రాష్ట్రవ్యాప్తంగా ఖమ్మం నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఖమ్మంలో గెలుపెవరిదనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ కండువా కప్పుకోగానే ఖమ్మం నియోజకవర్గంలో చక్రం తిప్పారు తుమ్మల నాగేశ్వరరావు. భారీ.. భారీ డైలాగులు చెబుతూ ప్రత్యర్థి నాయకుల హవా తగ్గించారు. పై చేయి దిశగా ముందుకు కదిలారు. కానీ చివరికి వచ్చే సరికి తుమ్మల వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. ఖమ్మంలో సిచ్యువేషన్ ఒక్కసారిగా మారిపోయింది. ఖమ్మంలో మళ్లీ ఎగిరేది గులాబి జెండానే అన్నట్లుగా పరిస్థితిని మార్చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్. తుమ్మలకు మించి వ్యూహాలు పన్నుతూ పువ్వాడ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.
బీఆర్ఎస్ టికెట్ తనకే దక్కుతుందని ఆశించిన తుమ్మలకు గులాబీ బాస్ మొండి చేయి చూపించారు. దీంతో గులాబి పార్టీపై అలకబూనిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరారు. అప్పటి నుంచి ఖమ్మంలో కారు స్పీడుకు బ్రేకులు వేసే దిశగా పావులు కదిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మరోనేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి.. తీవ్రంగా కసరత్తు చేశారు. ప్రధానంగా తాను పోటీ చేస్తున్న ఖమ్మంలో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని తుమ్మల చెమటోడుస్తున్నారు.
తాను అనుకున్నట్లుగానే మొదట్లో తుమ్మల దూకుడుగానే ముందుకు వెళ్లారు. బీఆర్ఎస్ను ఓడించేందకు సర్వశక్తులు ఒడ్డారు. కానీ అటు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ వెంటనే అలర్ట్ అయ్యారు. గత రెండు పర్యాయాలుగా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న అజయ్ తాను చేపట్టిన అభివృద్ధే ఎజెంగా ప్రజల్లో విస్తృతంగా పర్యటించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసిన తుమ్మలపై విజయం సాధించిన పువ్వాడకు ఆయన బలాబలాలపై పూర్తి అవగాహన ఉంది. ఈక్రమంలో తుమ్మల ఎత్తులకు పై ఎత్తులకు వేస్తూ.. వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నుతూ అజయ్ ముందుకు కదిలారు. ప్రజలను తన వైపు తిప్పుకుంటున్నారు.
పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో ఖమ్మం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. నగరపాలక సంస్థ లో ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం రూ. 2వేల కోట్లు వెచ్చించారు. 4 కోట్లతో లకారం చెరువును సుందరీకరించారు. రూ. 100 కోట్లతో గోళ్లపాడు చానల్, రూ. 23 కోట్లతో నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను నిర్మించారు. మిషన్ భగీరథ అమృత్ పథకంలో భాగంగా ఖమ్మంలో రూ. 229 కోట్లతో మంచినీటి సరఫరా పనులు పూర్తయ్యాయి. ఇంటింటికీ నల్లా పథకంలో 84 వేల గృహాలకు నల్లాలు, 21,946 ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. రూ. 70 కోట్లతో ధంసలాపురం ఆర్వోవీ బ్రిడ్జిని నిర్మించారు.
ముస్తాఫానగర్ నుంచి ధంసలాపురం గేటు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఖమ్మం నగరంలోని నిరుపేదలకు టేకులపల్లి వద్ద 1,210 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాల్వలు, కూరగాయల మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణాలు చేశారు. ఖమ్మం నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎన్నెస్పీ క్యాంపులో రూ.25 కోట్లతో నూతన బస్‌స్టాండ్‌ను నిర్మించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. ప్రజావసరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చేందుకు రూ. 10 కోట్లతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు.
అలాగే ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల కోసం వెళ్లకుండా ఖమ్మం యువత కోసం ఐటీ హబ్‌ను పువ్వాడ అజయ్ తీసుకొచ్చారు. ఇప్పటికే రూ. 25 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్ మొదటి దశ నిర్మాణం పూర్తయింది. దాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ రెండో దశ నిర్మాణానికి రూ.36 కోట్లు మంజూరు చేయించారు. నియోజకవర్గంలో ఏకంగా 1100 మంది దళితులకు రూ. 10 లక్షల చొప్పున దళితబంధు అందజేశారు. నియోజకవర్గంలోని బీసీలకు 300 మందికి లక్ష చొప్పున రుణాలను అందజేశారు. విడతల వారీగా బీసీలందరికీ రుణాలు అందించేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించారు.
అటు ఖమ్మం నియోజకవర్గంలో మూడు లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. అందులో ముస్లిం, మైనార్టీల ఓట్లు 40 వేలకు పైనే ఉన్నాయి. గెలుపోటములపై వీరి ఓట్లు ప్రభావం చూపనున్నాయి. ప్రస్తుతానికి మైనార్టీల చూపు బీఆర్ఎస్ వైపే ఉన్నట్లు తెలుస్తోంది. చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి ప్రణాళికలతో నియోజకవర్గ ప్రజలకు పువ్వాడ చేరువయ్యారు. దీంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించారు. కొన్ని టీమ్‌లను రంగంలోకి దించి బీఆర్ ఎస్ చేసిన అభివృద్ధి ఫలాలను ఇంటింటికీ వివరించడంలో పువ్వాడ సక్సెస్ అయ్యారు. దీంతో మంత్రి తుమ్మలకు ఎదురీత తప్పడం లేదు. మరి పోటాపోటీగా సాగుతున్న ఖమ్మం గడ్డపై ఎవరు జెండా పాతుతారనేది తెలియాలంటే మూడో తేదీ వరకు వేచిచూడాల్సిందే.