ఆంధ్రలోనూ అదే స్ట్రాటజీ

నిన్న మొన్నటి వరకు జనసేనకు ఆంధ్రలో ఎంత మంది అభ్యర్ధులు వుంటారు అనే దాని కన్నా, ఎక్కడ వున్నారు అసలు అన్నది డిస్కషన్ గా వినిపించేది. ఎందుకంటే జనసేన సంస్థాగత నిర్మాణం మీద అంతగా…

నిన్న మొన్నటి వరకు జనసేనకు ఆంధ్రలో ఎంత మంది అభ్యర్ధులు వుంటారు అనే దాని కన్నా, ఎక్కడ వున్నారు అసలు అన్నది డిస్కషన్ గా వినిపించేది. ఎందుకంటే జనసేన సంస్థాగత నిర్మాణం మీద అంతగా దృష్టి పెట్టకపోవడం వలన. అయితే ఇటీవల మాత్రం పార్టీ నియామకాలు చాలా జరిగాయి. అయినా కూడా ఎన్నికల్లో పోటీ చేయగల సత్తా, స్తోమత వున్న అభ్యర్ధులు జనసేనకు ఎంత మంది వుంటారు అనే ప్రశ్న వుండనే వుంది. 

పాతిక నుంచి ముఫై సీట్లు జనసేనకు తెలుగుదేశం పార్టీ కేటాయిస్తుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ వుంది. అంత మంది అభ్యర్ధులు కావాల్సి వుంటుంది. పోటీకి ఎవరైనా రెడీ కావచ్చు. కానీ వైకాపా అభ్యర్ధులను ఢీకొనే బలమైన వారు కావాలి. అదీ సమస్య.

అయితే దీనికి సమాధానం తెలంగాణలో దొరికింది. తెలంగాణలో ఎన్నికల వేడి అలుముకునే వరకు పవన్ కళ్యాణ్ కాలు కదపలేదు. ఏ హడావుడి లేదు. వున్నట్లుండి అరడజను మంది అభ్యర్ధులను ప్రకటించారు. ఎవరయ్యా వారు అంటే అందులో నలుగురు ముందు రోజున భాజపా లోంచి వచ్చి జనసేన కుండువా కప్పుకున్నవారే. అంటే భాజపా ఆరు సీట్లు కేటాయించినట్లే కేటాయించి, నాలుగు సీట్లు ఈ రూపంలో వెనక్కు తీసుకుందన్నమాట. జనసేన తరపున చిరకాలంగా జెండా మోస్తున్న వారికి దొరికినవి రెండే రెండు.

ఇప్పుడు ఆంధ్రలో జరగబోయేది కూడా ఇదే అని రాజకీయ వర్గాల బోగట్టా. జనసేనకు ఎడ్జ్ వున్న స్థానాలను గుర్తిస్తారట. ఆ స్థానాల్లో కనుక తెలుగుదేశం గట్టి నేతలు వుంటే, వారిని జంప్ చేయించి, జనసేన కండువా కప్పి పోటీకి నిలబెడతారట. జనసేనకు నిజంగా బలమైన నాయకుడు వున్న చోట మాత్రం వాళ్లకే వదిలేస్తారట. 

తెలుగుదేశం పార్టీ కేటాయించే ముఫై సీట్లలో కనీసం పది పదిహేను ఇలా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్లే వారికే కేటాయిస్తారనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎవరు జనసేనలోకి వలస వెళ్లాలి అన్నది ఇప్పటికే ఫిక్స్ అయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

కానీ ఇక్కడ సమస్య ఒకటే. తెలంగాణలో కనుక ఒకరోజు ముందు నలుగురిని తీసుకుచవ్చి కండువాలు కప్పి టికెట్ లు ఇచ్చినా నడిచిపోయింది. కానీ ఆంధ్రలో జనసైనికుల సమర్ధత సంగతి అలా వుంచితే, ఆశావహులు ఎక్కువ మందే వున్నారు. ఇప్పుడు ఇలాంటి స్కీము అమలు చేస్తే వారంతా గడబిడ చేయడం అన్నది ఖాయం. గతంలో ప్రజారాజ్యం టైమ్ లో లాస్ట్ మినిట్ లో టికెట్ ల కేటాయింపు మీద నానా గడబిడ జరిగింది. టికెట్ లు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి.

కానీ మరో సమస్య ఏమిటంటే, తెలుగుదేశానికి అవసరమైన సీట్లు కొన్ని వున్నాయి. వాటిని జనసేనకు ఇస్తే కొన్ని ఇబ్బందులు వున్నాయి. ముఖ్యంగా ఓటు ట్రాన్స్ ఫర్మేషన్ జరగకపోవచ్చు. అందుకే అలాంటి సీన్లు కొన్ని ఎంపిక చేసి, ముందుగానే జనసేనకు కేటాయిస్తున్నట్లు ఫీలర్ లు వదిలి, దాంతో తేదేపా నుంచి జంప్ లు జరిపించే ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది.

మొత్తానికి ఆంధ్రలో జనసేన సీట్లు, తెదేపా టికెట్ లు అనే స్కీము వుంటుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.