నారా లోకేశ్ పాదయాత్ర టీడీపీ పాలిట యువగళం. కానీ వైసీపీ దృష్టిలో అది హాస్యగళం. మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చూస్తే, లోకేశ్ పాదయాత్రను కామెడీ అని అర్థం చేసుకుంటారు. రెండున్నర నెలల తర్వాత ఎట్టకేలకు నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ప్రారంభించారు. నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయాలనే లక్ష్యంతో లోకేశ్ నడక ప్రారంభించిన సంగతి తెలిసిందే.
చంద్రబాబునాయుడు అరెస్ట్, 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడంతో టీడీపీ కార్యకలాపాలు ఆగిపోయాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు 52 రోజులు ఉండగా, లోకేశ్ మాత్రం పాదయాత్రను 75 రోజులకు పైగా నిలిపేయడం గమనార్హం. దీంతో లోకేశ్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. లోకేశ్‌లో ఆరంభ శూరత్వమే తప్ప, పట్టుదల లేదనే విమర్శ బలంగా వినిపించింది.
ఎట్టకేలకు ఇవాళ ఆగిన చోటైన రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద తిరిగి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రపై మంత్రి అంబటి రాంబాబు తనదైన స్టైల్‌లో ట్విటర్ వేదికగా సెటైర్ విసిరారు.
“ప్రారంభమయిన “హాస్యగళం”.. విని, చూసి……..నవ్వుకోండి! “
లోకేశ్ పాదయాత్రకు టీడీపీ పెట్టుకున్న పేరు యువగళమైతే, దాన్ని హాస్యగళంగా అంబటి అభివర్ణించారు. హాస్యగళాన్ని విని, చూసి నవ్వుకోవాలని అంబటి సూచించారు. అంబటి విమర్శించినట్టు లోకేశ్ తన పాదయాత్రను హాస్యగళంగా మారుస్తారా? లేక సీరియస్‌గా కొనసాగిస్తారా? అనేది రానున్న రోజుల్లో తేలుతుంది. బాబు అరెస్ట్‌కు ముందు పాదయాత్రలో ప్రత్యర్థులపై లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడే వారు. అయితే అరెస్ట్ తర్వాత ఆయన ఏం మాట్లాడ్తారో చూడాలి.