ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగర అభివృద్ధికి టిటిడి నిధులు ఖర్చు చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు గుప్పిస్తూ గగ్గోలు పెడుతున్నారు. రోడ్ల నిర్మాణానికి, తిరువీధులను శుభ్రం చేయడానికి శ్రీవారి నిధులను ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి నగర అభివృద్ధికి టిటిడి నిధులు వెచ్చించడం పాపపు కార్యంలాగా మాట్లాడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం టిటిడి నిధులను వాడుకుంటున్నారని ఆరోపిస్తూ తాము ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టం ఏమంటే….ఓ వర్గం మీడియా కూడా ఇదే ధోరణితో వార్తా కథనాలు వండి వార్చుతోంది.
అసలు టిటిడి చరిత్ర, మూలాలు తెలిసిన వారెవరూ ఇటువంటి విమర్శలు చేయరు. సామాజిక కార్యక్రమాలకు శ్రీవారి నిధులను వెచ్చించడాన్ని తప్పుబట్టరు. తిరుమల తిరుపతి దేవస్థానం దశాబ్దాలుగా ఎస్‌వి ఆర్ట్స్ కళాశాల, ఎస్‌వి జూనియర్ కళాశాల, ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ, జూనియర్, పాలిటెక్నికల్ కళాశాలలు, ఓరియంటల్ కళాశాల, అదే విధంగా పలు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంస్థలపైన కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. అదే విధంగా టిటిడి ఆధ్వర్యంలోని బర్డ్ ఆస్పత్రి విశిష్టమైన సేవలతో ప్రపంచ ఖ్యాతి సాధించింది. టిటిడి నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రి దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తున్నారు.
ఇప్పుడున్న ధోరణి, రాజకీయాలతో కూడిన ఆలోచనలు నాడువుండి వుంటే….ఇన్ని విద్యాసంస్థలను, ఆస్పత్రులను టిటిడి ఏర్పాటు చేయగలిగేదా..! అనే అనుమానం వస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాలను టిటిడి విస్తృతం చేయాలని నాడు జనం నుంచే పెద్ద డిమాండ్ వుండేది. టిటిడి చేపట్టిన కార్యక్రమాలను రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు హర్షించేవి. ఇప్పుడు తద్విరుద్ధంగా వుంది. టిటిడి చేస్తుంటే తప్పుబడుతున్నారు. ప్రతిదాన్నీ రాజకీయ కోణంలో చూస్తూ విమర్శిస్తున్నారు.
ఇంకా ముందుకెళితే… ఒకప్పుడు టిటిడి తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు విద్యుత్ సరఫరా చేసింది. అప్పట్లో విద్యుత్ సరఫరా బాధ్యతలను ఏజెన్సీలకు ఇచ్చేవారు. అటువంటి ఏజెన్సీని తీసుకున్న టిటిడి వందల గ్రామాలకు, రైతులకు విద్యుత్ సరఫరా చేసింది. అదే విధంగా తిరుపతి చుట్టుపక్కల వున్న చెరువుల నిర్వహిణ బాధ్యతను కూడా టిటిడి చేపట్టింది. చెరువుల మరమ్మతులు, తూముల రిపేర్లు, కాల్వల నిర్వహణ వంటివన్నీ టిటిడి చేసేది. ఇప్పుడైతే టిటిడికి, చెరువులకు ఏమిటి సంబంధం అని నిలదీసేవారు. రైతులకు టిటిడి విద్యుత్ సరఫరా ఎందుకు చేయాలి? అని గగ్గోలు పెట్టేవారు.
