ఓట్లు దండుకోవాల‌న్న దురాశ, ఆత్రుత‌, అహంకారం!

రైతుబంధు ప‌థకం చుట్టూ తెలంగాణ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. ఇక ఎన్నిక‌ల‌కు ఎక్కువ స‌మ‌యం కూడా లేదు. ఈ నెల 28న ప్ర‌చారం ముగుస్తుంది. ఇక ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేయ‌డం ఒక్క‌టే మిగిలి వుంది.…

రైతుబంధు ప‌థకం చుట్టూ తెలంగాణ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. ఇక ఎన్నిక‌ల‌కు ఎక్కువ స‌మ‌యం కూడా లేదు. ఈ నెల 28న ప్ర‌చారం ముగుస్తుంది. ఇక ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేయ‌డం ఒక్క‌టే మిగిలి వుంది. ఇప్ప‌టికే ఆ ప‌నిలో రాజ‌కీయ పార్టీల నేత‌లు మునిగితేలుతున్నారు. బీఆర్ఎస్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గొప్ప అవ‌కాశం ఇచ్చిన‌ప్ప‌టికీ, ఆ పార్టీ నేత‌ల అత్యుత్సాహం కొంప ముంచింది.

రైతుబంధు ప‌థ‌కం కింద ఈ నెల 28న 70 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేల కోట్ల‌కు పైగా సొమ్ము జ‌మ కావాల్సి వుండింది. అయితే దీన్ని వాడుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో ఈసీకి చిక్కి, చివ‌రికి అనుమ‌తిని ఉప‌సంహ‌రించుకునే వ‌ర‌కూ తెచ్చుకుంది. ఈ నేప‌థ్యంలో రైతుద్రోహి మీరంటే మీర‌ని బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల నేత‌లు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఘాటైన ట్వీట్ చేశారు.

“రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామా – అల్లుళ్లకు లేదు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు  ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు.  పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం” అని రేవంత్ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను వెన‌క్కి తీసుకుంటూ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను ఆయ‌న షేర్ చేశారు.

రైతుల‌కు డ‌బ్బు అందకుండా కాంగ్రెస్ నేత‌లే అడ్డుకున్నార‌నే ప్ర‌చారాన్ని ఇప్ప‌టికే బీఆర్ఎస్ నేత‌లు మొద‌లు పెట్టారు. అయితే ఎవ‌రి ప్ర‌చారాన్ని రైతులు న‌మ్ముతార‌నేది ముఖ్యం. దాన్నే బ‌ట్టి గెలుపు అవ‌కాశాలు ముడిప‌డి వున్నాయి. ఏమ‌వుతుందో చూద్దాం.