మోస్ట్ హ్యాపెనింగ్ శ్రీలీలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. స్కంద నుంచి ఈ దెబ్బల పరంపర మొదలైంది. అందులో ఆమె పాత్రపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. భగవంత్ కేసరి కాస్త ఆదుకున్నప్పటికీ ఆదికేశవతో విమర్శల వాన మళ్లీ మొదలైంది. ఎక్స్ పోజింగ్ కు తప్ప ఆమె పాత్ర ఎందుకూ పనికిరాలేదనే కామెంట్స్ పడ్డాయి.
అయితే ఇవి కొన్ని రోజులు మాత్రమే. మరో 10 రోజుల్లో ఎక్స్ ట్రా – ఆర్డినరీ మేన్ సినిమా థియేటర్లలోకి వచ్చేస్తోంది. అది రిలీజైన తర్వాత ఆదికేశవ గురించి అంతా మరిచిపోతారని కొంతమంది భావిస్తున్నారు. అయితే శ్రీలీలకు ఆ ఆనందం కూడా లేకుండా చేశాడు హీరో నితిన్. ఎక్స్ ట్రా – ఆర్డినరీ మేన్ సినిమాలో శ్రీలీలది ఫక్తు రొటీన్ పాత్ర అని చెప్పకనే చెప్పేశాడు.
“దర్శకుడు సినిమాలో నా పాత్రను చాలా బాగా డిజైన్ చేశాడు. నా క్యారెక్టర్ తర్వాత రావు రమేష్ పోషించిన తండ్రి పాత్రకు అంత పేరొస్తుంది. ఇక హీరోయిన్ విషయానికొస్తే, ఓ కమర్షియల్ సినిమాలో హీరోయిన్ కు ఎంత స్కోప్ ఉంటుందో శ్రీలీలకు కూడా అంతే స్కోప్ ఉంటుంది. ఇది లవ్ స్టోరీ కాదు కాబట్టి హీరోయిన్ కు అంత ఇంపార్టెన్స్ ఉండదు. కమర్షియల్ ప్యాట్రన్ లో 3-4 సీన్లు, ఓ సాంగ్.. మళ్లీ కొన్ని సీన్లు ఓ సాంగ్.. ఇలా ఉంటుంది.”
ఇలా విడుదలకు ముందే శ్రీలీల పాత్రపై క్లారిటీ ఇచ్చేశాడు నితిన్. దీంతో శ్రీలీల మరోసారి రొటీన్ క్యారెక్టర్ ఎంచుకుందనే విషయం స్పష్టమైంది. నితిన్ కామెంట్స్ పై ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.