బీఆర్ఎస్‌కు న‌ష్టం తెచ్చిన హ‌రీష్‌రావు నోటి దురుసు!

మంత్రి హ‌రీష్‌రావు నోటి దురుసే బీఆర్ఎస్‌కు న‌ష్టం తెచ్చింద‌ని ఆ పార్టీ నాయ‌కులు వాపోతున్నారు. స‌రిగ్గా ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసే రోజే, వేల కోట్ల ప్ర‌భుత్వ సొమ్ముతో ఓట్ల‌ను చ‌ట్ట‌బద్ధంగా కొనుగోలు చేసే సువ‌ర్ణావ‌కాశాన్ని…

మంత్రి హ‌రీష్‌రావు నోటి దురుసే బీఆర్ఎస్‌కు న‌ష్టం తెచ్చింద‌ని ఆ పార్టీ నాయ‌కులు వాపోతున్నారు. స‌రిగ్గా ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసే రోజే, వేల కోట్ల ప్ర‌భుత్వ సొమ్ముతో ఓట్ల‌ను చ‌ట్ట‌బద్ధంగా కొనుగోలు చేసే సువ‌ర్ణావ‌కాశాన్ని జార‌విడుచుకున్నామ‌నే ఆగ్ర‌హం ఆ పార్టీ నేత‌ల్లో వుంది. రైతుబంధు ప‌థ‌కం కింద 70 ల‌క్ష‌ల మంది రైతులకు సాయం అందించేందుకు మూడు రోజుల క్రితం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన అనుమ‌తిని తాజాగా ఉప‌సంహ‌రించుకోవ‌డంతో బీఆర్ఎస్ షాక్‌లో వుంది.

అనుమ‌తి ఉప‌సంహ‌ర‌ణ‌కు ప్ర‌ధాన కార‌ణం మంత్రి హ‌రీష్‌రావు కామెంట్సే అని ఈసీ చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీంతో బీఆర్ఎస్ నాయ‌కులంతా హ‌రీష్‌రావుపై ఆగ్ర‌హంగా ఉన్నారు. అత్యుత్సాహంతో అస‌లుకే ఎస‌రు దెచ్చార‌నే కోపం తెలంగాణ అధికార పార్టీ నేత‌ల్లో క‌నిపిస్తోంది. రైతుబంధు ప‌థ‌కం నిధుల‌ను రైతుల ఖాతాల్లో వేసేందుకు అనుమ‌తి ఇచ్చి, ఇప్పుడు వెన‌క్కి తీసుకోడానికి గ‌ల కార‌ణాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది.

రైతుబంధు నిధుల విడుద‌ల‌ను ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకు ఉప‌యోగించుకోకూడ‌ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం గుర్తు చేసింది. అయితే నిబంధ‌న‌ల‌ను మంత్రి హ‌రీష్‌రావు ఉల్లంఘించార‌ని ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. ప‌లానా తేదీన‌, ప‌లానా స‌మ‌యానికి రైతుబంధు నిధులు ఖాతాల్లో ప‌డ‌తాయ‌ని, ఆ స‌మ‌యంలో మీ ఫోన్లు టింగ్ టింగ్ అంటాయ‌ని హ‌రీష్‌రావు చెప్పార‌ని ఈసీ పేర్కొంది.

బీఆర్ఎస్ త‌ర‌పున హ‌రీష్‌రావు పోటీ చేస్తుండ‌డంతో, ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్టు అయ్యింద‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. హ‌రీష్‌రావు కామెంట్స్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని, ప‌రిశీలించి నిధుల జ‌మ‌కు ఇచ్చిన అనుమ‌తిని వెన‌క్కి తీసుకున్న‌ట్టు ఈసీ వెల్ల‌డించింది. దీంతో బీఆర్ఎస్ నాయ‌కులు హ‌రీష్‌రావుపై మండిప‌డుతున్నారు. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల గురించి తెలిసి కూడా నోరు పారేసుకోవ‌డం దేనిక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.