ఆధ్యాత్మిక సంస్థలంటే కేవలం ఆధ్యాత్మిక చింతన కోసమేనా? ఆ ధోరణి ఇటీవల కాలంలో విపరీతమవుతోంది. వాస్తవంగా ఒకప్పుడు ఆధ్యాత్మిక సంస్థల సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రతిరూపంగా వుండేవి. అనేక మఠాలు విద్యాసంస్థలు నెలకొల్పాయంటే అందులోని పరమార్థం అదే. కంచిమఠం వంటివి ఆస్పత్రులూ స్థాపించి నిర్వహిస్తున్నాయి. ఇందులోని ఉద్దేశం సుస్పష్టం… సమాజ హితానికి దోహదం చేయడమే. అంతెందుకు శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. అది ఇటీవల నిర్వహణా లోపం వల్ల కునారిల్లుతుండవచ్చుగానీ… ఒకనాడు అది ఎంతో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ.
జనానికి ఆధ్యాత్మికత బోధించడం మినహా సామాజిక సేవా కార్యక్రమాలతో తమకు సంబంధం లేదని, అదంతా ప్రభుత్వాల బాధ్యతని ఆనాడు భావించివుంటే…చాలా విద్యాసంస్థలు, ప్రతిష్టాత్మక ఆస్పత్రులు ఏర్పాటయ్యేవి కావు. టిటిడి చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను ఇప్పటిలా అడ్డుకుని వుంటే.. ఒక ఎస్‌వి ఆర్ట్స్ కాలేజీ, ఒక పద్మావతి డిగ్రీ కాలేజీ, ఒక బర్డ్ ఆస్పత్రి, ఒక స్విమ్స్ మనుగడలో వుండేవి కావు.
ఇక ప్రస్తుత విషయానికొస్తే.. తిరుమల శ్రీవారి దర్శనార్ధం నిత్యం లక్ష మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. టిటిడికి చెందిన అనేకమైన సంస్థలు, కార్యాలయాలు, విశ్రాంతి భవనాలు, దేవాలయాలు తిరుపతి అంతటా వున్నాయి. తిరుపతికి వస్తున్న లక్షలాది మంది భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం స్థానిక కార్పొరేషన్‌కు తలకు మించిన భారంగా వుంది.
అందుకే తిరుపతిలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి టిటిడి తోడ్పాటు అందించాలని చాలా కాలంగా స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు కొన్ని రోడ్ల నిర్వహణ బాధ్యతను గతంలోనే టిటిడి చేపట్టింది. అయితే ఇది సరిపోదని ఇంకాస్త వెన్నుదన్ను అవసరమని స్థానికులు కోరుతూ వస్తున్నారు. తిరుపతి అభివృద్ధికి ఏటా టిటిడి నిధుల నుంచి 200 కోట్లు ఖర్చు చేయాలని వామపక్ష పార్టీలు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అదే విధంగా తిరుపతి ఒక జాతీయ స్థాయి నగరంగా రూపుదాల్చుతోంది.ఈ క్రమంలో తిరుపతి అభివృద్ధికి టిటిడి చేయూత ఇవ్వాల్సిన ఆవశ్యకత పెరిగింది.
తిరుపతి కూడా తిరుమల కొండలా అద్దంలా వుంచాల్సిన అవసరం వుంది. ఇది ఒక కార్పొరేషన్‌కు మాత్రమే సాధ్యమయ్యేది కాదు. అందుకే రోడ్ల నిర్మాణంలో, పారిశుద్ధ్య నిర్వహణలో టిటిడి పాలుపంచుకుంటోంది. ఇదేదో నేరమైనట్లు ప్రచారం చేస్తున్నారు. శ్రీవారి నిధులను ఎవరో కొల్లగొట్టినట్లు గగ్గోలుపెడుతున్నారు.
ఇలా ప్రచారం చేస్తున్నవారు గుర్తించాల్సింది ఒకటే… రాజకీయాల కోసం తిరుపతి నగర అభివృద్ధిని అడ్డుకుంటే స్థానికులే గాదు.. యాత్రీకులూ హర్షించరు. రాజకీయంగా లబ్ధిపొందడం కోసం చేస్తున్న ఈ వ్యతిరేక ప్రచారం వారికి మరింత నష్టం చేస్తుంది తప్ప లాభం చేకూర్చదు.
– ఆదిమూలం శేఖర్