ముస్లింలను కాంగ్రెస్‌ వైపు మళ్లిస్తున్న అమిత్ షా!

భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్నదని, ఒకరికి ఒకరు సహకరించుకునేలాగా, కాంగ్రెస్ పార్టీ గెలవకుండా మాత్రమే వీరు ఎన్నికలలో తలపడుతున్నారని ప్రజలలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.  ఈ…

భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్నదని, ఒకరికి ఒకరు సహకరించుకునేలాగా, కాంగ్రెస్ పార్టీ గెలవకుండా మాత్రమే వీరు ఎన్నికలలో తలపడుతున్నారని ప్రజలలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.  ఈ రెండు పార్టీల వ్యవహార సరళి కూడా ప్రజల అనుమానాలను బలపరిచే విధంగానే సాగుతోంది. 

ఎన్నికల తరువాత, భారత రాష్ట్ర సమితికి అధికారానికి తగినంత బలం రాకపోయినట్లయితే గనుక.. బేషరతు మద్దతు ఇచ్చి  కెసిఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి బిజెపి వెనుకాడదనే ప్రచారం కూడా ఉంది. వాతావరణం ఇలా ఉండగా.. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాటలు పరోక్షంగా కేసిఆర్ విజయవకాశాలను దెబ్బతీసే విధంగా కనిపిస్తున్నాయి.

భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలలో ముస్లింల పట్ల తమ వ్యతిరేకతను మరింతగా చాటుకుంటూ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నది. మామూలుగానే ముస్లింల పట్ల విద్వేషాన్ని ప్రచార అస్త్రంగా వాడుతూ ఉంటే చాలు.. హిందువుల ఓట్లు అన్ని గంప గుత్తగా తమ పార్టీ వైపు మరలతాయనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఆ అస్త్రాన్ని మరింత ఘాటుగా బయటకు తీశారు. తెలంగాణలో కూడా ముమ్మరంగా ఉపయోగిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీకి ముస్లింల ఓటు పడే అవకాశం లేదు గనుక.. ఓటు బ్యాంకుని దూరం చేసుకున్నా సరే, వారిపై వ్యతిరేకతను చూపించడం ద్వారా హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేయవచ్చును అని వారి వ్యూహం లాగా కనిపిస్తుంది.. అందుకే ముస్లిములకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగిస్తామని అమిత్ షా ప్రతి సభలో పదే పదే చెబుతున్నారు. 

ఇలాంటి ప్రకటన హిందూ చాందస ఓట్లు కొన్నింటిని బిజెపి వైపు మళ్ళించవచ్చు. అయితే ప్రత్యేకించి తెలంగాణలో.. ముస్లిం ఓటు బ్యాంకు తమదే అనుకుంటున్న భారాసకు వారిని దూరం చేయవచ్చు అనే అంచనాలు సాగుతున్నాయి.

మజ్లిస్ పార్టీ ఓపెన్ గా భారాసకు మద్దతిస్తున్నది.ముస్లింలు అందరూ కారు గుర్తుకే ఓటు వేయాలని ఒవైసీ పిలుపు ఇస్తున్నారు. కొంత మేర ఆ ప్రచారం పనిచేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అమిత్ షా వచ్చి ముస్లింల ఓట్లను తొలగిస్తాం అంటోంటే.. వారితో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారనే ప్రచారాన్ని నమ్ముతున్న ముస్లింలు అమిత్ షాను మాత్రమే కాదు, కేసీఆర్ ను కూడా దూరం పెట్టాలని అనుకుంటారు. ఆటోమేటిగ్గా ఈ ఓటు బ్యాంకు పూర్తిగా కాంగ్రెసు వైపు మళ్లే అవకాశం ఉంటుందని కూడా పలువురు భావిస్తున్నారు.