టీడీపీ అభ్య‌ర్థుల ఎంపిక ఇంత అధ్వాన‌మా?

వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఒక్క‌టే త‌మ‌ను గ‌ట్టెక్కిస్తుంద‌ని టీడీపీ భావిస్తున్న‌ట్టుంది. అభ్యర్థుల ఎంపిక గ‌మ‌నిస్తే ప‌ర‌మ ద‌రిద్రంగా ఉంద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. తాజాగా నంద్యాల టికెట్‌ను మాజీ మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్‌కు టీడీపీ ఖ‌రారు…

వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఒక్క‌టే త‌మ‌ను గ‌ట్టెక్కిస్తుంద‌ని టీడీపీ భావిస్తున్న‌ట్టుంది. అభ్యర్థుల ఎంపిక గ‌మ‌నిస్తే ప‌ర‌మ ద‌రిద్రంగా ఉంద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. తాజాగా నంద్యాల టికెట్‌ను మాజీ మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్‌కు టీడీపీ ఖ‌రారు చేసింది. ఇంత వ‌ర‌కూ నంద్యాల ఇన్‌చార్జ్‌గా ఉన్న భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని టీడీపీ ప‌క్క‌న పెట్టింది. టీడీపీ అధికారంలోకి రాగానే మొద‌టి కోటాలోనే ఎమ్మెల్సీ ఇస్తామ‌ని ఆయ‌న‌కు చంద్ర‌బాబు స‌ర్ది చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ‌త నాలుగేళ్లుగా టీడీపీ కోసం రాబిన్‌శ‌ర్మ ఇస్తున్న స‌ర్వే నివేదిక‌లు బూడిద‌లో పోసిన పన్నీరైన చందంగా మారింద‌ని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మైనార్టీలకు ఇచ్చేందుకే బ్ర‌హ్మానంద‌రెడ్డిని ప‌క్క‌న పెట్టామ‌ని టీడీపీ చెబుతోంది. ఈ వాద‌న పేల‌వంగా వుంది. నిజంగా మైనార్టీల‌కే టికెట్ ఇవ్వాలంటే క‌ర్నూలు, క‌డ‌ప‌, మ‌ద‌న‌ప‌ల్లె లాంటి నియోజ‌క‌వ‌ర్గాల‌ను రాయ‌ల‌సీమ‌లో ఎంచుక‌ని వుండాల్సింది.

అక్క‌డ మైనార్టీల‌కు ఇచ్చి వుంటే టీడీపీకి కొద్దోగొప్పో ప్ర‌యోజ‌న‌క‌రంగా వుండేది. నంద్యాల‌లో ఫ‌రూక్‌పై ముస్లింల‌లోనే వ్య‌తిరేక‌త వుంద‌ని చేదు వాస్త‌వాన్ని టీడీపీ విస్మ‌రించింది. నంద్యాల‌లో యువ‌కుడైన బ్ర‌హ్మానంద‌రెడ్డిని వైసీపీకి ప్ర‌త్యామ్నాయ నాయ‌కుడిగా శిల్పా కుటుంబాన్ని వ్య‌తిరేకించే ప్ర‌జ‌లు చూస్తున్నారు. సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో వుంటున్న ఫ‌రూక్ చివ‌రికి సొంత వాళ్ల‌కు కూడా ఏమీ చేయ‌లేద‌నే అసంతృప్తి వుంది. ఇక్క‌డే టీడీపీ లాజిక్ మిస్ అయ్యి త‌ప్పులో కాలేసింది.

ఫ‌రూక్‌కు టికెట్ ఖ‌రారు చేయ‌డం ద్వారా టీడీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గుర‌య్యాయి. ఎటూ ఓడిపోతామ‌ని, అలాంట‌ప్పుడు వైసీపీతో గొడ‌వ మ‌న‌కెందుక‌ని ఎన్నిక‌ల‌కు ముందే నంద్యాల‌లో అస్త్ర స‌న్యాసం చేసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ఎఫెక్ట్ నంద్యాల లోక్‌స‌భ స్థానంపై కూడా ప‌డుతుంద‌నే చ‌ర్చ‌కు తెరలేచింది. ఫ‌రూక్‌కు టికెట్ ఖ‌రారు చేయ‌డంతో ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగ‌డానికి మాండ్ర శివానంద‌రెడ్డి వెనుకంజ వేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థుల‌ను అసెంబ్లీ బ‌రిలో నిల‌బెట్ట‌డం ద్వారా, ఆ ప్రభావం ఎంపీ స్థానాల‌పై ప‌డుతుంద‌నే ఆందోళ‌న టీడీపీలో నెల‌కుంది. నంద్యాల‌లో బ్ర‌హ్మానంద‌రెడ్డికి టికెట్ ఇచ్చి, ఫ‌రూక్‌కు ఎమ్మెల్సీ ఇస్తామ‌ని చెప్పి, ఇద్ద‌రినీ ప్ర‌చారానికి వ‌దిలి పెట్టి వుంటే, శిల్పా కుటుంబానికి గ‌ట్టి పోటీ ఇచ్చి వుండేవాళ్ల‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. 

క‌డ‌ప‌లో కూడా ఇదే ర‌క‌మైన త‌ప్పు టీడీపీ చేసింది. అక్క‌డ మైనార్టీకి టికెట్ ఇచ్చి వుంటే, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషాపై సొంత వాళ్ల‌లో అసంతృప్తి, అలాగే మిగిలిన సామాజిక వ‌ర్గాల్లో సానుకూలత క‌లిసి వ‌చ్చేవి.

క్షేత్ర‌స్థాయిలో సానుకూల అంశాల‌ను రాజ‌కీయంగా సొమ్ము చేసుకోవ‌డంలో టీడీపీ విఫ‌ల‌మ‌వుతోంద‌నేందుకు అభ్య‌ర్థుల ఖరారే నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా అభ్య‌ర్థుల ఎంపిక చేప‌డితే మాత్రం, మ‌రోసారి టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు!