హిందీతో పాటు సౌత్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది యానిమల్ మూవీ. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా తెలుగు ట్రయిలర్ కూడా రిలీజైంది. ఈ ట్రయిలర్ చూసిన మెగా ఫ్యాన్స్ చిరంజీవి పాత సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. అదే కిరాతకుడు.
తండ్రికొడుకు బంధంతో తెరకెక్కింది యానిమల్ సినిమా. తండ్రి కొడుకును ఎలా చూడాలనుకుంటాడో, దానికి విరుద్ధంగా కొడుకు పెరుగుతాడు. దీంతో ఒక దశలో “క్రిమినల్ ను కన్నాం మనం” అంటాడు తండ్రి. కొడుక్కి మాత్రం తండ్రి అంటే చాలా ప్రేమ. తన తండ్రి కోసం కొడుకు ఏం చేశాడు, ఈ క్రమంలో అతడు ఎంత వయొలెంట్ గా మారాడనేది యానిమల్ సినిమా.
చిరంజీవి హీరోగా నటించిన కిరాతకుడు సినిమా కూడా దాదాపు ఇలానే ఉంటుంది. తండ్రి ఉన్నత స్థితిలో ఉంటే, కొడుకు మాత్రం తప్పుడు దారిలోకి ఎంటర్ అవుతాడు. స్మగ్లింగ్ లాంటి పనులు చేస్తాడు. చివరికి తండ్రిని రక్షించుకొని, తనకు తండ్రిపై ఉన్న ప్రేమను తెలియజేస్తాడు.
ట్రయిలర్ లో రణబీర్ కపూర్ షాట్స్, కిరాతకుడులో చిరంజీవి షాట్స్ ను కంపేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్, తండ్రి ఆశయాలకు విరుద్ధంగా కొడుకు రెబల్ గా తయారవ్వడమే. ఈ ఒక్క కామన్ పాయింట్ తో మెగాభిమానులు ఆసక్తికర చర్చకు తెరలేపారు.
ఒరిజినాలిటీకి పెట్టింది పేరైన సందీప్ వంగ, యానిమల్ ను తనదైన స్టయిల్ లో తెరకెక్కించారు. వయొలెన్స్ ను పీక్స్ లో చూపించారు. తండ్రిపై కొడుకు ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా యానిమల్ సినిమా కిరాతకుడు ఛాయల్లో ఉందా లేదా అనే విషయం మరో 2 రోజుల్లో తేలిపోతుంది.