ముందు ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు..

కాబోయే ముఖ్యమంత్రిని నేనే అంటే.. నేనే నెక్ట్స్ సీఎం అంటూ మొన్నటి వరకు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు ఎమ్మెల్యేల నుంచి సీనియర్ల వరకు అంతా సీఎం కుర్చీపై కన్నేశారు. తానే అంటే తానే…

కాబోయే ముఖ్యమంత్రిని నేనే అంటే.. నేనే నెక్ట్స్ సీఎం అంటూ మొన్నటి వరకు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు ఎమ్మెల్యేల నుంచి సీనియర్ల వరకు అంతా సీఎం కుర్చీపై కన్నేశారు. తానే అంటే తానే కాబోయే సీఎం అంటూ ప్రకటనలు గుప్పిచ్చారు. తీరా ఎన్నికల సమయం దగ్గరపడే సరికి కాంగ్రెస్ నేతలంతా తమ తమ స్థానాల్లో ఎలా గెలవాలి అన్న దాని మీద కీలకంగా దృష్టి పెట్టాల్సి వస్తోంది.. ఎమ్మెల్యేగా గెలవాలని తెగ కష్టపడుతున్నారు. సీఎం కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయాలి.. తమ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయాలి. కానీ ఇప్పుడు టి. కాంగ్రెస్ నేతల పరిస్థితి ఎమ్మెల్యేగా గెలిస్తే అదే పదివేలు అన్నట్లుగా ఉంది. 

మొన్నటి వరకు భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జానారెడ్డి, మధుయాష్కీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఇలా ఎవరికి వారు తానే సీఎం అని ప్రకటనలు చేశారు. భారీ స్థాయిలో డైలాగులు చెప్పారు. తనకు ఇప్పుడే సీఎం కావాలని లేకున్నా భవిష్యత్తులో కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతానంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. అటు సీనియర్ లీడర్ జానారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు అయితే బహిరంగంగానే తమకు సీఎం కావాలనే కోరిక ఉందని ప్రకటించారు. 

దసరా పండుగ వేళ తాను సీఎం కావాలనుకుంటున్నానని మనసులో మాట బయట పెట్టారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే ఇలా ఎవరికి వారు సీఎం కావాలని ఉందని ప్రకటనలు చేయడంపై ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులకు కొదవే లేదని.. సీఎం అభ్యర్థులు ఉన్నారని కానీ.. ఓటర్లే లేరని మంత్రికేటీఆర్ ఎద్దేవా చేశారు. ముందు సీఎం ఎవరో ప్రకటించి ప్రచారం చేయాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. అటు హరీశ్ రావు కూడా కాంగ్రెస్ సార్టీలో పది మంది ముఖ్యమంత్రులు ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

ఇకపోతే ముఖ్యమంత్రి కావాలంటే ఎన్నికలవేళ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలి. రాష్ట్రవ్యాప్తంగా సభలు, ర్యాలీలు నిర్వహించాలి. తమ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయాలి. వారి గెలుపు కోసం కృషి చేయాలి. కానీ ప్రకటనలు చేసిన నేతలు ఎవరు కూడా అలా చేయడం లేదు. అసలు వాళ్ల పరిస్థితే బాగోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో.. ముందు ఎమ్మెల్యేగా గెలిస్తే చాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సీఎం కుర్చీపై ఆశించిన నేతలంతా ఇత‌ర నియోజ‌క‌వర్గాల్లోని అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం చేయడం లేదు. 

ఒక‌టి రెండు చోట్ల‌ భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌చారం చేసిన‌ప్ప‌టికీ ఇప్పుడు ఆయ‌న కూడా మ‌ధిర‌కే ప‌రిమితం అయ్యారు. అటు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి  హుజూర్‌నగర్ వరకే పరిమితమయ్యారు. ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఉన్న అన్ని దారులను అన్వేశిస్తున్నారు. ఎప్పుడూ చేయ‌ని రాజ‌కీయాలు చేస్తున్నారు. కిడ్నాప్ రాజకీయాలు చేసేందుకు కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. ఎమ్మెల్యే సైదిరెడ్డి తన తరపున ఎన్నికల నిర్వహణ చూసే ఏజెన్సీ ప్రతినిధులను బలవంతంగా కారులో ఎక్కించుకొని.. కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఎట్టిపరిస్థితిలోనూ హుజూర్ నగర్‌లో గెలిచి తీరుతానని శపథం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్‌లో 50 వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు గెలుపు ఎనలేని కష్టాలు పడుతున్నారు. తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం శాసనసభ ఎన్నికల్లో కీలక పోటీ ఉన్న స్థానాల్లో మధిర ఒకటి. రెండున్నర లక్షలమంది ఓటర్లలో ఎనిమిదిన్నర వేల మందికి పైగా ఉన్న కొత్త ఓటర్లు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలతో పాటూ, పలు ఇతర పార్టీలు, ఆరుగురు స్వతంత్రులు, మొత్తం 15 మంది బరిలో ఉండటంతో మధిర శాసనసభ నియోజక వర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 

