ కావాలా?… ప్ర‌జ‌లే తేల్చుకోవాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. అలాగే మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ ర‌గిల్చేందుకు త‌న స్టైల్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ క‌లిసిపోయింద‌ని, దాని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు 50 సంవ‌త్స‌రాలు ప‌డింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

కేసీఆర్, బీఆర్ఎస్ నేత‌ల విమ‌ర్శ‌ల‌ను కాంగ్రెస్ నేత‌లు రేవంత్‌రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క గ‌ట్టిగానే తిప్పి కొడుతున్నారు. ఇవాళ భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే క‌రెంట్‌… అర్థం చేసుకో పిచ్చోడా అంటూ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఉచిత క‌రెంట్ పేటెంట్ కాంగ్రెస్‌దే అని ఆయ‌న విమ‌ర్శించారు. రోజుకో దుష్ప్ర‌చారం చేస్తే ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని ఆయ‌న అన్నారు. దంచుదాం, దించుదాం, సంప‌ద‌ను పేద‌ల‌కు పంచుదాం అని భ‌ట్టి చెప్పుకొచ్చారు.