మంత్రి అంబటి రాంబాబు అన్నట్టే పాదయాత్రలో లోకేశ్ కామెడీ రీస్టార్ట్ చేశారు. విని, చూసి కడుపుబ్బా నవ్వుకునేలా లోకేశ్ కామెడీ చేస్తున్నారు. చంద్రబాబును అన్యాయంగా స్కిల్ స్కామ్లో అరెస్ట్ చేశారని విమర్శించారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి బాబును జైల్లో 53 రోజుల పాట్టు మగ్గిపోయేలా చేశారని తప్పు పట్టారు. ఈ విషయాన్ని బాబుకు బెయిల్ ఇచ్చిన హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొందని లోకేశ్ చెప్పి తన అజ్ఞాన్ని ప్రదర్శించారు.
తనను కూడా విడిచి పెట్టలేదన్నారు. తనపై కూడా కేసు పట్టి సీఐడీ విచారణకు పిలిచారని ఆయన చెప్పుకొచ్చారు. దమ్ము, ధైర్యంతో సీఐడీ విచారణకు వెళ్లానన్నారు. అసలు కామెడీ ఇక్కడి నుంచే లోకేశ్ మొదలు పెట్టారు. అవినీతిపై తన ప్రమేయం వుందని ఒక్క ఆధారమైనా చూపిస్తారా? అని సీఐడీ విచారణాధికారులను అడిగానన్నారు. కానీ అక్కడున్న అధికారి ఏం చెప్పారో తెలుసా… “అయ్యా మీ చేతిలో ఎర్ర బుక్ వుంది. నా పేరు రాయరు కదా” అని లోకేశ్ కామెడీ చేయడం విశేషం.
తాను ఏనాడూ తప్పు చేయలేదన్నారు. ఆ ధైర్యంతోనే సైకో జగన్ అని పిలవగలుగుతున్నట్టు లోకేశ్ చెప్పారు. ఆఖరికి తన తల్లిని కూడా విడిచిపెట్టలేదన్నారు. అలాగే తన భార్య బ్రాహ్మణిపై కూడా కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని మంత్రులు ఎగతాళి చేశారని లోకేశ్ ఆరోపించారు. ఆ మంత్రులకు చెబుతున్నా… కౌంట్ డౌన్ మొదలైందని లోకేశ్ హెచ్చరించారు. ఇదే రకంగా కేసులు పెట్టుకుంటే పోతే భయపడేవాళ్లెవరూ లేరన్నారు.
భయాన్ని పరిచయం చేసే బాధ్యతల్ని వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని సభాముఖంగా లోకేశ్ ప్రకటించడం గమనార్హం. తమపై ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తమదే అన్నారు.