ఒక్క టికెట్ ధర అక్షరాలా 2400 రూపాయలు. ఇదేదో బ్లాక్ లో కొనుగోలు చేసిన టికెట్ రేటు కాదు. ప్రభుత్వ అనుమతితో, ఓ మల్టీప్లెక్స్ లో ఫిక్స్ చేసిన రేటు. ఢిల్లీలోని ఓ మల్టీప్లెక్స్ లో యానిమల్ సినిమా చూడాలంటే, ఒక టికెట్ కు చెల్లించాల్సిన మొత్తం ఇది.
రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక అనుమతులతో ఈ సినిమా కోసం రేట్లు పెంచేశారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని పీవీఆర్ డైరక్టర్స్ కట్ స్క్రీన్ లో రీ-క్లయినర్ టికెట్ రేటు 2400 రూపాయలకు చేరుకుంది. యానిమల్ సినిమాకు సంబంధించి దేశంలో గరిష్ఠ టికెట్ ధర ఇదే.
నార్త్ లోని కీలకమైన పట్టణాల్లోని మల్టీప్లెక్సుల్లో 500 రూపాయలకు తగ్గకుండా యానిమల్ టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు. ముంబయిలోని ఏదైనా మల్టీప్లెక్సులో యానిమల్ సినిమా చూడాలనుకుంటే 550 రూపాయలు చెల్లించాల్సిందే. ఇక ముంబయిలో గరిష్ఠ ధర 2200 రూపాయలుగా ఉంది.
సౌత్ విషయానికొస్తే, యానిమల్ సినిమాకు సంబంధించి బెంగళూరులో భారీ రేట్లు కనిపిస్తున్నాయి. సాధారణంగానే బెంగళూరు మాల్స్ లో టికెట్ రేట్లు ఎక్కువ. యానిమల్ రాకతో ఈ రేట్లు 35 నుంచి 55 శాతం పెరిగాయి. హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో యానిమల్ సినిమా టికెట్ రేట్లు సాధారణంగానే ఉన్నాయి.
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కింది యానిమల్ సినిమా. టీజర్, ట్రయిలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టే టికెట్ రేట్లు కూడా పెరిగాయి. మూవీ రిలీజైన వారం రోజుల తర్వాత ఈ ధరలు తగ్గుతాయి.