కాంగ్రెస్ త‌ర‌ఫున భట్టి విక్రమార్క ఇక్క‌డ పోటీలో ఉన్నారు. లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న కూడా సొంత నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అయ్యారు. ఇటీవ‌ల గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ప్ర‌చారం చేసిన‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత కేవ‌లం త‌న గెలుపుపైనే దృష్టి సారించారు. గత మూడుసార్లు పోటీచేసి భట్టి చేతిలో ఓటమిపాలయైన లింగాల కమల్ రాజు నాలుగో సారి కూడా ఇక్క‌డ బీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ ఉండడం, ఆయ‌న వైపు సానుభూతి ప‌వ‌నాలు వీస్తుండ‌డంతో భ‌ట్టి నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలివెళ్ల‌డం లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. అటు ఎల్బీ నగర్‌ నుంచి పోటీ చేస్తున్న మధు యాష్కీ గౌడ్‌కు కూడా ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఎల్బీ నగర్‌ను విడిచి బయటకు రావడం లేదు. పైగా తన గెలుపుపై నమ్మకం లేక ప్రచారానికి రావాల్సిందిగా ఇతర సీనియర్ నేతలను కోరుతున్నారు. 

ఇన్నిరోజులు నల్లగొండలో తనకు తిరుగులేదనకుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఓటమి భయం వెంటాడుతూనే ఉంది. గతంలో వరుసగా నాలుగు సార్లు నల్గొండ నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో.. వెంకటరెడ్డికి భయం పట్టుకుంది. 

అటు కొందరు నల్గొండకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లోకి వెళ్లడం.. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీలోకి వెళ్లడం, తిరిగి కాంగ్రెస్‌లో చేరడం వంటి అంశాలు వెంకటరెడ్డిపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఎంపీగా ఉన్నప్పటికి కూడా.. నల్లగొండపైనే కంప్లీట్‌గా ఫోకస్ పెట్టాడు. నల్గొండను విడిచి అడుగు బయట పెట్టడం లేదు. సీనియ‌ర్ నేత‌ జానారెడ్డి అయితే పోటీ నుంచి ముందే త‌ప్పుకున్నారు. ఇప్పుడు నాగార్జున సాగ‌ర్ నుంచి పోటీ చేస్తున్న ఆయ‌న కుమారుడు త‌ర‌ఫున ప్ర‌చారానికి ప‌రిమితం అయ్యారు.

అటు ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డికి కూడా ఈసారి గట్టి పోటీ ఎదురవుతోంది. సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. అటు బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో గట్టి పోటీ ఎదురవుతుండడంతో.. జగ్గారెడ్డి కూడా సంగారెడ్డిని విడిచి బయటకు రావడం లేదు.  ములుగు అసెంబ్లీ బ‌రిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్కకు ఈసారి గెలుపు కాస్త క‌ష్టంగానే ఉంది. రెండు పార్టీల నుంచీ విప్లవ భావాల‌కు చెందిన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండడమే ప్రధాన కారణం. 

బీఆర్‌ఎస్ అభ్యర్థిగా జెడ్పీ ఇంచార్జి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి పోటీలో ఉన్నారు. నాగజ్యోతి, సీతక్క ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడానికి తోడు ఇద్దరికి కూడా నక్సల్స్ నేపథ్యం ఉండడంతో ఇక్క‌డ గ‌ట్టి పోటీ ఉండ‌నుంది. సీతక్కకు కూడా ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇలా మొన్నటి వరకు తానే సీఎం.. తానే సీఎం అంటూ చెప్పుకున్న నేతలు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.